గోమూత్రం.. పెట్రోలు కంటే ప్రియం!

  • క్యాను రూ.500 పైమాటే
పల్నాడు పల్లెలు పచ్చదనాలకు నిలయాలు. దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పత్తి, మిరప పంటలే సాగు చేస్తున్నారు. పంట మార్పిడి అలవాటు లేకపోవడంతో ఆ పంటలకు విపరీతంగా తెగుళ్లు ఆశిస్తున్నాయి. దశాబ్దాలుగా ఆ పంటలకు పురుగుల మందులు వాడటం వల్ల తెగుళ్లు, పురుగుకు రోగనిరోధక శక్తి విపరీతంగా పెరిగింది. ఎన్ని పురుగు మందులు వాడినా ప్రయోజనం ఉండడం లేదు. ఆకుముడత, బొబ్బర తెగులు, రసంపీల్చు పురుగు, కాయతొలుచు పురుగులు పంటలను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
దీంతో రైతుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతున్నది. ఒకరిద్దరు రైతులు ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు సాధించడంతో మండలంలోని పలువురు రైతులు ఆ బాటన పట్టారు. దేశీ ఆవుల పంచకం చల్లితే తెగుళ్లు దరిచేరవని రైతులు గ్రహించారు. యర్రబాలెంలోని ఒక దేవాలయం ఆధీనంలో ఉన్న గోశాల నుంచి గోమూత్రం సేకరించి కొందరు రైతులు సత్ఫలితాలు సాధించారు.
ఆ నోటా ఈ నోటా గోమూత్రం విలువ తెలుసుకున్న పలువురు రైతులు యర్రబాలెం బాట పట్టారు. అక్కడ 20 ఆవులు మాత్రమే ఉన్నాయి. రోజంతా గోమూత్రం సేకరించినా 20 లీటర్లకు మించి రావడం లేదు. రెంటచింతల, దుర్గి, మాచర్ల మండలాలకు చెందిన పదికి పైగా గ్రామాల రైతులు క్యూ కట్టడంతో గోమూత్రం సరిపోవడం లేదు. క్యాను గోమూత్రం ధరను 500 రూపాయలుగా నిర్ణయించారు. అయినా రైతులు ఆ డబ్బు చెల్లించేందుకు సిద్ధం అవుతున్నారు.
గో మూత్రంలో 24 ధాతువులు :వెంకటేశ్వర్లు, ఆత్మ బీటీఎం
గోమూత్రంలో 24 రకాల ధాతువులుంటాయి. అమ్మోనియం, రాగి, నత్రజని, గంధకం, పొటాషియం, మెగ్నిషియం వంటి ధాతువులన్నీ మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. గోవు విసర్జనలో భూమికి ఉపయోగపడే 300 నుంచి 500 కోట్ల జీవరాశులు వుంటాయి. గోమూత్రం, పేడ రైతుకు వరాలు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *