దిగుబడి పెంచే మల్చింగ్‌ యంత్రం

ఉద్యాన పంటల సాగులో రైతులు నీరు, ఎరువులు, పోషకాలు వృథా కాకుండా మల్చింగ్‌ పద్ధతిని పాటిస్తున్నారు. ఇప్పటివరకు మల్చింగ్‌ పద్ధతిని రైతులు స్వయంగా చేపట్టేవారు. ఆధునిక యంత్రం ద్వారా మల్చింగ్‌కు అవకాశం వుండటంతో రైతులు అటువైపు దృష్టి సారించారు.
ఇంతకాలం ఉద్యాన రైతులు ఓదెలు కట్టి ప్లాస్టిక్‌ ఫిలిం (అగ్రి ఫిలిం)ను ఉపయోగించి మల్చింగ్‌ చేసేవారు. దాంతో మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఈ ఫిలిం కప్పి ఉంచుతుంది. ఫలితంగా సాగునీరు ఆదా అవడమే కాకుండా కలుపు నివారణకు కూలీలను నియమించే ఖర్చు తగ్గుతుంది. గతంలో ఎరువులు కూడా మొక్క చుట్టూ ఉన్న వేరు వ్యవస్థకు సక్రమంగా అందేవి కావు. మల్చింగ్‌ పద్ధతి ద్వారా ఎరువులు మొక్కకు సక్రమంగా అందడంతో నాణ్యమైన ఉత్పత్తి, అధిక దిగుబడి వస్తున్నది. తెగుళ్లు, కీటకాలు ఆశించడం కూడా తక్కువ. దీంతో ఉద్యాన రైతులకు మల్చింగ్‌ వరంగా మారింది.
మల్చింగ్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆధునిక యంత్రం ఒకటి అందుబాటులోకి వచ్చింది. ట్రాక్టర్‌ ద్వారా ఈ మల్చింగ్‌ను చేపడుతున్నారు. ఈ యంత్రం ధర రూ.65,100 కాగా, ప్రభుత్వం రైతాంగానికి 50 శాతం రాయితీ ద్వారా రూ.32,550కు యంత్రాన్ని అందిస్తోంది. ఈ యంత్రం ఓదెలు కడుతుంది. మనుషులతో పోలిస్తే ఈ యంత్రం వేగంగా, తేడా లేకుండా ఓదెలు కడుతుంది. మనుషులతో ఓదెలు కట్టాలంటే నాలుగు వేలు ఖర్చయ్యేది.
ఈ యంత్రంతో రెండు వేలతోనే ఓదెలు సిద్ధం అవుతాయి. ప్రధానంగా టమోటా, మిరప, కర్బూజ, పూలతోటలు, కూరగాయల తోటలకు ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. మల్చింగ్‌ పద్ధతిలో పంట నేలను తాకదు. దాంతో పంట సురక్షితంగా వుంటుంది. ఈ తరహా పంటకు మార్కెట్‌లో మంచి ధర కూడా పలకడంతో రైతులు అధిక లాభాలు పొందవచ్చు.
మంచి డిమాండ్‌
ఉద్యాన రైతులకు మల్చింగ్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మల్చింగ్‌ యంత్రం రైతుకు డబ్బు ఆదా చేయడంతో పాటు నాణ్యమైన దిగుబడులు అందించేందుకు తోడ్పడుతుంది. అందరికీ మల్చింగ్‌ యంత్రం పై సబ్సిడీ వుంది. రాయచోటి డివిజన్‌లో ఇప్పటివరకు 8 మల్చింగ్‌ యంత్రాలను అందించాం.
– వనిత, ఉద్యాన అధికారి, రాయచోటి
రైతులకు ఎంతో మేలు
పేపర్‌ మల్చింగ్‌ యంత్రం వల్ల కలుపు మొక్కలు పెరగవు. చీడపీడల సమస్య కూడా ఉండదు. క్రిమిసంహారక మందులు కూడా కొంత ఆలస్యంగా కొట్టినా కూడా పెద్దగా సమస్య ఉండదు. నేను టామోటా, దోస పంటలను ఈ విధానంలోనే సాగు చేశాను. సాటి రైతుల్ని ఈ దిశగా ప్రోత్సహిస్తున్నాను.
– పెద్దిరెడ్డి, రైతు, చిన్నమండెం మండలం

కొత్తిమీర కట్ట రూపాయే

Credits : Andhrajyothi
మదనపల్లె (చిత్తూరు జిల్లా): కొత్తిమీర సాగుచేసిన రైతులు నష్టాలపాలవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ధరలు పాతాళానికి పడిపోవడంతో పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకూ మార్కెట్‌లో కొత్తిమీర కట్ట రూ.30 పలకగా, ఉన్నట్లుండి రూపాయికి పడిపోయింది.మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని సుమారు 600 ఎకరాల్లో కొత్తిమీర సాగవుతోంది. స్థానిక అవసరాలకు పోను మిగిలిన పంటను బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ప్రాంతాలకు వ్యాపారులు తరలిస్తుంటారు.వర్షాలకు భూమి ఊటెక్కి పంట పసుపురంగుగా మారడంతో పాటు ఎక్కువ మొత్తంలో పంట దెబ్బతింది. దీంతో 20 రోజుల క్రితం వరకూ కట్ట రూ.20నుంచి 30 పలకగా, ప్రస్తుతం రూపాయి కూడా అమ్ముడుపోవడం లేదు. కొత్తిమీర ఎగుమతి అవుతున్న ప్రాంతాల్లో పంట ఇబ్బడిముబ్బడిగా సాగుకావడమే ధరల పతనానికి కారణమని చెబుతున్నారు.40రోజుల వ్యవధిలో చేతికొచ్చే కొత్తిమీర ఎకరా సాగుకు ఎంత తక్కువన్నా.. రూ.20వేలు ఖర్చవుతుంది. ప్రసుత్తం దిగుబడులు అధికం కావడంతో కట్ట రూపాయి కూడా పోవడం లేదు. దీంతో మూట(150 కట్టలు) కేవలం వందరూపాయలకు అమ్మేస్తున్నారు.కొందరు రైతులు పంటను అమ్మేదానికి ఇష్టపడక ధనియాలకు వదిలేస్తుండగా, మరికొందరు భూమికి సత్తవ వస్తుందని భావిస్తూ రొటోవేటర్లతో దున్నడానికి సిద్ధమవుతున్నారు.
ఎర్ర గోంగూర
తిరుపతి: ఆహారంలో తెలుగుదనానికి ప్రతీకగా గోంగూరను పేర్కొంటారు. తెలుగువాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆకుకూర ఇది. పచ్చడి, పులగూర, పప్పు, చికెన్‌లోనూ, మటన్‌లోనూ కలిపి కూడా గోంగూరును వండుకుంటారు. తలచుకోగానే నోరూరించే ఆకుకూర ఇది. తెల్ల గోంగూర కన్నా ఎర్ర గోంగూరకి రుచి ఎక్కువ. పోషక విలువలూ ఎక్కువే. ఐరన్‌ దండిగా ఉంటుంది. రక్త హీనత ఉన్నవారు గోంగూర తింటే మంచిదంటారు. వారినికి ఒక్క రోజైనా గోంగూర తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నవనవలాడుతూ ఆకర్షించినా సరే మార్కెట్‌లో దొరికే గోంగూరలో రసాయన అవశేషాలుంటాయి. ఎంత కడిగినా అంతరించవు. మన ఇంట్లోనే రెండు మొలకలు నాటుకుంటే చాలు ఏడాది పొడవునా ఇంటికి కావలసినంత గోంగూర పండుతుంది. ఆకే కాదు, లేత కాయలు కూడా పచ్చడి చేసుకోవచ్చు. నాటు గోంగూర అయితే మంచిది. దీని ఆకులు పలుచగా ఉంటాయి.
కుండీ సేద్యం: చిన్న కుండీలో ఒక గోంగూర మొక్కను పెంచవచ్చు. రెండు కుండీలు చాలు ఎదిగేకొద్దీ కత్తిరించు కుంటూ ఉంటే మొక్క పొదలా విస్తరించి పెరుగుతుంది. పదహైదు రోజులకు ఒకసారి పిడికెడు వర్మీకంపోస్టు లేదా పేడ ఎరువు వేస్తూ ఉంటే ఏపుగా పెరుగుతుంది. సాధారణంగా పిండినల్లి ఆశిస్తుంది. తెల్లటి బూజులా ఆకులను కమ్మేస్తుంది. వేప కషాయం గానీ, పుల్ల మజ్జిగ గానీ, బూడిద గానీ చల్లితే చాలు దీనిని ఎదుర్కోవచ్చు.
నాటు గోంగూర విత్తనాలు, మరింత సమాచారం కోసం: 9515872307

ఎరువు ఎదపెట్టే పరికరం

  • జింక్‌ పైపులతో ఎరువులు వేసే పరికరం
  • శాస్త్రవేత్తగా మారిన రైతుకూలీ
సాలు పంటల్లో పంట తదుపరి దశల్లో ఎరువు వేసేందుకు వీలుగా ఎదపెట్టే పరికరాన్ని రూపొందించారు ఒక రైతు కూలీ. సమయంతో పాటు డబ్బు ఆదా చేసే ఆ పరికరం విశేషాలు.
పొగాకు, మిరప తదితర సాలు పంటల్లో ఎరువులు దుక్కిలో వేస్తారు. తర్వాత వర్షాలు పడే అవకాశం ఉన్నపుడు, పంటలకు నీరు పెట్టే అవకాశం ఉన్నపుడు మొక్కలకు ఎరువు అందించాలంటే తిరిగి కూలీలతో మొక్కలు పాదుల వద్ద ఎరువు వేయిస్తారు. అలా చేయాలంటే కూలీల ఖర్చు అధికంగా వుంటున్నది.
కూలీలు ఎరువు వేసినప్పుడు అదంతా ఒకేచోట పడుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి మొక్క చనిపోయే ప్రమాదమూ వుంది. అయితే కూలీలతో పని లేకుండా ఎరువు మొక్కలకు దగ్గరగా పడే విధంగా ఒక పరికరాన్ని రూపొందించారు ఓ రైతు కూలీ. ఈ ప్రయోగం సక్సెస్‌ అయింది.
జింక్‌ పైపులు రెండింటిని తీసుకుని పైభాగంలో వెడల్పాటి రేకును వెల్డింగ్‌ చేశారు. పైపుల కింది భాగంలో గొర్రుకు ఉండే విధంగా పదునుగా (నేల తెగే విధంగా) కొనలు ఏర్పాటుచేశారు. పైభాగంలో ఎరువు పోస్తే గొట్టాల ద్వారా సాలులోని రెండు వైపులా ఉన్న మొక్కలకు దగ్గరగా ఎరువు పడుతుంది. ఆ తరువాత నీరు పెట్టినపుడు మొక్కలకు ఎరువు సమపాళ్లలో అందుతుంది.
గొర్రుతోలే సమయంలోనే…
మిరపలో, పొగాకులో గొర్రు తోలుతారు. ఎద్దుల గొర్రు తోలేందుకు ఒక మనిషి ఉంటారు. ఆ మనిషితోపాటు మరొకరు ముందరి గొర్రుకు రెండు వైపులా రెండు తాళ్లు కట్టి చివరలను ఎరువు ఎదబెట్టే పరికరానికి రెండు వైపులా కడతారు. ముందర వైపు గొర్రుతోలే వ్యక్తితోపాటు, వెనుకన ఎరువు ఎదబెట్టేందుకు మరొకరు ఉంటారు.
ఈ విధానంలో ఎరువును ఎదబెట్టడం ద్వారా సమయంతోపాటు దాదాపు వెయ్యి రూపాయల వరకు రైతుకు కూలి ఆదా అవుతుంది. ఎరువు అందించేందుకు ఒకరు, ఎదబెట్టేందుకు మరొకరు ఉంటే సరిపోతుంది. అదే కూలీలతో ఎకరాకు ఎరువు మొక్కల వద్ద మొదళ్లలో వేసి పైన మట్టి వేయాలంటే కనీసం రూ.పదిహేను వందలు ఖర్చు అవుతుంది. ఎరువు ఎదబెట్టేందుకు ఇద్దరు మహిళలైనా లేదా ఒక మగ, ఒక ఆడ కూలీ అయినా సరిపోతారు.
ప్రయోగంతో ప్రయోజనం
గత ఏడాది మిరపలో కూలీలతో మొక్కల మొదళ్లలో సత్తువ మందు వేయించాం. కూలీలతో సమయం, డబ్బు వృధా అవుతోంది. రైతు శేషారెడ్డి, నేను ఈ ఏడాది ఈ పరికరం చేయించాం. ఎదబెట్టడానికి బాగానే ఉంది. తక్కువ ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతున్నది.
– ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, నెన్నూరుపాడు
 Credits : Andhrajyothi

కర్నూలు జిల్లాలో సాగుబాట పట్టిన యువత

కర్నూల్: వ్యవసాయం దండగా అంటూ అంతా పట్నం బాట పడుతుంటే.. ఈ యువత మాత్రం మట్టినే నమ్ముకుంటున్నారు. బక్క రైతు సాగు వదిలి రోజు కూలీగా మారుతుంటే.. ఉన్నత చదువులు చదివిన వాళ్లు కొందరు వ్యవసాయం చేస్తున్నారు. ఆధునిక సాగులో బంగారం పండిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ అద్భుతాలు చేస్తున్నారు. ఏడాది పొడవునా ఆకుపచ్చని హరిత వాతావరణాన్ని ఆవిష్కరించి అందరితో భళిరా అని ప్రశంసలు అందుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని యువ రైతుల పాలీహౌజ్‌ సాగుపై ప్రత్యేక కథనం.
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు బోర్‌ కొట్టాయి.. ఒకరి కింద పనిచేయడమేంటి..? మనమే నలుగురికి ఉపాధి కల్పిద్దామని మరికొందరు. ఇతర బిజినెస్‌లను మించే రాబడి.. ఇలా ఒక్కటేమిటీ.. మట్టిని నమ్ముకుంటే చాలా లాభాలున్నాయ్‌. అందుకే రాయలసీమ యువత కొత్త బాట పడుతోంది. పాలీహౌస్‌ వ్యవసాయంతో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తోంది. పాలీ హౌస్ లో రంగు రంగుల చామంతి పూల పరిమళాలు మనసును పులకింప జేస్తున్నాయి. కరువ సీమలో కొత్త అందాలు పులకరింపజేస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో ఈ చామంతి గుబాళింపుకు ప్రధాన కారణం… యువత. ఊర్లకు దూరంగా.. సాఫ్ట్‌వేర్‌ ఇతర ప్రైవేట్‌ జాబుల కోసం పరుగులు పెట్టే యువత.. ఇక్కడ మాత్రం మట్టిని నమ్ముకుంది. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చి.. ఏదో చేయాలన్న తపన.. ఇపుడు వారిని కొత్త ఆవిష్కరణలకు ముందుంచుతోంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నవారు, ఉన్నత విద్యను చదివిన వాళ్లూ కూడా ఇపుడు పాలీహౌస్‌ సాగులోకి దిగారు.
ఈ పాలిహౌస్‌లలో… అలంకరణ పూలు, కూరగాయల సాగు చేయవచ్చు. సాధారణంగా పాలిహౌస్ నిర్మాణం అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఎకరానికి 35 లక్షల వరకూ అవుతుంది. ఇక ప్రభుత్వం పాలీహౌస్‌ నిర్మాణానికి ఎకరాలకు 16 లక్షల 88 వేల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తుంది. అంతేకాకుండా ప్రోత్సాహకం కింద స్క్వేర్‌ మీటర్‌కు 213 రూపాయలు రైతులకు అందిస్తోంది. జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడి కుమారుడు బైరెడ్డి సిద్దార్ద రెడ్డి, నందికొట్కూరుకు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి క్రిష్ణమూర్తి, కర్నూలుకు చెందిన రాధికలు ఈ పాలీహౌస్‌ సాగు చేస్తున్నారు. ఎకరా, అర ఎకరా పొలంలో పాలీహౌస్‌ను నిర్మించి.. చామంతి, కూరగాలు సాగు చేస్తున్నారు. ఈ పాలీహౌస్‌ను భోపాల్ కు చెందిన ప్రభవి బయోటెక్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీ నిర్మించింది. ఇక భీకర గాలులు, మండే ఎండలను సైతం తట్టుకునే విధంగా కట్టు దిట్టంగా నిర్మించింది.
అయితే మొదట ఈ భూముల్లోని మట్టి పూల సాగుకు సరిపోలేదు. దీంతో ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె దగ్గర నుంచి చామంతి సాగుకు సరిపడే ఎర్రమట్టిని తీసుకొచ్చి బెడ్లుగా తయారు వేశారు. మొక్కలకు సరైన గాలి, వెలుతురు తగిలేలా బెడ్ల మధ్య గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎర్రమట్టితో తయారు చేసిన బెడ్లలోని మట్టికి ముందుగా భూసార పరిక్షలు చేయించి, సేంద్రీయ ఎరువులను వేశారు. మట్టిలోని క్రిములను సంహరించి, ఆ తర్వాత మొక్కలు నాటారు. హాలెండ్ రకం చామంతులకు క్వాలిటీ, బరువుతో పాటు మార్కెట్లో మంచి రేటు ఉంది. అయితే అధిక దిగుబడులు కావాలంటే అధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగ్గా తీసుకోవాలి.
పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడి కొడుకు బైరెడ్డి సిద్దార్ద రెడ్డి పాలీహౌస్‌లో చామంతిని సాగు చేస్తున్నారు. గతంలో పండించిన పంటల కంటే చామంతి పూల సాగు బాగా వచ్చిందని చెబుతున్నారు సిద్ధార్థ్‌రెడ్డి. తొలి పంటతోనే లాభం వచ్చేలా ఉందంటున్నారు. నందికొట్కూరుకు చెందిన కృష్ణమూర్తి బిటెక్ చదవి, లండన్ లో ఎమ్ ఎస్ పూర్తి చేశాడు. కొంత కాలం నుంచి చెన్నైలోని HCLలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఓవైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు సొంతూరులో ఉన్న భూముల్లో ఎకరా పొలంలో పాలిహౌస్ ఏర్పాటు చేశాడు. సెలవు రోజుల్లో చెన్నై నుంచి పొలానికి వచ్చి చామంతి పూల సాగులో నిమగ్నమౌతాడు. నూతన టెక్నాలజీని వాడుకుంటూ పూలసాగులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు.
వీళ్లే కాదు.. కర్నూలుకు చెందిన రాధిక కూడా 2015 నుంచి వివిధ రకాల కూరగాయల సాగు చేస్తున్నారు. అంతర్జాలంలో శోధించి హాలెండ్ రకం చామంతిని అర ఎకరా పొలంలో సాగు చేశారు. మరికొన్ని రోజుల్లోనే తొలిపంట చేతికి రానుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగంపై చూపే ఆసక్తి వ్యవసాయంపైన చూపిస్తే సాగులో అద్బుతాలు సాధ్యమంటున్నారు రాధిక ఇపుడు యువ రైతుల పాలీహౌజ్‌ సాగు అందరికి ఆకర్షిస్తోంది. యువతను మెచ్చుకుంటూనే మిగతా వాళ్లూ ఆ అడుగు జాడల్లో నడిచేందుకు సిద్ధమవుతున్నారు.

అన్నపూర్ణకు ఆక్వా ముప్పు!

  • ఉప్పునీటి కయ్యలుగా మారుతున్న భూములు
లాభాల వేటలో పడి ఆక్వా సాగులో నిబంధనలకు నీళ్లొదలడంతో ఉభయగోదావరి జిల్లాల్లో సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. సాగుకు పనికిరాని చౌడు భూములు, పంట పండని భూములు, ముంపు భూముల్లో మాత్రమే ఆక్వా సాగు చేపట్టాలి.
సారవంతమైన భూముల్లో అనుమతులు లేకుండా చెరువులు తవ్వడం, మంచినీటితో రొయ్యల సాగు చేస్తామని చెప్పి అనుమతులు తీసుకుని, ఉప్పునీటితో సాగు చేయటం వల్ల భూగర్భ జలాలకు ముప్పు వాటిల్లుతోంది. ఉప్పునీటి కాలువల పక్కన ఉన్న చేలు మాత్రమే ఆక్వా సాగుకు అనుకూలం. సరిహద్దు రైతుల పొలాల్లో ఊటనీరు దిగకుండా చెరువు చుట్టూ మూడు మీటర్లు వదిలేసి ఊటబోదెలను తవ్వాలి. ఇందులోకి దిగిన ఊటనీరు పోవడానికి వీలుగా ఊటబోదెలను మురుగు కాలువలకు అనుసంధానం చేయాలి. ఈ నిబంధనలేవీ రైతులు పాటించడం లేదనే విమర్శలున్నాయి.
ఆక్వా సాగుదారులు భూమిలో 180-300 అడుగుల లోతు వరకూ బోర్లు తవ్వి ఉప్పు నీటిని బయటకు తెస్తున్నారు. రెండున్నర అడుగుల లోతు తవ్వాల్సిన చెరువును ఆరు అడుగుల వరకూ తవ్వుతున్నారు. ఎకరాకు 1.25 లక్షల రొయ్య పిల్లల్ని వేయాల్సి ఉండగా నాలుగు లక్షల వరకూ సీడ్‌ను వేస్తున్నారు.
రొయ్యల ఉత్పత్తి బాగుండాలని యాంటీబయాటిక్స్‌ విపరీతంగా వాడుతున్నారు. చిన్న సన్నకారు రైతులను బలవంతంగా ఒప్పించి వారి భూములను లాక్కుంటున్నారు. అనుమతులు రైతుల పేరన ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆక్వా సబ్సిడీలు, రుణమాఫీలు లీజుదారుల పరమవుతున్నాయి. సెలనీటి శాతం పెరిగిపోయి భూమి పొరల్లో సహజసిద్ధంగా ఉండే మంచినీటి వనరులు పాడైపోతున్నాయి.
పరిమితికి మించిన ఉప్పునీరు, యాంటీబయాటిక్స్‌ నేల పొరల్లో ఇంకిపోయి అంతిమంగా కెమికల్స్‌ కలిసిన ఉప్పుభూమిగా రూపాంతరం చెందుతుంది. సాగు పూర్తయిన తరువాత చెరువుల్లో ఉన్న ఉప్పునీటిని శుద్ధి చేసి మురుగు కాలువల్లోకి దింపాలి. కానీ అలా జరగడంలేదు. శుద్ధి కాని ఆ సాల్ట్‌వాటర్‌నే సాగుకు వినియోగిస్తున్నారు. దీంతో సాగుభూములు కూడా చౌడుబారిపోయే ప్రమాదం తలెత్తింది. మంచి నీటితో రొయ్యల సాగు చేపడతామని అనుమతులు తీసుకుని ఉప్పు నీటితో సాగు చేస్తున్నారు.
దీంతో గ్రామాల్లోని మంచినీటి బావులు, పంచాయతీ చెరువులు, పంట పొలాల్లో తవ్వుతున్న ఫారమ్‌ఫాండ్స్‌ నిరుపయోగమవుతున్నాయి. ప్రభుత్వం విదేశీ మారకద్రవ్య రూపంలో వచ్చే ఆదాయాన్ని చూస్తున్నది తప్ప, సహజసిద్ధమైన వనరులు నాశనమైపోతున్నాయనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్న దంటున్నారు నిపుణలు. ఈ తరహా ఆక్వా సాగు వల్ల సహజసిద్ధంగా లభించే మత్స్య సంపద కూడా అంతరించిపోతున్నది.
ఆక్వాజోన్‌ల ఏర్పాటు: ప్రసాద్‌, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆక్వా చెరువుల తవ్వకానికి పలు నిబంధనలు విధించాం. ప్రాంతాలవారీగా గ్రామసభలను నిర్వహించి ఆక్వా జోన్‌లను ఏర్పాటుచేస్తున్నాం. అనుమతులు లేకుండా చెరువులు తవ్వితే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అమలాపురం, కాజులూరు, కరప తదితర ప్రాంతాల్లో అనుమతులు లేని చెరువులను ఆపేశాం.
Credits : Andhrajyothi

ఇచ్చోడలోఆర్గానిక్‌ బొప్పాయి

  • లాభాల బాటలో గిరిజన రైతులు
ఆదిలాబాద్‌ అనగానే పత్తి, సోయా పంటలు గుర్తుకు వస్తాయి. ఆ జిల్లా రైతులు దశాబ్దాలుగా ఆ పంటలే సాగు చేస్తూ కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. కానీ ఈ ఏడాది ఆదిలాబాద్‌లోని పలువురు గిరిజన రైతులు ఉద్యాన పంటల సాగు బాట పట్టారు. పంట మార్పిడికి ప్రాధ్యానత ఇవ్వడం, అంతరపంటలు సాగు చేయడం, నూతన యాజమాన్య పద్ధతుల ద్వారా ఖర్చులు తగ్గించుకుని దిగుబడులు పెంచుకునేందుకు యత్నిస్తున్నారు. ఇచ్చోడ మండలం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన రైతు దుర్వ ముండే తనకున్న రెండెకరాల భూమిలో బొప్పాయి సాగు చేపట్టాడు.
మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి బొప్పాయి మొక్కలు తీసుకువచ్చాడు. ఒక్కో మొక్క ధర 13 రూపాయలు. 2 వేల మొక్కలు తెప్పించిన దుర్వ ముండే సేంద్రియ పద్ధతిలో సాగు చేపట్టాడు. ఇదే మండలం నవేగామ్‌ గ్రామానికి చెందిన రైతు చోలే మధుకర్‌ తన ఎనిమిదెకరాల భూమిలో పదివేల రెడ్‌ తడి రకం బొప్పాయి మొక్కలను నాటారు. వీటికి రూ.లక్షా యాభై వేలు ఖర్చు చేశారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని అందిస్తున్నారు.
సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఈ రైతులు పండించిన పంటలకు మంచి గిరాకీ వుంటున్నది. హైదరాబాద్‌, మహారాష్ట్రల నుంచి వ్యాపారులు నేరుగా పొలం దగ్గరకే వచ్చి బొప్పాయి కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నారు. దీంతో రైతులకు డబ్బు, శ్రమా ఆదా అవుతున్నది. సేంద్రియంగా సాగు చేయడం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం కూడా పెరిగిందంటున్నారు ఆ రైతులు.
సేంద్రియ ఎరువుల తయారీ ఇలా..
పది లీటర్ల గోమూత్రం, ఐదు కేజీల బెల్లం, రెండు కిలోల పుట్టమట్టి 200 లీటర్లు నీళ్లు కలిపి తయారు చేసి ఎనిమిది రోజులు నిల్వ ఉంచిన తర్వాత రోజు విడిచి రోజు కలియబెట్టాలి. పది రోజుల తర్వాత వెయ్యి లీటర్ల నీటిలో కలిపి ప్రతి చెట్టుకు అర లీటర్‌ చొప్పున పిచికారీ చేస్తే బొప్పాయికి కాచిన పూత రాలదు. దాంతో పాటు చీడపీడలు దరిచేరవు. అధిక దిగుబడి రావడం వల్ల రైతులు లాభపడతారు.
బొప్పాయి సాగు లాభసాటి
పత్తి కంటే బొప్పాయి సాగు లాభసాటిగా వుంది. ఆరేళ్ల నుంచి బొప్పాయి సాగు చేస్తున్నాను. పెట్టుబడి ఖర్చులు తక్కువగా వుండడంతో మంచి ఆదాయం వస్తున్నది.
– చోలె మధుకర్‌, రైతు, నవేగామ్‌
మెళకువలతో అధిక దిగుబడులు
మేలైన విత్తన ఎంపిక బొప్పాయి సాగులో కీలకం. నల్లరేగడి నేలలు బొప్పాయి సాగుకు ఉత్తమం. తక్కువ నీటి తడులతోనే పంట చేతికి వస్తున్నది.
– దుర్వ ముండే, రైతు, నర్సాపూర్‌
 Credits : Andhrajyothi

పెట్టుబడులు తక్కువ

సేంద్రియ సేద్యం ఈ కాలంలో తారకమంత్రంగా మారింది. పుడమితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సేంద్రియ సేద్యం ఏకైక మార్గం. ఆరోగ్యవంతమైన నేల, పంట, ఆహారం.. ఇదే మన లక్ష్యం అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేంద్రియ సేద్యం దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నది.
సేంద్రియ సాగులో ఖర్చులు తక్కువ. 2006లో ఎకరాతో మొదలు పెట్టి ఇప్పుడు మూడెకరాల్లో సేంద్రియ వరి సాగు చేస్తున్నాను. రసాయన ఎరువులతో 25-30 బస్తాల దిగుబడి వచ్చేది. సేంద్రియ ఎరువులతో 24 బస్తాల ధాన్యం వచ్చింది. ఎకరానికి రూ.10 వేల పెట్టుబడితో అనేక రెట్లు ఆదాయం లభించింది. సేంద్రియ పద్ధతి పంటకు బస్తాకు రూ.200 అదనపు ధర దక్కింది.
– బి.అప్పలనాయుడు, సంతకవిటి, శ్రీకాకుళం జిల్లా
Credits : Andhrajyothi

