హైటెక్‌ రైతు దంపతులు

  • ఉద్యోగాలు వదిలి సాగుబాట
  • సేంద్రియం దిశగా అడుగులు
రైతులే వ్యవసాయం వదిలేసి పట్నాలకు తరలిపోతుంటే బెంగుళూరులో ఉద్యోగాలను, లక్షన్నర జీతాన్ని వదిలేసి స్వగ్రామంలో సేద్యం చేస్తున్నారు యువ దంపతులు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఉద్యోగాల కంటే సాగు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తామంటున్న ఆ హైటెక్‌ రైతు దంపతుల స్ఫూర్తి గాథ ఇది.
అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మారుమూల ప్రాంతం. ఈ గ్రామంలో పుట్టిన అభిలాష్‌, సుష్మ ఉన్నత చదువులు చదివారు. ఇద్దరూ బెంగుళూరులో 14 ఏళ్ల పాటు ఉద్యోగాలు చేశారు. అభిలాష్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. సుష్మ ఫార్మసిస్టు. ఇద్దరూ నెలకు రెండు లక్షల జీతం పొందేవారు.
కానీ వారి మనసు అక్కడ లేదు. క్షణం తీరికలేని ఉద్యోగాలు వద్దనుకున్నారు. ప్రశాంత జీవనానికి స్వగ్రామానికి మించిన వేదిక లేదనుకున్నారు. ఉద్యోగాలు వదిలేసి వారి స్వగ్రామమైన గుడిబండకు చేరుకున్నారు. అభిలాష్‌ తండ్రి ఓ సామాన్య రైతు. వారికి 26 ఎకరాల పొలం ఉంది. ఇందులో 12 ఎకరాలకు నీటి వసతి వుంది.
14 ఎకరాలు మెట్ట భూమి. ఇందులో చాలా భాగం పంట సాగుచేయలేక బీడుగా వదిలేశారు. అభిలాష్‌, సుష్మ ఆ నేలలో సిరులు పండించాలని సంకల్పించుకున్నారు. రెండు బోర్లు వేయించారు. ఒక బోరుకు విద్యుత్‌ మోటారును అమర్చారు. మరో బోరుకు సబ్సిడీతో సోలార్‌ సిస్టంను ఏర్పాటుచేసుకున్నారు. అలా ఆధునిక పద్ధతుల ద్వారా విద్యుత్‌ సమస్యను అధిగమించారు. 15 ఎకరాలలో మామిడి, నిమ్మ, జామ, అంజురా, అల్ల నేరేడు మొక్కలు నాటారు. అందులో అంతర పంటలుగా కంది, వేరుశనగ, మునగ వంటివి సాగు చేశారు. రసాయన ఎరువుల వాడకం వల్ల నేలకు, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గమనించారు అభిలాష్‌. ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గు చూపారు.
వివిధ ప్రాంతాలలో పర్యటించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. సుభాష్‌ పాలేకర్‌ వ్యవసాయ విధానాన్ని పుస్తకాల ద్వారా చదివి లాభదాయక సాగు వైపు నడక ప్రారంభించారు. ఇంటర్నెట్‌లో ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అధ్యయనం చేస్తూ, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే పద్ధతులు తెలుసుకున్నారు. తుంపరసేద్యం చేపట్టారు. ఒకే పంట మీద ఆధారపడకుండా బహుళ పంటల సాగు చేపట్టారు. పండిన ఉత్పత్తులకు లాభసాటి ధరలు కల్పించే సంస్థల వివరాలను సేకరించారు. తొలుత అంజురా, మామిడి ద్వారా ప్రారంభంలో రూ.1.50 లక్షల ఆదాయం సంపాదించారు.
కుటుంబ ఆరోగ్యంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఆవుపేడ, గోమూత్రం మిశ్రమంగా చేసి ఎరువుగా వాడుతున్నారు. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. సేంద్రియంగా పండించే పండ్లు, కూరగాయలు రిటైల్‌ సంస్థలకు విక్రయిస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. తోట చుట్టూ రక్షణ కోసం కంచెను వేసుకున్నా వన్యమృగాలు, దొంగల బెడద లేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
పొలం వద్ద కావలి కోసం నెలకు ఒక మనిషికి రూ.5వేలు ఇచ్చినా ఏడాదికి రూ.60 వేలు అవుతుందన్నారు. రూ.60వేలతో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతో చాలా సౌకర్యంగా ఉందంటున్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించుకునేందుకు వీలుంటుందని చెబు తున్నారు. ఏ ఉద్యోగం చేసినా రానటువంటి తృప్తి వ్యవసాయంలో లభిస్తోందని ఆ యువ దంపతులు చెబుతున్నారు.
సేద్యంతో సంతృప్తి
నగరంలో ఉద్యోగం చేస్తూ ఎంత సంపాదించినా రాని సంతృప్తి సేద్యం ద్వారా లభిస్తున్నది. అనంత రైతులు కేవలం వేరుశనగ మీదే ఆధారపడటం సరికాదు. బహుళ పంటల సాగు వల్ల రైతుల ఆదాయం ఎంతో పెరుగుతుంది. లాభసాటి అయితే నవతరం కూడా సేద్యం మీద దృష్టి సారిస్తుంది. బహుళ పంటల సాగు, బిందు సేద్యంలో సాటి రైతులకు సలహాలు ఇస్తున్నాం. సేంద్రియ సేద్యంతో మనతో పాటు ముందుతరాలు కూడా ఆరోగ్యంగా వుంటాయి.
– అభిలాష్‌, సుష్మ
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *