దిగుబడి పెంచే మల్చింగ్‌ యంత్రం

ఉద్యాన పంటల సాగులో రైతులు నీరు, ఎరువులు, పోషకాలు వృథా కాకుండా మల్చింగ్‌ పద్ధతిని పాటిస్తున్నారు. ఇప్పటివరకు మల్చింగ్‌ పద్ధతిని రైతులు స్వయంగా చేపట్టేవారు. ఆధునిక యంత్రం ద్వారా మల్చింగ్‌కు అవకాశం వుండటంతో రైతులు అటువైపు దృష్టి సారించారు.
ఇంతకాలం ఉద్యాన రైతులు ఓదెలు కట్టి ప్లాస్టిక్‌ ఫిలిం (అగ్రి ఫిలిం)ను ఉపయోగించి మల్చింగ్‌ చేసేవారు. దాంతో మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఈ ఫిలిం కప్పి ఉంచుతుంది. ఫలితంగా సాగునీరు ఆదా అవడమే కాకుండా కలుపు నివారణకు కూలీలను నియమించే ఖర్చు తగ్గుతుంది. గతంలో ఎరువులు కూడా మొక్క చుట్టూ ఉన్న వేరు వ్యవస్థకు సక్రమంగా అందేవి కావు. మల్చింగ్‌ పద్ధతి ద్వారా ఎరువులు మొక్కకు సక్రమంగా అందడంతో నాణ్యమైన ఉత్పత్తి, అధిక దిగుబడి వస్తున్నది. తెగుళ్లు, కీటకాలు ఆశించడం కూడా తక్కువ. దీంతో ఉద్యాన రైతులకు మల్చింగ్‌ వరంగా మారింది.
మల్చింగ్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆధునిక యంత్రం ఒకటి అందుబాటులోకి వచ్చింది. ట్రాక్టర్‌ ద్వారా ఈ మల్చింగ్‌ను చేపడుతున్నారు. ఈ యంత్రం ధర రూ.65,100 కాగా, ప్రభుత్వం రైతాంగానికి 50 శాతం రాయితీ ద్వారా రూ.32,550కు యంత్రాన్ని అందిస్తోంది. ఈ యంత్రం ఓదెలు కడుతుంది. మనుషులతో పోలిస్తే ఈ యంత్రం వేగంగా, తేడా లేకుండా ఓదెలు కడుతుంది. మనుషులతో ఓదెలు కట్టాలంటే నాలుగు వేలు ఖర్చయ్యేది.
ఈ యంత్రంతో రెండు వేలతోనే ఓదెలు సిద్ధం అవుతాయి. ప్రధానంగా టమోటా, మిరప, కర్బూజ, పూలతోటలు, కూరగాయల తోటలకు ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. మల్చింగ్‌ పద్ధతిలో పంట నేలను తాకదు. దాంతో పంట సురక్షితంగా వుంటుంది. ఈ తరహా పంటకు మార్కెట్‌లో మంచి ధర కూడా పలకడంతో రైతులు అధిక లాభాలు పొందవచ్చు.
మంచి డిమాండ్‌
ఉద్యాన రైతులకు మల్చింగ్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మల్చింగ్‌ యంత్రం రైతుకు డబ్బు ఆదా చేయడంతో పాటు నాణ్యమైన దిగుబడులు అందించేందుకు తోడ్పడుతుంది. అందరికీ మల్చింగ్‌ యంత్రం పై సబ్సిడీ వుంది. రాయచోటి డివిజన్‌లో ఇప్పటివరకు 8 మల్చింగ్‌ యంత్రాలను అందించాం.
– వనిత, ఉద్యాన అధికారి, రాయచోటి
రైతులకు ఎంతో మేలు
పేపర్‌ మల్చింగ్‌ యంత్రం వల్ల కలుపు మొక్కలు పెరగవు. చీడపీడల సమస్య కూడా ఉండదు. క్రిమిసంహారక మందులు కూడా కొంత ఆలస్యంగా కొట్టినా కూడా పెద్దగా సమస్య ఉండదు. నేను టామోటా, దోస పంటలను ఈ విధానంలోనే సాగు చేశాను. సాటి రైతుల్ని ఈ దిశగా ప్రోత్సహిస్తున్నాను.
– పెద్దిరెడ్డి, రైతు, చిన్నమండెం మండలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *