17 ఎకరాలు..107 పంటలు

  • సేంద్రియ సేద్యం…సాటి రైతులకు ఆదర్శం
మారం కరుణాకర్‌రెడ్డి తనుకున్న 17 ఎకరాల్లో కూరగాయలు, వివిధ రకాల పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ఆకుకూరలతో కలిపి 52 రకాల కూరగాయ పంటలు, 50 రకాల పండ్ల తోటలు, మూడు రకాల మొక్కజొన్న, సంవత్సరానికి రెండు పంటలు వచ్చే దేశవాళీ కంది, మిర్చి, పలు రకాల పూలను సాగు చేస్తున్నారు. మూడెకరాల్లో యాపిల్‌బేర్‌, రెండెకరాల్లో థాయ్‌ జామ, మూడెకరాల్లో సీతాఫలం, రెండెకరాల్లో దానిమ్మ పండిస్తున్నారు. ఈ తోటల్లో అంగుళం స్థలం కూడా వృథాగా ఉంచకుండా… ఎక్కువ శాతం అంతర పంటలు పండిస్తున్నారు.
కందిలో అంతర పంటగా బేబీ కార్న్‌, దోస, థాయ్‌జామలో అంతరపంటగా మినుము సాగు చేస్తున్నారు. ఆధునిక పద్ధతిలో సేం ద్రియ వ్యవసాయం చేసి లాభాలను గడిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కరుణాకర్‌రెడ్డి. దేశీ పంటలతో పాటు విదేశీ పంటలు పండించడం ఆయన ప్రత్యేకత. యాపిల్‌బేర్‌, థాయ్‌ జామ, కివీ ఫ్రూట్‌, థాయ్‌మ్యాంగో, స్టార్‌ ఫ్రూట్‌, ఫ్యాషన్‌ ఫ్రూట్‌, ఖర్జూర, డ్రాగన్‌ లాంటి విదేశీ పంటలను పండిస్తూ మార్కెట్‌కి పంపుతున్నారు. ఈ పంటలన్నిటికీ అవసరమైన ఎరువుల కోసం తన వ్యవసాయ క్షేత్రంలోనే సొంతంగా సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
రసాయనాలు వద్దు..
మన రైతు.. మన ఉత్పత్తి… మన ఆహారం.. రసాయనం వద్దు… ప్రకృతి సేద్యమే ముద్దు అంటూ విన్నూత్నరీతిలో కూరగాయలు, పండ్లు సాగుచేస్తున్న కరుణాకర్‌రెడ్డి.. ‘సేంద్రియ ఎరువులతో పండించిన పంటలతోనే ఆరోగ్యం.. ఆ పంటలనే నేరుగా మీ ఇంటికి చేరుస్తాం’ అంటున్నారాయన. సేంద్రియ పద్ధతిలో సాగు మెళకువలు చెప్తూ అన్నదాత స్వావలంబన దిశగా సూచనలిచ్చేందుకు పనిచేస్తున్న ‘ఎస్టా’ ఎన్జీవో అనే సంస్థలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఆ సంస్థ రసాయనాలు లేకుండా, సేంద్రియ ఎరువులనే వాడేలా ఆరు సంవత్సరాల ప్రణాళికతో ముందడుగు వేస్తున్నది.
ఆరు సంవత్సరాల అనంతరం రైతులు పూర్తి స్థాయిలో సేంద్రియ ఎరువులను వాడేందుకు వీలుగా అవగాహన కల్పిస్తున్నామంటున్నారు కరణాకర్‌రెడ్డి. సేంద్రియ సేద్యం చే పట్టే రైతులకు ఎస్టా కొన్ని సహజ ఎరువులు, పురుగు మందులు తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తుంది. వినియోగదారుల అవసరాల మేరకు సొసైటీలోని రైతులు పంటలు ఉత్పత్తి చేయటం, ఎలాంటి రసాయనాలు లేని, కలుషితం కాని ప్రకృతి సహజపద్ధతిలో రైతులు పండించిన స్వచ్ఛమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించటం ఎస్టా సంస్థ లక్ష్యాలని రఘునాథరెడ్డి చెప్పారు. వినియోగదారుల అవసరాలు, అభిరుచుల మేరకు పంటలు పండించటం. మార్కెట్‌ ధరకే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారుల ఇంటికి నేరుగా రోజూ అందించే దిశగా ఎస్టా సహకారంతో కృషి చేస్తున్నట్లు ఆ రైతు చెప్పారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, రఘునాథపాలెం
ఆ క్షేత్రమే ఓ పుస్తకం
దేశ విదేశీ పంటలను వైవిధ్య పద్ధతుల్లో పండిస్తున్న కరుణాకర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం రైతులు, వ్యవసాయ, ఇతర విద్యార్థులకు ఓ పుస్తకంలా మారింది. ఇప్పటికే పలు వ్యవసాయ కళాశాలల విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి వ్యవసాయశాఖ అధికారులు ఆయన పొలాన్ని సందర్శించారు. ఇక్కడి సాగు విధానాన్ని తెలుసుకునేందుకు ఇతర ప్రాంతాల రైతులు తరలొస్తుంటారు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *