ఈ యంత్రం కథే వేరు!

  • 15 పంటలు కోసే కంబైన్డ్‌ హార్వెస్టర్‌
  • తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన కంబైన్డ్‌
హార్వెస్టర్‌ రైతులను అమితంగా ఆకర్షిస్తున్నది. 15 రకాల పంటలను కోసేందుకు వీలుగా ఈ కొత్త యంత్రాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో గింజ నాణ్యతకు నష్టం కలగకుండా పంటను కోయడం దీని ప్రత్యేకత.
ఇప్పటివరకు వరి, మొక్కజొన్న వంటి పంటలు కోసేందుకు వేరు వేరు కోత యంత్రాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. అయితే 15 పంటలను కోసేందుకు అనువుగా నూతన టెక్నాలజీతో రూపొందించిన కంబైన్డ్‌ హార్వెస్టర్‌ ఇప్పుడు రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఇది మొక్కజొన్న వంటి పంటలను కోసి, మొక్కజొన్న కంకులను నూర్పిడి చేసి మొక్కజొన్న గింజలను బయటకు తీసుకువస్తుంది. దీనివల్ల రైతులకు సమయం ఆదా కావడంతో పాటు కూలీల కొరతను అధిగమించే వీలుంది. కోతల సమయంలో పంట నష్టం కూడా చాలా తక్కువగా ఉండటం ఈ యంత్రం ప్రత్యేకత.
అడ్వాన్స్‌డ్‌ ఇంజిన్‌తో రూపొందించిన ఈ యంత్రంలోని బీటర్‌, బీటర్‌ గ్రేట్‌ అనే టెక్నాలజీ చెత్తాచెదారాన్ని ఏమాత్రం ధాన్యంలో కలవకుండా వేరు చేస్తుంది. 100 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న ఇంజిన్‌తోపాటు 14 అడుగుల వెడల్పుతో బ్లేడ్‌లను ఏర్పాటు చేశారు. గింజలను నిల్వ చేసుకునే ట్యాంక్‌ సామర్ధ్యం 1800 కిలోలు. ఎకరం మొక్కజొన్న పంటను కేవలం 45 నిమిషాల్లో కోసి ధాన్యం మన ముందుంచుతుంది.
వరి, మొక్కజొన్న సోయాబీన్‌, క్లస్టర్‌ బీన్‌, గోధుమలు, కందులు, శనగలు, జొన్నలు, సజ్జలు, ఆవాలు, బఠాణీలు, బార్లీ, పొద్దుతిరుగుడు, కొత్తిమీర వంటి పంటలను కోసే విధంగా ఈ మిషన్‌ను రూపొందించారు.
ఈ యంత్రాన్ని పూర్తిగా జీపీఎస్‌ టెక్నాలజీని వినియోగించి రూపొందించారు. దీంతో ఈ యంత్రం యజమాని ఇంట్లో కూర్చొనే మిషన్‌ ఎక్కడ నడుస్తుంది? ఎంతసేపు నడిచింది? ఎంత విస్తీర్ణంలో పంట కోత చేసింది? తదితర వివరాలను స్మార్ట్‌ ఫోన్‌ ద్వారానే తెలుసుకోవచ్చు. దీని ధర రూ. 27 లక్షలు. సాధారణంగా కూలీలతో ఒక ఎకరం మొక్కజొన్న పంటను హార్వెస్టింగ్‌ చేయాలంటే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చువుతుంది. ఈ యంత్రంతో కేవలం 45 నిమిషాల్లో పంట చేతికి వస్తుంది. కేవలం మూడు వేల నుంచి 3,500 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *