కర్నూలు జిల్లాలో సాగుబాట పట్టిన యువత

కర్నూల్: వ్యవసాయం దండగా అంటూ అంతా పట్నం బాట పడుతుంటే.. ఈ యువత మాత్రం మట్టినే నమ్ముకుంటున్నారు. బక్క రైతు సాగు వదిలి రోజు కూలీగా మారుతుంటే.. ఉన్నత చదువులు చదివిన వాళ్లు కొందరు వ్యవసాయం చేస్తున్నారు. ఆధునిక సాగులో బంగారం పండిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ అద్భుతాలు చేస్తున్నారు. ఏడాది పొడవునా ఆకుపచ్చని హరిత వాతావరణాన్ని ఆవిష్కరించి అందరితో భళిరా అని ప్రశంసలు అందుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని యువ రైతుల పాలీహౌజ్‌ సాగుపై ప్రత్యేక కథనం.
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు బోర్‌ కొట్టాయి.. ఒకరి కింద పనిచేయడమేంటి..? మనమే నలుగురికి ఉపాధి కల్పిద్దామని మరికొందరు. ఇతర బిజినెస్‌లను మించే రాబడి.. ఇలా ఒక్కటేమిటీ.. మట్టిని నమ్ముకుంటే చాలా లాభాలున్నాయ్‌. అందుకే రాయలసీమ యువత కొత్త బాట పడుతోంది. పాలీహౌస్‌ వ్యవసాయంతో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తోంది. పాలీ హౌస్ లో రంగు రంగుల చామంతి పూల పరిమళాలు మనసును పులకింప జేస్తున్నాయి. కరువ సీమలో కొత్త అందాలు పులకరింపజేస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో ఈ చామంతి గుబాళింపుకు ప్రధాన కారణం… యువత. ఊర్లకు దూరంగా.. సాఫ్ట్‌వేర్‌ ఇతర ప్రైవేట్‌ జాబుల కోసం పరుగులు పెట్టే యువత.. ఇక్కడ మాత్రం మట్టిని నమ్ముకుంది. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చి.. ఏదో చేయాలన్న తపన.. ఇపుడు వారిని కొత్త ఆవిష్కరణలకు ముందుంచుతోంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నవారు, ఉన్నత విద్యను చదివిన వాళ్లూ కూడా ఇపుడు పాలీహౌస్‌ సాగులోకి దిగారు.
ఈ పాలిహౌస్‌లలో… అలంకరణ పూలు, కూరగాయల సాగు చేయవచ్చు. సాధారణంగా పాలిహౌస్ నిర్మాణం అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఎకరానికి 35 లక్షల వరకూ అవుతుంది. ఇక ప్రభుత్వం పాలీహౌస్‌ నిర్మాణానికి ఎకరాలకు 16 లక్షల 88 వేల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తుంది. అంతేకాకుండా ప్రోత్సాహకం కింద స్క్వేర్‌ మీటర్‌కు 213 రూపాయలు రైతులకు అందిస్తోంది. జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడి కుమారుడు బైరెడ్డి సిద్దార్ద రెడ్డి, నందికొట్కూరుకు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి క్రిష్ణమూర్తి, కర్నూలుకు చెందిన రాధికలు ఈ పాలీహౌస్‌ సాగు చేస్తున్నారు. ఎకరా, అర ఎకరా పొలంలో పాలీహౌస్‌ను నిర్మించి.. చామంతి, కూరగాలు సాగు చేస్తున్నారు. ఈ పాలీహౌస్‌ను భోపాల్ కు చెందిన ప్రభవి బయోటెక్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీ నిర్మించింది. ఇక భీకర గాలులు, మండే ఎండలను సైతం తట్టుకునే విధంగా కట్టు దిట్టంగా నిర్మించింది.
అయితే మొదట ఈ భూముల్లోని మట్టి పూల సాగుకు సరిపోలేదు. దీంతో ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె దగ్గర నుంచి చామంతి సాగుకు సరిపడే ఎర్రమట్టిని తీసుకొచ్చి బెడ్లుగా తయారు వేశారు. మొక్కలకు సరైన గాలి, వెలుతురు తగిలేలా బెడ్ల మధ్య గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎర్రమట్టితో తయారు చేసిన బెడ్లలోని మట్టికి ముందుగా భూసార పరిక్షలు చేయించి, సేంద్రీయ ఎరువులను వేశారు. మట్టిలోని క్రిములను సంహరించి, ఆ తర్వాత మొక్కలు నాటారు. హాలెండ్ రకం చామంతులకు క్వాలిటీ, బరువుతో పాటు మార్కెట్లో మంచి రేటు ఉంది. అయితే అధిక దిగుబడులు కావాలంటే అధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగ్గా తీసుకోవాలి.
పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడి కొడుకు బైరెడ్డి సిద్దార్ద రెడ్డి పాలీహౌస్‌లో చామంతిని సాగు చేస్తున్నారు. గతంలో పండించిన పంటల కంటే చామంతి పూల సాగు బాగా వచ్చిందని చెబుతున్నారు సిద్ధార్థ్‌రెడ్డి. తొలి పంటతోనే లాభం వచ్చేలా ఉందంటున్నారు. నందికొట్కూరుకు చెందిన కృష్ణమూర్తి బిటెక్ చదవి, లండన్ లో ఎమ్ ఎస్ పూర్తి చేశాడు. కొంత కాలం నుంచి చెన్నైలోని HCLలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఓవైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు సొంతూరులో ఉన్న భూముల్లో ఎకరా పొలంలో పాలిహౌస్ ఏర్పాటు చేశాడు. సెలవు రోజుల్లో చెన్నై నుంచి పొలానికి వచ్చి చామంతి పూల సాగులో నిమగ్నమౌతాడు. నూతన టెక్నాలజీని వాడుకుంటూ పూలసాగులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు.
వీళ్లే కాదు.. కర్నూలుకు చెందిన రాధిక కూడా 2015 నుంచి వివిధ రకాల కూరగాయల సాగు చేస్తున్నారు. అంతర్జాలంలో శోధించి హాలెండ్ రకం చామంతిని అర ఎకరా పొలంలో సాగు చేశారు. మరికొన్ని రోజుల్లోనే తొలిపంట చేతికి రానుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగంపై చూపే ఆసక్తి వ్యవసాయంపైన చూపిస్తే సాగులో అద్బుతాలు సాధ్యమంటున్నారు రాధిక ఇపుడు యువ రైతుల పాలీహౌజ్‌ సాగు అందరికి ఆకర్షిస్తోంది. యువతను మెచ్చుకుంటూనే మిగతా వాళ్లూ ఆ అడుగు జాడల్లో నడిచేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *