కటింగ్‌ యంత్రం.. వరం 

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నంద్యాల: రోజుకు ఎనిమిది ఎకరాల్లో చెరుకు పంటను చకచకా కోసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. డబ్బుతో పాటు సమయాన్ని ఆదా చేసే ఈ యంత్రం రైతుకు వరంగా మారింది.
చేతికి వచ్చిన చెరుకు పంటను కోసేందుకు ఇప్పుడు ఆధునిక యంత్రం రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రంతో రోజుకు ఆరు నుంచి ఎనిమిది ఎకరాల చెరుకు పంటను కోసే వీలుంది. చేతికి వచ్చిన చెరకు పంటను కోసేందుకు రైతులు కూలీల మీద ఆధారపడాల్సి వస్తున్నది. టన్ను చెరకు కోసేందుకు కూలీలకు 600 నుంచి 1000 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తున్నది. కూలీల కొరత కారణంగా సకాలంలో పంటను కోయలేక రైతులు నష్టపోతున్నారు. ఈ తరుణంలో చెరుకు మిల్లుల యాజమాన్యాలు ఈ కోత యంత్రాన్ని రైతులకు పరిచయం చేశాయి. ఆధునిక పరిజ్ఞానంతో వచ్చిన ఈ యంత్రం వేగంగా చెరుకు కటింగ్‌ చేయడంతో రైతులకు ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతున్నాయి.
డబ్బు.. సమయం ఆదా
ఆధునిక యంత్రాల వినియోగం వల్ల రైతులకు నాణ్యమైన పంట చేతికి వస్తుంది. ఖర్చు తగ్గడంతో పాటు సకాలంలో పంటను కోసే అవకాశం వుంటుంది. దీని వల్ల రైతుకు డబ్బు, సమయం ఆదా అవుతుంది. రైతులంతా ఈ ఆధునిక యంత్రాలను ఉపయోగించుకోవాలి.
Credits : Andhrajyothi

శాటిలైట్ సేద్యం

వర్షాభావాలు, వెంటాడుతున్న అప్పులు, పడిపోతున్న ధరలు, పాలకుల నిర్లిప్తతలు… అన్నీ కలిసి అన్నదాతను ఆత్మహత్య వైపు నడిపిస్తున్నాయి. సమస్యలతో కుదేలైపోతున్న రైతన్నకు ఆధునిక టెక్నాలజీతో అండ అందించేందుకు ఓ స్టార్టప్‌ కృషిచేస్తోంది… పేరు శాట్‌స్యూర్‌. ఆ ప్రయోగాలకు వేదిక శ్రీకాకుళం జిల్లా.
దేశ జనాభాలో కోటీ తొంభై లక్షల మందికి కడుపునిండా అన్నం అందడం లేదు. నూట ముప్పై కోట్ల జనాభా ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే… 2050 కల్లా ఆ జనాభా నూట డెబ్బయి కోట్లకు చేరుకుంటుందే! అప్పుడెలా?
ఆ దుస్థితి దరిచేరకూడదంటే వ్యవసాయమే దిక్కు. సేద్యమే భవితకు ఆధారం. కానీ, ఆ వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల జీవితం దుర్భరంగా మారిందే!
ఒక పక్క పేదల ఆకలి కేకలు, మరో పక్క అన్నదాతల ఆత్మహత్యలు… ఈ పరిస్థితుల్లో పంటల దిగుబడి పెంచుకోవడమెలా? రేపటి తరానికి మెతుకు భరోసా ఇచ్చేదెలా?
‘పరిష్కారం మేం సూచిస్తాం’ అంటూ ఎన్నో స్టార్టప్‌లు ముందుకు వస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీని అంతరిక్షాన్ని చేరుకోవడానికే కాదు… భూమి తల్లిని పచ్చగా మార్చేందుకూ ఉపయోగించుకోవచ్చంటున్నాయి. ఆ లక్ష్యంతో పుట్టుకొచ్చిన సంస్థే శాట్‌స్యూర్‌.
తొలి అడుగు …
యూకేలో పుట్టి… ఇండియాతో పాటు అనేక దేశాల్లో రైతులకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చిన స్టార్టప్‌ శాట్‌స్యూర్‌. 2015లో ఇస్రో నుంచి బయటికి వచ్చిన అంతరిక్ష శాస్త్రవేత్తల సృష్టి ఇది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. స్పేస్‌ టెక్నాలజీని ఉపయోగించి… శాటిలైట్‌ ఫోటోల ద్వారా నేల స్వభావాన్ని తెలుసుకోవడమే శాట్‌స్యూర్‌ చేసే పని. భూమి తత్వాన్ని గ్రహించడం ద్వారా… ఆ నేలలో ఏ పంటలు పండుతాయి? ఎన్ని రోజుల్లో పంటను అందుకోవచ్చు? అక్కడి వాతావరణ పరిస్థితులేంటీ? ఆ తేమకు ఎలాంటి పంటలు వేయడం మంచిది?… వంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. శాట్‌స్యూర్‌ ఇప్పటికే తన పనిని ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల జిల్లా అయిన శ్రీకాకుళంలో మొదలుపెట్టింది. అనుకున్న ఫలితాలను పొందింది. గతేడాది విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం, బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సమన్వయంతో నిర్వహించిన ‘గ్లోబల్‌ అగ్‌టెక్‌ పిచ్‌’ కార్యక్రమంలో ఈ స్టార్టప్‌ విజేతగా నిలిచింది. ఆ ఆలోచన నచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ వినూత్నమైన బాధ్యత అప్పగించారు. అందులో భాగంగానే, పైలెట్‌ ప్రాజెక్టుగా సిక్కోలు ప్రాంతాన్ని పరిశోధనలకు ఎంచుకుంది శాట్‌స్యూర్‌.
తొలి విజయం…
ముందుగా, శ్రీకాకుళంలో నేల స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు శాట్‌స్యూర్‌ సభ్యులు. వివిధ ప్రాంతాల్లో మట్టిని సేకరించి… వాటిని భాగాలుగా చేశారు. ఎక్కువ ఎరువులు వేసి పండించాల్సిన భూమి, తక్కువ ఎరువులతో పండించాల్సిన భూమి, అధిక నీరు కావాల్సిన భూమి, తక్కువ నీటితోనే పండే భూమి… ఇలా రకరకాలుగా విభజించారు. ఆ ఫలితాలను కంప్యూటర్‌లో నమోదు చేశారు. పలుచోట్ల వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేక యంత్రాల్ని పెట్టి… శాటిలైట్‌కు అనుసంధానం చేశారు. వాటి ద్వారా అందుకున్న సమాచారంతో పాటు ఎప్పటికప్పుడు తీసిన ఫోటోలనూ వివరాలనూ శాస్త్రవేత్తల కంప్యూటర్‌కు పంపింది శాటిలైట్‌. సమాచారాన్ని విశదీకరించి… శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో ఎన్ని ఎకరాల్లో… ఏ పంటలు పండే అవకాశం ఉందో గుర్తించి ఓ నివేదిక తయారు చేశారు. దాని ప్రకారం, జిల్లాలోని పాతపట్నం, పాలకొండ ప్రాంతాల్లో పంటల పరిస్థితిని విశ్లేషించారు. ఆ ప్రకారంగానే, మొక్కజొన్న పండేందుకు దాదాపు 1248 హెక్టార్ల భూమి అనుకూలంగా ఉండగా… ప్రస్తుతం 1361 హెక్టార్లలో ఆ పంటను పండిస్తున్నారు. అలాగే చెరుకు 1248 హెక్టార్లలో పండే అవకాశం ఉండగా… ప్రస్తుతం 1083 హెక్టార్లలో పండిస్తున్నారు. మొత్తానికి సిక్కోలులో ప్రారంభించిన పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం అయినట్టే.
భవిష్యత్తులో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరిన్ని పరిశోధనలను చేపట్టేందుకు శాట్‌స్యూర్‌ సిద్ధంగా ఉంది. ఆ కంపెనీ సీఈవో అమర్‌దీప్‌ మాటల్లో చెప్పాలంటే… కేవలం ఒక రూపాయి వ్యయంతో ఎకరా పొలానికి సంబంధించిన విశ్లేషణను రైతులకు అందించేందుకు శాట్‌స్యూర్‌ కృషి చేస్తోంది. నేల నైజాన్ని తెలపడమే కాదు… రైతుకు ఆర్ధికపరమైన భరోసాను అందించడం కూడా సంస్థ లక్ష్యాలలో ఒకటి. ప్రతి రైతు చేతా పంటను బీమా చేయించేందుకు, తేడావస్తే ఇన్సూరెన్స్‌ డబ్బు త్వరగా ఇప్పించేందుకు కూడా.. తమ వంతు సాంకేతిక సహకారం అందిస్తుంది శాట్‌స్యూర్‌.
Credits : Andhrajyothi

అందం.. ఆరోగ్యం 

పెరట్లో, ఇంటి ముందు ఖాళీస్థలంలో, చివరకు ఇంట్లో కూడా ఔషధ మొక్కలు పెంచుకోవచ్చు. గాలిని శుభ్రం చేయడంతో పాటు సువాసనలు వెదజల్లే ఈ మొక్కలు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని ఎంతగానో పెంపొందిస్తాయి.
ఇంటి అందాన్ని పెంచే మొక్కలతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని పంచే మొక్కలను ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇంటి లోపల కుండీల్లో లేదా కాస్త గాలి, వెలుతురు వున్న వరండా, బాల్కనీ, ప్రహరీగోడల మీద కూడా ఈ మొక్కలను పెంచుకోవచ్చు. ఔషధ గుణాలు పుష్కలంగా వుండే ఈ మొక్కలు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు మధురమైన సువాసనల్ని పంచుతాయి. పెద్దగా శ్రమ లేకుండా, తక్కువ ఖర్చుతో, తక్కువ స్థలంలో ఈ మొక్కల్ని పెంచుకునే అవకాశం వుంది.
తులసి : వేల సంవత్సరాలుగా ప్రతి ఇంట్లో తులసిని పెంచడం సంప్ర
దాయంగా వస్తున్నది. తులసి ఔషధ గుణాలకు నిలయం. తులసి ఆకులను వేడి నీటిలో తేనెతో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని మాలిన్యాలను తులసి శుద్ధి చేస్తుంది. ఇంట్లో కాస్త ఎండపొడ వుండే చోట చిన్న కుండీలో కూడా తులసిని పెంచుకోవచ్చు.
 
లెమన్‌ గ్రాస్‌ : నిమ్మగడ్డికి ఈ కాలంలో మంచి డిమాండ్‌ వుంది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ నిమ్మగడ్డిని కాస్త పెద్ద కుండీలో పెంచుకోవచ్చు. నిమ్మగడ్డి టీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ ఆకుల్ని ఎండబెట్టి పౌడర్‌గా చేసుకుని తాగితే శరీరానికి ఉత్సాహం లభిస్తుంది. సువాసనలు వెదజల్లే నిమ్మగడ్డి ఇంట్లో క్రిమికీటకాలు రాకుండా కూడా చూస్తుంది.
వాము మొక్క : వాము మొక్కను కాస్త పెద్ద కుండీలో పెంచుకోవచ్చు. ముదురుపచ్చని ఆకులతో ఇంటి అందాన్ని పెంచే వాము మొక్క ఔషధాలకు నిలయం. వాము ఆకులు వంటల్లో వాడుకోవచ్చు. వాము ఆకులు అజీర్తిని తగ్గించి ఆకలిని పెంచుతాయి.
పుదీన : పుదీన మొక్కలను కాస్త పెద్ద కుండీలో పెంచుకోవచ్చు. మంచి వాసన రావడంతో పాటు పుదీనలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రుచిని, ఆకలిని పెంచే గుణం వున్న పుదీన ప్రతి ఇంట్లో వుండాల్సిన మొక్కల్లో ఒకటి.
సబ్జా మొక్క : పెరట్లో, వరండాలో, బాల్కనీల్లో కుండీల్లో సబ్జా మొక్కలను పెంచుకోవచ్చు. సబ్జా గింజలు వేసవిలో చలవ చేస్తాయి. శరీరాన్ని కాంతివంతంగా చేస్తాయి. బరువు తగ్గేందుకు కూడా సబ్జా గింజలు ఉపయోగపడతాయి.
సుగంధ మొక్క : దోమలను పారద్రోలడంతో పాటు కంటికి ఇంపుగా వుండే సుగంధ మొక్కను చిన్నసైజు కుండీలో కూడా పెంచుకోవచ్చు.
Credits : Andhrajyothi

