ఆర్గానిక్ హబ్.. ఆంధ్ర

  • 1.2 లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగు
  • డిసెంబర్‌ 31 నుంచి మళ్లీ పాలేకర్‌ శిక్షణా శిబిరం
వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేస్తున్నది. ఎరువులు, క్రిమి సంహారకాలు ఉపయోగించి చేసే సేద్యంతో దిగుబడులు పెరిగినా ప్రజల ఆరోగ్యం, నేలతల్లి ఆరోగ్యం ప్రమాదంలో పడ్డాయి. దాంతో దేశ ప్రజలంతా ఇప్పుడు సేంద్రియ ఆహారంపై దృష్టి సారించారు. ఫలితంగా సేంద్రియ ఉత్పత్తులకు ఆదరణ పెరగడంతో రైతులు సేంద్రియ సేద్యం వైపు మళ్లుతున్నారు. ఆహార పంటలైన వరి, మిర్చి, జొన్న, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, మినుము, పెసర, కంది వంటి అపరాల పంటలతో పాటు కూరగాయలు, ఉద్యాన పంటలన్నీ సేంద్రియంగా పండించేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నడుంకట్టింది.
సేంద్రియ పద్ధతుల్లో సేద్యం చేస్తే తప్ప వ్యవసాయానికి మంచి భవిష్యత్తు వుండదని భావించిన ప్రభుత్వం జీరో బడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ చేపట్టింది. దీని అమలుకు ప్రకృతి సేద్య నిపుణుడు సుభాష్‌ పాలేకర్‌ను సలహాదారుడిగా నియమించింది. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసింది. మొదటి విడతలో భాగంగా 2016 – 2022 మధ్య రాష్ట్రంలోని 2వేల గ్రామాల్లో 5 లక్షల రైతులతో 5 లక్షల హెక్టార్లలో నూరుశాతం సేంద్రియ సేద్యం సాధించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా సన్న, చిన్నకారు రైతులకు కనీసం రూ.50 వేల వార్షికాదాయం లభించాలని నిర్దేశించారు.
గత ఏడాది రాష్ట్రంలో జీరో బడ్జెట్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ ఆచరించిన పంటల్లో పంట కోత ప్రయోగాలు నిర్వహించగా, వరి, మినుము, మిర్చి, మొక్కజొన్న 27 శాతం నుంచి 32 శాతం అధిక దిగుబడులు నమోదైనట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. ప్రకృతి సేద్యం చేసిన కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులు గతేడాది కరవు పరిస్థితులు నెలకొన్నా, నెల రోజుల్లో వర్షాభావ పరిస్థితులను అధిగమించామని అంటున్నారు.
వర్షాభావం, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని, సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం రైతుకు మంచి ఫలితాలు ఇస్తుందని అనేక మంది రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు అజీమ్‌ ప్రేమ్‌జీ ఫిలాంద్రఫిక్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఇందుకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. అలాగే కేంద్ర, రాష్ట్ర సంస్థల ద్వారా మరో రూ.700 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌కు కేవలం సాంకేతిక సహకారమే కాకుండా సేంద్రియ పదార్థాల తయారీకి తగిన వస్తువులను ఇవ్వాలని అనేకమంది రైతులు కోరుతున్నారు.
సేంద్రియ వేదికగా…
సేంద్రియ సేద్యం ద్వారా రానున్న 8 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్గానిక్‌ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనలో గతేడాది 704 గ్రామాల్లో 61వేల హెక్టార్లలో 40,656 మంది రైతులు ప్రకృతి సేద్యం వైపు దృష్టి మరల్చారు. ఈ ఏడాది 972 గ్రామాల్లో ఈ పద్ధతి అమలవుతున్నది. ఇప్పటికి లక్షా 20వేల ఎకరాల్లో లక్షా 39 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
దీని అమలు కోసం 399 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌కు ఇద్దరు కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్లు, ఒక క్లస్టర్‌ యాక్టివిస్ట్‌లను నియమించింది. సేంద్రియ వ్యవ సాయాన్ని ఆచరించి, అనుభవం గడించిన రైతులనే క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్స్‌గా రైతు సాధికార సంస్థ నియమించింది. మరో 8వేల మంది రైతులకు డిసెంబరు 31 నుంచి జనవరి 8 వరకు గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి సేద్యంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులు డ్వాక్రా తరహాలో స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడడం విశేషం. ప్రస్తుతం 4800 గ్రూపులు రూ.1.8 కోట్లు పొదుపు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *