సేంద్రియ సాగులో సాఫ్ట్‌వేర్‌ హరికృష్ణ

ఇంజనీరింగ్‌ చదివి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ దర్జాగా కాలం గడిపే అవకాశం వున్నా, వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని వదలకూడదనుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన దేవరపల్లి హరికృష్ణ. సేంద్రియ సేద్యం చేస్తూ రైతులోకానికి ఆదర్శంగా నిలిచిన ఆ యువ రైతు విజయగాథ.
సర్వత్రా సేంద్రియం
రైతులు తమ కుటుంబాలకు అవసరమైన మేరకైనా సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలి. బియ్యం, కూరలు సేంద్రియంగా పండిస్తే క్రమంగా రాష్ట్రమంతా సేంద్రియ సేద్యం విస్తరిస్తుంది. పుడమితల్లితో పాటు ప్రజలు కూడా ఆరోగ్యంగా వుంటారు. నేను నా పొలంలో సేంద్రియంగా పండించిన వాటినే హైదరాబాద్‌ తెచ్చుకుంటాను. సేంద్రియంతో ఖర్చులు తగ్గడంతో పాటు లాభాల కూడా పుష్కలంగా వుంటాయి.
– హరికృష్ణ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, సేంద్రియ రైతు
హైదరాబాద్‌లో మంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు హరికృష్ణ. శుక్రవారం ఆఫీసు పని పూర్తయిన మరుక్షణం నుంచి ఆయన ధ్యాసంతా స్వగ్రామంలోని పొలం మీదే వుంటుంది. ఆయన అడుగులు చకచకా అటువైపు పడతాయి. పొలం చేరుకుని పైరుపచ్చల్ని చూస్తే ఆయనలో నవజీవం తొణికిసలాడుతుంది. మిగిలిన వారిలా కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనుకున్నారాయన. నేలతల్లిని కాపాడుకుంటూ లాభసాటిగా సాగు చేసేందుకు సేంద్రియమే ఏకైక మార్గమని గ్రహించారు. జిల్లాలోనే తొలిసారిగా సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. తాను పండిస్తున్న వరి, కొబ్బరి, కో-కో, పామాయిల్‌ సాగుకు పూర్తిస్థాయిలో సేంద్రియ ఎరువులను, క్రిమిసంహారకాలనే వినియోగిస్తున్నారు. సేంద్రియ సాగు కోసం దేశీ ఆవులను పెంచుతున్నారు. దేశీ ఆవుపాలతో మనం, ఆవు వ్యర్ధాలతో చేసే ఎరువులు, క్రిమిసంహారక మందులతో నేలతల్లి ఆరోగ్యంగా వుంటారంటారు హరికృష్ణ.
రైతులకు కామధేనువులు
రెండు మూడు దేశీ ఆవులతో సుమారు 25-30 ఎకరాలు వ్యవసాయం చేయవచ్చు. ఇవి ఇచ్చే పాలపై వచ్చే ఆదాయం ఆవుల పోషణకు సరిపోతుంది. దేశీ ఆవులు సేంద్రియ సాగుకు ఉత్తమం. మోపురం, గంగడోలు ఉండే జాతులు యోగ్యమైనవి. సేంద్రియ సాగులో గో మూత్రం, ఆవుపేడలను నిర్ణీత ప్రమాణాల్లో వినియోగించాలి. వీటి ద్వారా జీవామృతం, ఘనామృతం, కొన్ని రకాల ఆకులు, అలములతో క్రిమిసంహారక మందులను తయారు చేసుకోవాలి. దశాబ్దాలుగా రసాయనాల వినియోగం వల్ల భూములు నిస్సారం అయ్యాయి. ఆ పంటలు తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతోపాటు సాగు ఖర్చులు భారీగా పెరిగిపోయి రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. సేంద్రియ ఎరువులతో నిస్సారమైన భూమిలో కూడా సిరులు పండుతాయి. క్రిమి సంహారకాల స్థానంలో గో మూత్రానికి, వివిధ రకాల ఆకులు, కాయలు కలిపి తయారుచేసిన కషాయాన్ని పంటలపై పిచికారీ చేసి చీడపీడలను సమర్థవంతంగా నివారించవచ్చంటున్నారు హరికృష్ణ. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో పాటు సాగులో యంత్రాలను ఉపయోగిస్తూ కూలీల సమస్యను అధిగమిస్తున్నారు ఈ రైతు. సొంతంగా తయారుచేసుకున్న జీవామృతాన్ని ఫిల్టర్‌ బెడ్‌ల ద్వారా శుద్ధిచేసి డ్రిప్‌ ద్వారా కొబ్బరి, కో-కో, పామాయిల్‌ పంటలకు అందిస్తూ అద్భుతాలు చేస్తున్నారు ఈ యువరైతు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు చేతుల మీదుగా హరికృష్ణ సేంద్రియ సాగులో ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్నారు. లాభసాటిగా సాగు చేస్తూ రైతులకు, నవ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయనకు రైతునేస్తం పురస్కారం కూడా లభించింది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *