అన్నపూర్ణకు ఆక్వా ముప్పు!

  • ఉప్పునీటి కయ్యలుగా మారుతున్న భూములు
లాభాల వేటలో పడి ఆక్వా సాగులో నిబంధనలకు నీళ్లొదలడంతో ఉభయగోదావరి జిల్లాల్లో సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. సాగుకు పనికిరాని చౌడు భూములు, పంట పండని భూములు, ముంపు భూముల్లో మాత్రమే ఆక్వా సాగు చేపట్టాలి.
సారవంతమైన భూముల్లో అనుమతులు లేకుండా చెరువులు తవ్వడం, మంచినీటితో రొయ్యల సాగు చేస్తామని చెప్పి అనుమతులు తీసుకుని, ఉప్పునీటితో సాగు చేయటం వల్ల భూగర్భ జలాలకు ముప్పు వాటిల్లుతోంది. ఉప్పునీటి కాలువల పక్కన ఉన్న చేలు మాత్రమే ఆక్వా సాగుకు అనుకూలం. సరిహద్దు రైతుల పొలాల్లో ఊటనీరు దిగకుండా చెరువు చుట్టూ మూడు మీటర్లు వదిలేసి ఊటబోదెలను తవ్వాలి. ఇందులోకి దిగిన ఊటనీరు పోవడానికి వీలుగా ఊటబోదెలను మురుగు కాలువలకు అనుసంధానం చేయాలి. ఈ నిబంధనలేవీ రైతులు పాటించడం లేదనే విమర్శలున్నాయి.
ఆక్వా సాగుదారులు భూమిలో 180-300 అడుగుల లోతు వరకూ బోర్లు తవ్వి ఉప్పు నీటిని బయటకు తెస్తున్నారు. రెండున్నర అడుగుల లోతు తవ్వాల్సిన చెరువును ఆరు అడుగుల వరకూ తవ్వుతున్నారు. ఎకరాకు 1.25 లక్షల రొయ్య పిల్లల్ని వేయాల్సి ఉండగా నాలుగు లక్షల వరకూ సీడ్‌ను వేస్తున్నారు.
రొయ్యల ఉత్పత్తి బాగుండాలని యాంటీబయాటిక్స్‌ విపరీతంగా వాడుతున్నారు. చిన్న సన్నకారు రైతులను బలవంతంగా ఒప్పించి వారి భూములను లాక్కుంటున్నారు. అనుమతులు రైతుల పేరన ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆక్వా సబ్సిడీలు, రుణమాఫీలు లీజుదారుల పరమవుతున్నాయి. సెలనీటి శాతం పెరిగిపోయి భూమి పొరల్లో సహజసిద్ధంగా ఉండే మంచినీటి వనరులు పాడైపోతున్నాయి.
పరిమితికి మించిన ఉప్పునీరు, యాంటీబయాటిక్స్‌ నేల పొరల్లో ఇంకిపోయి అంతిమంగా కెమికల్స్‌ కలిసిన ఉప్పుభూమిగా రూపాంతరం చెందుతుంది. సాగు పూర్తయిన తరువాత చెరువుల్లో ఉన్న ఉప్పునీటిని శుద్ధి చేసి మురుగు కాలువల్లోకి దింపాలి. కానీ అలా జరగడంలేదు. శుద్ధి కాని ఆ సాల్ట్‌వాటర్‌నే సాగుకు వినియోగిస్తున్నారు. దీంతో సాగుభూములు కూడా చౌడుబారిపోయే ప్రమాదం తలెత్తింది. మంచి నీటితో రొయ్యల సాగు చేపడతామని అనుమతులు తీసుకుని ఉప్పు నీటితో సాగు చేస్తున్నారు.
దీంతో గ్రామాల్లోని మంచినీటి బావులు, పంచాయతీ చెరువులు, పంట పొలాల్లో తవ్వుతున్న ఫారమ్‌ఫాండ్స్‌ నిరుపయోగమవుతున్నాయి. ప్రభుత్వం విదేశీ మారకద్రవ్య రూపంలో వచ్చే ఆదాయాన్ని చూస్తున్నది తప్ప, సహజసిద్ధమైన వనరులు నాశనమైపోతున్నాయనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్న దంటున్నారు నిపుణలు. ఈ తరహా ఆక్వా సాగు వల్ల సహజసిద్ధంగా లభించే మత్స్య సంపద కూడా అంతరించిపోతున్నది.
ఆక్వాజోన్‌ల ఏర్పాటు: ప్రసాద్‌, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆక్వా చెరువుల తవ్వకానికి పలు నిబంధనలు విధించాం. ప్రాంతాలవారీగా గ్రామసభలను నిర్వహించి ఆక్వా జోన్‌లను ఏర్పాటుచేస్తున్నాం. అనుమతులు లేకుండా చెరువులు తవ్వితే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అమలాపురం, కాజులూరు, కరప తదితర ప్రాంతాల్లో అనుమతులు లేని చెరువులను ఆపేశాం.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *