
వాణిజ్య పంటలకు స్వస్తి చెప్పి ఉద్యాన పంటలు అది కూడా బహుళ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు ఖమ్మం జిల్లా బోనకల్ రైతులు. గిట్టుబాటు ధరలు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అన్నదాతలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న ఆ రైతుల స్ఫూర్తి గాథ ఇది.
వ్యవసాయ మండలంగా పేరున్న బోనకల్లో కొందరు రైతులు వాణిజ్య పంటలను కాదని బహుళ పంటల సాగు వైపు మళ్లారు. పది సంవత్సరాల నుంచి ఒకే భూమిలో.. ఏడాదికి మూడు నుంచి నాలుగు పంటల వరకు సాగుచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి నాగచంద్రుడు, డేగల లక్ష్మీనారాయణ తదితర రైతులు సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ ఏడాది జూన్లో బంతి సాగుచేశారు ఆ రైతులు. బంతిపూల దిగుబడి పూర్తవడంతో ఆ తోటలో బీరవేసి… ఆ తీగను బంతిపూల చెట్లపైకి పాకించారు. ప్రస్తుతం వేసిన బీర 45 రోజుల్లో దిగుబడి పూర్తవుతుంది. ఆ తర్వాత ఇదే భూమిలో మళ్లీ కూరగాయల సాగుకు సిద్ధమవుతున్నారు. యాపిల్బెర్ ప్రధాన పంటగా వేసి అందులో అంతరపంటగా పచ్చిమిర్చిని వేశారు. పచ్చిమిర్చి తర్వాత కాకర వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పందిరి విధానంలో దొండ సాగు, స్పేకింగ్ విధానంలో టమోటా, కాకరను సాగు చేస్తున్నారు. తైవాన్ జామలో అంతరపంటగా బంతి వేసి మంచి దిగుబడిని సాధించారు. ఒక్కో రైతు తమకున్న పొలాల్లో తక్కువ కాలవ్యవధిగల పంటలను ఎంచుకొని ఒకే ఏడాదిలో మూడు పంటలను సాగుచేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృథా చేయకుండా రాబడి పొందుతున్నారు.
ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
ఆదర్శ సేద్యం చేస్తున్న బోనకల్ మండలం ముష్టికుంట్ల రైతులను ప్రపంచ బ్యాంకు బృందం ప్రశంసించింది. ఉద్యాన పంటలను సాగుచేయటంతో పాటు బహుళ వార్షిక పంటలను సాగుచేస్తూ అధిక లాభాలను గడించి సాగులో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారంటూ అభినందించింది.

ఏటా మూడు పంటలు
నాకు 5 ఎకరాల భూమి వుంది. ఈ ఏడాది ఒక ఎకరం భూమిలో బంతి వేయగా రూ.లక్ష ఆదాయం వచ్చింది. ఆ తర్వాత అందులో బీర వేశాను. దాని తర్వాత అదే భూమిలో కూరగాయలు పండిస్తా. యాపిల్బెర్లో అంతరపంటగా పచ్చిమిర్చి వేశా. ఇప్పటికే 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పచ్చిమిర్చి తర్వాత కూరగాయల సాగుచేస్తా. మరో ఎకరం భూమిలో తైవాన్ జామ వేసి అందులో అంతరపంటగా బంతి వేశా. అది పూర్తయ్యాక కూరగాయలు సాగుచేస్తా.
– బొడ్డుపల్లి నాగచంద్రుడు, రైతు, ముష్టికుంట్ల
Credits : Andhrajyothi