ఎకరంలో వరి సాగు..లక్ష ఆదాయం

  • ప్రకృతి సేద్యంలో కృష్ణా రైతు ఆదర్శం
కాయకష్టంతో పాటు కాలానుగుణంగా ఆధునిక సాగు పద్ధతుల్ని అందిపుచ్చుకుంటున్న రైతులు అద్భుతాలు చేస్తున్నారు. ఎకరం భూమిలో వరి సాగు చేసి లక్ష రూపాయల ఆదాయం ఆర్జించారు ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రైతు జలసూత్రం వీరవసంతరావు. తనకున్న చౌడు భూమిని ఎంతో శ్రమించి, ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా సారవంతం చేశాడు ఆ రైతు. చౌడు నేలలో ప్రకృతి వ్యవసాయం ఏమిటని అందరూ అవహేళన చేశారు.
మొదటి సంవత్సరం రసాయనాలు నిండిన భూమిని సారవంతం చేసేందుకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతాలు వాడి పంటలకు అనువుగా భూమిని సిద్ధం చేశారు. మొదటి ఏడాది ఎకరాకు 24 బస్తాలు పండించగా రెండో ఏడాది ఎకరాకు 32 బస్తాలు, ఈ ఏడాది ఏకంగా ఎకరాకు 44 బస్తాల దిగుబడిని సాధించారు. వచ్చే ఏడాది గరిష్ఠంగా ఎకరాకు 55 బస్తాలు పండించగలనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది తన పొలంలో సాగు చేసిన వరి కంకికి 320 గింజల దిగుబడి వచ్చిందని, దుబ్బు 40 పిలకలు చేయడంతో మంచి దిగుబడి సాధ్యమైందన్నారు. చీడపీడలను గుర్తించేందుకు పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటుచేసి వ్యవసాయ అధికారుల సూచనలకు అనుగుణంగా కషాయాలను మాత్రమే పిచికారీ చేసి తెగుళ్లు సోకకుండా ఆరోగ్యవంతమైన పంటను పండించామన్నారు. ఈ విధానం ద్వారా పండించిన పంట నాణ్యత, రుచి అధికంగా ఉండటంతో మార్కెట్లో ఈ ధాన్యానికి మంచి డిమాండ్‌ ఉంటోంది.
ఈ రకం బియ్యం కేజీ ధర రూ.50 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. కనీస ధర రూ.50 చొప్పున అమ్మితే ఎకరాకు పండిన 3,240 కేజీల ధాన్యానికి 2,430 కేజీల బియ్యం వస్తుందని, దీనికి మార్కెట్లో రూ.1,21,500 ఆదాయం లభిస్తోంది. ‘భవిష్యత్‌లో ప్రకృతి వ్యవసాయం నిరుద్యోగ యువతకు వరం కానుంది. వరి, వేరుశనగ, మిర్చి, జామ, మామిడి, మినుము, కరివేపాకు పంటల్లో కూడా ఊహలకు అందని దిగుబడులు సాధించి చూపాం. కాలుష్యరహిత ఉత్పత్తులను సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు వ్యవసాయ అధికారి జి.వి.శ్రీనివాసరావు.
పాలేకర్‌ స్ఫూర్తిగా..
ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్‌ శిక్షణ తరగతుల ద్వారా స్ఫూర్తి పొందాను. పట్టుదలతో సాగు చేశాను. వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో విజయం సాధించాను. ఎకరం పొలంలో రూ. 15 వేల ఖర్చుతో వరి సాగుచేసి లక్షకు పైగా ఆదాయం పొందుతున్నాను. మామిడితోటలో కూడా సేంద్రియ సస్యరక్షణ ద్వారా 16 చెట్ల ద్వారా గత ఏడాది రూ.1,40,000 ఆదాయం పొందాను.
– జలసూత్రం వీరవసంతరావు, రైతు వడ్లమాను, కృష్ణాజిల్లా
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *