ఈ మొక్క నిజంగానే మాట్లాడుతోంది!

ఈ భూమిపై మనుషుల కంటే ముందే ప్రకృతి ఉంది. చెట్టు, చేమ, పుట్ట, నీరు, నిప్పు, గాలి.. ఇలా ప్రకృతిలో మిళితమై మనిషిని భూమ్మీద బతికేలా చేస్తున్నాయి. ప్రకృతిలో మానవుడితో పాటు చెట్లకు కూడా ప్రతిస్పందించే గుణం ఉంది. ఇటీవల వచ్చిన ‘అ!’ సినిమాలో ‘చెట్లకు వీపుండదా?.. వాటికి దురదుండదా?’ అనే డైలాగ్ కూడా వినే ఉంటారు. వాటికి దురద ఉంటుందో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే మనిషి చేసే చర్యలకు వాటి నుంచి స్పందనలు వస్తుంటాయి. అయితే మొక్కలను పూర్తీగా అర్థం చేసుకున్న కొంతమంది మాత్రమే వాటి స్పందనలను గ్రహించగలుగుతారు. అవి అడగకముందే వాటికి నీళ్లు పోస్తారు. ఒకరకంగా చెప్పాలంటే అలాంటి ప్రకృతి ప్రేమికులు వాటిని కూడా తమ సొంతవాళ్లలాగే భావిస్తారు. వాటితో ముచ్చటిస్తూ ఆలనాపాలనా చూస్తారు. అయితే ప్రకృతి ప్రేమికులను చూసి మరికొంతమంది కూడా ప్రభావితమవుతున్నారు. వాళ్లలా తాము కూడా మొక్కలతో మమేకమవ్వాలని తాపత్రపడుతున్నారు. అలాంటి వాళ్ల కోసమే మార్కెట్లోకొచ్చింది ఓ కొత్త మొక్క.
‘సర్‌.. మేడమ్‌.. ప్లీజ్‌! నీరు లేక ఎండిపోతున్నా! కొన్ని నీళ్లు పోసి నన్ను రక్షించండి! స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందించి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుతా..’ అంటూ ఆ మొక్క చిలక పలుకులు పలుకుతోంది! తన ఆవేదనను అర్థం చేసుకొమ్మంటూ వేడుకుంటోంది. హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్‌ సెంటర్‌లో ఇటీవల జరిగిన జాతీయ సైన్స్‌ దినోత్సవంలో ‘మాట్లాడే మొక్క’ అందరిని ఆలోచింపజేసింది. సిరిసిల్లకు చెందిన బుధవారపు మల్లేశం అనే వ్యక్తి ‘వాటర్‌ ఆస్కింగ్‌ సెన్సర్‌’తో ఈ మాట్లాడే మొక్కను రూపొందించారు. ఈ మొక్కకు ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. చాలామంది ఆ మొక్కను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Credits : Andhrajyothi
02-03-2018 

చిన్నరైతుకు పట్టు సిరులు

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు రైతులు మల్బరీ సాగు, పట్టుగూళ్ల పెంపకంపై దృష్టి సారించారు. ప్రభుత్వ సబ్సిడీలు పట్టుసాగును మరింత ఆకర్షిణీయంగా మార్చాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, పినపాక, కరకగూడెం, అశ్వారావుపేట, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో రైతులు మల్బరీ సాగుపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాకు చెందిన 60 మంది రైతులు 145 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తున్నారు. ప్రభుత్వం మల్బరీ సాగుపై ప్రత్యేక శద్ధ చూపడం, రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడంతో మరింతమంది రైతులు పట్టు సాగు దిశగా అడుగులు వేస్తున్నారు.
పట్టు సాగు వల్ల ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుంది. నీటి వసతి తక్కువగా వున్న ప్రాంతాల్లో కూడా, అతి తక్కువ పెట్టుబడితో దీనిని సాగు చేయవచ్చు. చౌడు, నల్లరేగడి భూములు మినహా మిగతా అన్ని రకాల భూముల్లో, అన్ని కాలాల్లో మల్బరీ సాగు చేసుకోవచ్చు. ఏడాది పొడవునా మంచి ఆదా యం పొందే వీలు కూడా వుండటంతో పలువురు రైతులు పట్టు సాగు చేపడుతున్నారు. మల్బరీ సాగు చేసే రైతులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం ద్వారా పట్టు పురుగుల పెంపకం గది(షెడ్డు) నిర్మాణానికి రూ.1.03 లక్షలు అందిస్తోంది.
సాగు ఖర్చుల కోసం మొదటి ఏడాది రూ.50,468, రెండో ఏడాది రూ.44,269 చొప్పున రైతుకు ప్రభుత్వం అందిస్తున్నది. ఎస్సీ, సన్న చిన్న కారు రైతులకు రెండెకరాల మల్బరీ సాగుకు, పట్టు పురుగుల పెంపకానికి రూ.3.49 లక్షలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తోంది. మల్బరీ మొక్కను ఒకసారి నాటితే 15 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు. మల్బరీ తోటను రెండు లేదా మూడు భాగాలుగా సాగు చేస్తే ఏడాదిలో 10-11 పంటలు తీసే వీలుంటుంది. ఆధునిక పద్ధతులలో రేరింగ్‌ గది నిర్మించి తగినన్ని పరికరాలు ఏర్పాటు చేసుకుంటే దిగుబడి పెరిగే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లోని తిరుమలగిరి, జనగామ జిల్లాలోని జనగామలో పట్టుగూళ్లు మార్కెట్లున్నాయి. ఇక్కడ గూళ్ల నాణ్యతను బట్టి ధరలుంటాయి. బీవీ పట్టు గూళ్లపై కిలో రూ.75, సీ, బీ, గూళ్లపై కిలో రూ.40 ప్రభుత్వం ప్రోత్సాహంగా అందజేస్తోంది. ఏడాదికి 20-30 వేలు పెట్టుబడి పెడితే రూ.6 లక్షలు వరకు సంపాదించుకొనేందుకు అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
అధిక లాభాలు
ఎకరంలో మల్బరీ సాగు చేసి పట్టుగూళ్లు పెంచడం వల్ల 45 రోజుల్లోనే రూ. 2.84 లక్షలు ఆదాయం వచ్చింది. గతంలో పత్తి సాగు చేసేవాడిని. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఈ ఏడాది పట్టు సాగు చేశా. వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయం మల్బరీ పంట.
ఎం.ముకుందరెడ్డి, లక్ష్మీపురం రైతు
మల్బరీ సాగు మేలు
సన్న, చిన్నకారు రైతులకు మల్బరీ సాగు ఎంతో లాభదాయకం. పెట్టుబడి తక్కువ. ప్రభుత్వ రాయితీల కారణంగా అధిక లాభాలు కూడా పొందే వీలుంటుంది. పత్తి సాగు చేపట్టి చేతులు కాల్చుకునే కంటే మల్బరీ సాగు చేసి, పట్టు గూళ్లు పెంచకోవడం శ్రేయస్కరం.
credits : AndhraJyothi 02-03-2018