వేరుశనగకు ఆకుముడత బెడద

మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులు భారీ విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేస్తున్నారు. వేరుశనగకు ఆకుముడత తెగులు సోకింది. ఈ తెగులుతో పాటు పచ్చపురుగు, వేరుపురుగు, దోమకాటు వస్తున్నాయి. దీంతో దిగుబడులు తగ్గి, భారీగా నష్టపోయే ప్రమాదం వుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ఆకుముడత, దోమతో పాటు వేరుపురుగు కూడా వచ్చింది. పంటకు నష్టం వాటిల్లుతోంది. నివారణకు ఏంచేయాలో తోచడం లేదు.
– స్వరూపరెడ్డి రైతు ఇబ్రహీంబాద్‌, హన్వాడ మండలం
సస్యరక్షణ చర్యలు ఇలా…
వేరుశనగ పంటకు సోకుతున్న ఆకుముడత, పచ్చపురుగు తెగుళ్ల నివారణకు రైతులు మందులు పిచికారీ చేయాలి. ఆకుముడత నివారణకు మోనోక్రొటోఫాస్‌ 1.6 మిల్లీలీటర్ల మం దును ఒక లీటర్‌ నీటితో కలిపి లేదా క్లోరోపైరిఫాస్‌ 2.5 మి.లీ. ఒక లీటర్‌ నీటితో కలిపి పిచికారీ చేస్తే తెగుళ్లు సోకవు. పచ్చ పురుగుకు బెంజత్‌ 100 గ్రా. మందును పది లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. వేరు తినే పురుగుల నివారణకు గుళికలు ఎకరాకు 6 కేజీలు వేయాలి.
– చంద్రమౌళి, ఏ.ఓ.
Credits : Andhrajyothi

ఎకరంలో వరి సాగు..లక్ష ఆదాయం

  • ప్రకృతి సేద్యంలో కృష్ణా రైతు ఆదర్శం
కాయకష్టంతో పాటు కాలానుగుణంగా ఆధునిక సాగు పద్ధతుల్ని అందిపుచ్చుకుంటున్న రైతులు అద్భుతాలు చేస్తున్నారు. ఎకరం భూమిలో వరి సాగు చేసి లక్ష రూపాయల ఆదాయం ఆర్జించారు ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రైతు జలసూత్రం వీరవసంతరావు. తనకున్న చౌడు భూమిని ఎంతో శ్రమించి, ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా సారవంతం చేశాడు ఆ రైతు. చౌడు నేలలో ప్రకృతి వ్యవసాయం ఏమిటని అందరూ అవహేళన చేశారు.
మొదటి సంవత్సరం రసాయనాలు నిండిన భూమిని సారవంతం చేసేందుకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతాలు వాడి పంటలకు అనువుగా భూమిని సిద్ధం చేశారు. మొదటి ఏడాది ఎకరాకు 24 బస్తాలు పండించగా రెండో ఏడాది ఎకరాకు 32 బస్తాలు, ఈ ఏడాది ఏకంగా ఎకరాకు 44 బస్తాల దిగుబడిని సాధించారు. వచ్చే ఏడాది గరిష్ఠంగా ఎకరాకు 55 బస్తాలు పండించగలనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది తన పొలంలో సాగు చేసిన వరి కంకికి 320 గింజల దిగుబడి వచ్చిందని, దుబ్బు 40 పిలకలు చేయడంతో మంచి దిగుబడి సాధ్యమైందన్నారు. చీడపీడలను గుర్తించేందుకు పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటుచేసి వ్యవసాయ అధికారుల సూచనలకు అనుగుణంగా కషాయాలను మాత్రమే పిచికారీ చేసి తెగుళ్లు సోకకుండా ఆరోగ్యవంతమైన పంటను పండించామన్నారు. ఈ విధానం ద్వారా పండించిన పంట నాణ్యత, రుచి అధికంగా ఉండటంతో మార్కెట్లో ఈ ధాన్యానికి మంచి డిమాండ్‌ ఉంటోంది.
ఈ రకం బియ్యం కేజీ ధర రూ.50 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. కనీస ధర రూ.50 చొప్పున అమ్మితే ఎకరాకు పండిన 3,240 కేజీల ధాన్యానికి 2,430 కేజీల బియ్యం వస్తుందని, దీనికి మార్కెట్లో రూ.1,21,500 ఆదాయం లభిస్తోంది. ‘భవిష్యత్‌లో ప్రకృతి వ్యవసాయం నిరుద్యోగ యువతకు వరం కానుంది. వరి, వేరుశనగ, మిర్చి, జామ, మామిడి, మినుము, కరివేపాకు పంటల్లో కూడా ఊహలకు అందని దిగుబడులు సాధించి చూపాం. కాలుష్యరహిత ఉత్పత్తులను సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు వ్యవసాయ అధికారి జి.వి.శ్రీనివాసరావు.
పాలేకర్‌ స్ఫూర్తిగా..
ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్‌ శిక్షణ తరగతుల ద్వారా స్ఫూర్తి పొందాను. పట్టుదలతో సాగు చేశాను. వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో విజయం సాధించాను. ఎకరం పొలంలో రూ. 15 వేల ఖర్చుతో వరి సాగుచేసి లక్షకు పైగా ఆదాయం పొందుతున్నాను. మామిడితోటలో కూడా సేంద్రియ సస్యరక్షణ ద్వారా 16 చెట్ల ద్వారా గత ఏడాది రూ.1,40,000 ఆదాయం పొందాను.
– జలసూత్రం వీరవసంతరావు, రైతు వడ్లమాను, కృష్ణాజిల్లా
Credits : Andhrajyothi

బహుళ పంటలు.. భలే లాభాలు

వాణిజ్య పంటలకు స్వస్తి చెప్పి ఉద్యాన పంటలు అది కూడా బహుళ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు ఖమ్మం జిల్లా బోనకల్‌ రైతులు. గిట్టుబాటు ధరలు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అన్నదాతలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న ఆ రైతుల స్ఫూర్తి గాథ ఇది.
వ్యవసాయ మండలంగా పేరున్న బోనకల్‌లో కొందరు రైతులు వాణిజ్య పంటలను కాదని బహుళ పంటల సాగు వైపు మళ్లారు. పది సంవత్సరాల నుంచి ఒకే భూమిలో.. ఏడాదికి మూడు నుంచి నాలుగు పంటల వరకు సాగుచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి నాగచంద్రుడు, డేగల లక్ష్మీనారాయణ తదితర రైతులు సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ ఏడాది జూన్‌లో బంతి సాగుచేశారు ఆ రైతులు. బంతిపూల దిగుబడి పూర్తవడంతో ఆ తోటలో బీరవేసి… ఆ తీగను బంతిపూల చెట్లపైకి పాకించారు. ప్రస్తుతం వేసిన బీర 45 రోజుల్లో దిగుబడి పూర్తవుతుంది. ఆ తర్వాత ఇదే భూమిలో మళ్లీ కూరగాయల సాగుకు సిద్ధమవుతున్నారు. యాపిల్‌బెర్‌ ప్రధాన పంటగా వేసి అందులో అంతరపంటగా పచ్చిమిర్చిని వేశారు. పచ్చిమిర్చి తర్వాత కాకర వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పందిరి విధానంలో దొండ సాగు, స్పేకింగ్‌ విధానంలో టమోటా, కాకరను సాగు చేస్తున్నారు. తైవాన్‌ జామలో అంతరపంటగా బంతి వేసి మంచి దిగుబడిని సాధించారు. ఒక్కో రైతు తమకున్న పొలాల్లో తక్కువ కాలవ్యవధిగల పంటలను ఎంచుకొని ఒకే ఏడాదిలో మూడు పంటలను సాగుచేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృథా చేయకుండా రాబడి పొందుతున్నారు.
ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
ఆదర్శ సేద్యం చేస్తున్న బోనకల్‌ మండలం ముష్టికుంట్ల రైతులను ప్రపంచ బ్యాంకు బృందం ప్రశంసించింది. ఉద్యాన పంటలను సాగుచేయటంతో పాటు బహుళ వార్షిక పంటలను సాగుచేస్తూ అధిక లాభాలను గడించి సాగులో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారంటూ అభినందించింది.
ఏటా మూడు పంటలు
నాకు 5 ఎకరాల భూమి వుంది. ఈ ఏడాది ఒక ఎకరం భూమిలో బంతి వేయగా రూ.లక్ష ఆదాయం వచ్చింది. ఆ తర్వాత అందులో బీర వేశాను. దాని తర్వాత అదే భూమిలో కూరగాయలు పండిస్తా. యాపిల్‌బెర్‌లో అంతరపంటగా పచ్చిమిర్చి వేశా. ఇప్పటికే 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పచ్చిమిర్చి తర్వాత కూరగాయల సాగుచేస్తా. మరో ఎకరం భూమిలో తైవాన్‌ జామ వేసి అందులో అంతరపంటగా బంతి వేశా. అది పూర్తయ్యాక కూరగాయలు సాగుచేస్తా.
– బొడ్డుపల్లి నాగచంద్రుడు, రైతు, ముష్టికుంట్ల
Credits : Andhrajyothi