ఇచ్చోడలోఆర్గానిక్‌ బొప్పాయి

  • లాభాల బాటలో గిరిజన రైతులు
ఆదిలాబాద్‌ అనగానే పత్తి, సోయా పంటలు గుర్తుకు వస్తాయి. ఆ జిల్లా రైతులు దశాబ్దాలుగా ఆ పంటలే సాగు చేస్తూ కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. కానీ ఈ ఏడాది ఆదిలాబాద్‌లోని పలువురు గిరిజన రైతులు ఉద్యాన పంటల సాగు బాట పట్టారు. పంట మార్పిడికి ప్రాధ్యానత ఇవ్వడం, అంతరపంటలు సాగు చేయడం, నూతన యాజమాన్య పద్ధతుల ద్వారా ఖర్చులు తగ్గించుకుని దిగుబడులు పెంచుకునేందుకు యత్నిస్తున్నారు. ఇచ్చోడ మండలం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన రైతు దుర్వ ముండే తనకున్న రెండెకరాల భూమిలో బొప్పాయి సాగు చేపట్టాడు.
మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి బొప్పాయి మొక్కలు తీసుకువచ్చాడు. ఒక్కో మొక్క ధర 13 రూపాయలు. 2 వేల మొక్కలు తెప్పించిన దుర్వ ముండే సేంద్రియ పద్ధతిలో సాగు చేపట్టాడు. ఇదే మండలం నవేగామ్‌ గ్రామానికి చెందిన రైతు చోలే మధుకర్‌ తన ఎనిమిదెకరాల భూమిలో పదివేల రెడ్‌ తడి రకం బొప్పాయి మొక్కలను నాటారు. వీటికి రూ.లక్షా యాభై వేలు ఖర్చు చేశారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని అందిస్తున్నారు.
సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఈ రైతులు పండించిన పంటలకు మంచి గిరాకీ వుంటున్నది. హైదరాబాద్‌, మహారాష్ట్రల నుంచి వ్యాపారులు నేరుగా పొలం దగ్గరకే వచ్చి బొప్పాయి కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నారు. దీంతో రైతులకు డబ్బు, శ్రమా ఆదా అవుతున్నది. సేంద్రియంగా సాగు చేయడం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం కూడా పెరిగిందంటున్నారు ఆ రైతులు.
సేంద్రియ ఎరువుల తయారీ ఇలా..
పది లీటర్ల గోమూత్రం, ఐదు కేజీల బెల్లం, రెండు కిలోల పుట్టమట్టి 200 లీటర్లు నీళ్లు కలిపి తయారు చేసి ఎనిమిది రోజులు నిల్వ ఉంచిన తర్వాత రోజు విడిచి రోజు కలియబెట్టాలి. పది రోజుల తర్వాత వెయ్యి లీటర్ల నీటిలో కలిపి ప్రతి చెట్టుకు అర లీటర్‌ చొప్పున పిచికారీ చేస్తే బొప్పాయికి కాచిన పూత రాలదు. దాంతో పాటు చీడపీడలు దరిచేరవు. అధిక దిగుబడి రావడం వల్ల రైతులు లాభపడతారు.
బొప్పాయి సాగు లాభసాటి
పత్తి కంటే బొప్పాయి సాగు లాభసాటిగా వుంది. ఆరేళ్ల నుంచి బొప్పాయి సాగు చేస్తున్నాను. పెట్టుబడి ఖర్చులు తక్కువగా వుండడంతో మంచి ఆదాయం వస్తున్నది.
– చోలె మధుకర్‌, రైతు, నవేగామ్‌
మెళకువలతో అధిక దిగుబడులు
మేలైన విత్తన ఎంపిక బొప్పాయి సాగులో కీలకం. నల్లరేగడి నేలలు బొప్పాయి సాగుకు ఉత్తమం. తక్కువ నీటి తడులతోనే పంట చేతికి వస్తున్నది.
– దుర్వ ముండే, రైతు, నర్సాపూర్‌
 Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *