
విత్తన కంపెనీలు అవకాశం వున్న అన్ని మార్గాల్లో రైతులను నయవంచన చేస్తున్నాయి. విత్తన పరీక్షా కేంద్రాల్లో చక్రం తిప్పి నాణ్యతలేని విత్తనాలను ఓకే చేయించుకుంటున్నాయి. కొత్త సంచుల్లో పాత విత్తనాలు నింపి రైతులకు అంటగడుతున్నాయి.
వ్యవసాయాధికారులు పరిశోధనా కేంద్రాల్లో తయారైన విత్తనాల శాంపిల్స్‌ను సేకరించాలి. వీటి మొలక శాతాన్ని పరిశీలించాలి. జెర్మినేషన్ టెస్ట్ (మొలక పరీక్ష) బాగుంటేనే ఆ విత్తనాలకు అనుమతులు ఇవ్వాలి.
మార్కెట్లో అమ్మకాలకు షాపులు, గిడ్డంగుల్లో సిద్ధంగా ఉంచిన సరుకులో నుంచి వ్యవసాయ శాఖ ఏవో, ఏడీలు శాంపిల్స్ సేకరించాలి. ఖరీదైన విత్తనాల నుంచి శాంపిల్స్ సేకరించడం లేదు. షాపు, కంపెనీ యజమానుల ఆదేశాలకు అనుగుణంగానే శాంపిల్స్ తీస్తున్నారు. నిబంధనల మేరకు ఆ షాపులో ఉన్న అన్ని రకాల విత్తనాలలో శాంపిల్స్ సేకరించాలి. సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరీక్షకు పంపాలి. అక్కడ నాణ్యత లేదని తేలితే ఆ విత్తనాల అమ్మకాలను నిలిపివేయాలి.
ఆ లాట్ నెంబర్ సరుకు ఎక్కడ ఉన్నా వెనకకు తెప్పించాలి. ప్రస్తుతం ఎక్కడైనా విత్తనాల పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే… కంపెనీ యజమానులు మరలా ఆ విత్తనాలను మరో పరీక్షా కేంద్రానికి పంపడానికి అధికారుల అనుమతులు తీసుకుంటున్నారు. ఈ అనుమతులతో ఆయా ల్యాబ్‌లలో ముందుగానే మేనేజ్ చేసుకొని నాణ్యత ఉన్నట్లు సర్టిఫై చేయించి ఆ సరుకు అంతా అమ్మే విధంగా వ్యూహరచన చేస్తున్నారు.
కొన్ని కార్పొరేట్ కంపెనీలు తమ వద్ద ఉన్న పాత విత్తనాల నిల్వలను సొమ్ము చేసుకోవడానికి హైటెక్ పద్ధతులను అవలంబిస్తున్నాయి.
ఖరీఫ్, రబీలలో మిగిలిన సరుకును కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ చేస్తున్నారు. ఆ సరుకును సీజన్ వచ్చిన తరువాత కొత్త సంచులలో నింపి మరలా మార్కెట్లో అమ్ముతున్నారు. కార్పొరేట్ కంపెనీల మాయాజాలానికి ప్రభుత్వ అధికారుల అండ దండిగా ఉంది. దీంతో నాణ్యత లేని విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు నట్టేట మునిగి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
విత్తన వ్యాపారులు పాటించాల్సిన సూచనలు..
- వ్యవసాయ శాఖ రూల్స్‌ను అనుసరించి విత్తన లైసెన్సులు పొందినవారు మాత్రమే రైతులకు విత్తనాలు అమ్మాలి. విత్తన విక్రయ లైసెన్సును షాపులో, గిడ్డంగుల్లో గోడకు తగిలించాలి.
- అమ్మకపు కేంద్రంలో గల విత్తన నిల్వలను, ధరలను సూచించే బోర్డును విధిగా ప్రదర్శించాలి. బోర్డును రోజూ సరి చేయాలి. విత్తన ప్యాకెట్లపై గల గరిష్ఠ అమ్మకపు ధరలకు మించి విక్రయించరాదు. గరిష్ఠ అమ్మకపు ధరలకు మించి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తే డీలర్ లైసెన్సును రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
- విత్తన నాణ్యతపై రైతుల నుంచి వచ్చే సమస్యలను విత్తన తయారీదారు, అమ్మకపుదారులు వెంటనే పరిష్కరించాలి.
పర్యవేక్షణ కమిటీలు ఉండాలి
- ఖరీఫ్, రబీలలో విత్తనాల నాణ్యత, ధర, ఇతర అంశాల పరిశీలన, పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటుచేయాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఖరీఫ్, రబీలలో 2 నెలల పాటు 2 వారాలకొకసారి ఈ కమిటీల సమావేశాలు జరపాలి. నకిలీ, కల్తీలు వచ్చిన వెంటనే వాటిపై సరైన శిక్షలు పడే విధంగా చట్టాన్ని సవరించాలి.
- మేకల లక్ష్మీనారాయణ, ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడు
Credits : Andhrajyothi