ఇండోర్‌ మొక్కలతో కనువిందు

వరండాలో, పెరట్లో, పోర్టికోలో, టెర్రస్‌ మీద కూడా మొక్కలు పెంచేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఠీవీగా నిలబడే అరుదైన మొక్కలు కార్యాలయాల హుందాతనాన్ని మరింతగా పెంచుతున్నాయి. అపార్టుమెంట్లు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి మొక్కలు పెంచుకోవాలనే ఆలోచన వున్నా ఆచరణలో కష్టంగా మారుతున్నది. వారి కోరికను ఇండోర్‌ ప్లాంట్స్‌ తీరుస్తున్నాయి. బెడ్‌రూమ్‌ల్లో, టీవీ వద్ద, డైనింగ్‌ టేబుల్‌ మీద, స్టడీటేబుల్‌ మీద, టీపాయ్‌ మీద, కార్యాలయాలలోనూ సూర్యరశ్మి అందని ప్రదేశాల్లో కూడా పెంచుకునే వీలుంది. హేంగింగ్‌పాట్స్‌లో కూడా ఈ అందమైన మొక్కల్ని పెంచుకునే వీలుంది. ఏడాదికి 4 నుండి 5 అంగుళాలు మాత్రమే పెరుగుతూ ఉండే ఈ ఇండోర్‌ప్లాంట్స్‌ను సన్‌లైట్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు.
ఇంటి అందాల్ని రెట్టింపు చేసే కొన్ని ఇండోర్‌ ప్లాంట్స్‌ ఇవి…
అగ్లోనిమా లిప్‌స్టిక్‌ రెడ్‌: ‘‘అగ్లోనిమా లిప్‌స్టిక్‌ రెడ్‌’’ అనే పేరుతో పిలిచే ఈ మొక్క థాయిలాండ్‌ దేశానికి చెందినది. ఈ మొక్క ఎరుపు రంగులో చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. వీటిలో సుమారు 5 నుండి 6 రకాల వరకు ఉన్నాయి. రెండు రోజులకొకసారి మాత్రమే నీరు పోస్తూ జాగ్రత్తగా ఈ మొక్కలు పెంచుకోవాలి. అపుడపుడు బ్లైటాక్స్‌ మందు పిచికారీ చేయాలి.
 
మెరంటా రెడ్‌ : ఈ మొక్క మెరంటా జీబ్రా కుటుంబానికి చెందినది. ఇతర దేశాల నుండి బెంగుళూరు వచ్చిన ఈ మొక్క ప్రస్తుతం కడియం నర్సరీల్లో హాట్‌కేకులా మారింది. ఈ మొక్క ఆకుపై సన్ననిగీతలుంటాయి. ఇందులో ఎరుపు, తెలుపు, పసుపు తదితర రంగుల్లో మొక్కలున్నాయి.
 
అగ్లోనిమా డౌ: కలక త్తాకు చెందిన ఈ ఇండోర్‌ప్లాంట్‌ అగ్లోనిమా జాతికి చెందినది. ఇందులో అగ్లోనిమాడౌ రెడ్‌, అగ్లోనిమాడౌ గ్రీన్‌, అగ్లోనిమాడౌ రాజా అనే రకాలు ఉన్నాయి.
జెనడాగోల్డ్‌: ఫెలోడేండ్రన్‌ జీనాడోగా పిలిచే ఈ మొక్కలో గ్రీన్‌, ఎల్లో వంటి రకాలు ఉన్నాయి. బెంగుళూరు నుండి తీసుకొచ్చిన ఈమొక్క ప్రస్తుతం కడియం నర్సరీల్లో అందాల్ని ఒలకబోస్తుంది.
ఫెలోడేండ్రన్‌ సేలం: బెంగుళూరుకు చెందిన ఈ మొక్క ‘ఫెలోడేండ్రన్‌’ రకానికి చెందినది. ఇందులో గ్రీన్‌, ఎల్లో వంటి రకాలు ఉన్నాయి.
ఇంటి అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కల పాత్ర
ఎనలేనిది. అందుకే మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి వ్యాపకంగా మారింది.
Credits : Andhrajyothi

ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ వేస్ట్‌!

చిన్న రైతులను నిర్వీర్యం చేసే ఇజ్రాయెల్‌ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పట్ల తెలుగు రాష్ట్రాల రైతులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు పాలస్తీనా ప్రజలు, రైతుల సంక్షేమం కోసం 15 ఏళ్లుగా కృషి చేస్తున్న ఉద్యమకారిణి, రచయిత్రి మరెన్‌ మాంటోవని. స్టాప్‌ ద వాల్‌ ఉద్యమం, పాలస్తీనీయుల భూమి పరిరక్షణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె తెలుగు రాష్ట్రాలు ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ ఉచ్చులో ఎలా చిక్కుకుంటున్నారనే అంశంపై హైదరాబాద్‌ లో పాలస్తీనా రైతులతో స్కైప్‌ ద్వారా ఇష్టాగోష్టి ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మరెన్‌ ‘కృషి’తో మాట్లాడారు.
తెలుగు రైతులూ పారాహుషార్‌!
 
ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీతో ఎడారిని సైతం సస్యశ్యామలం చేస్తామని చెబుతున్నారు. అందులో నిజం లేదంటారా?
ఇజ్రాయెల్‌కు చెందిన నెటాఫిమ్‌ సంస్థ భారత్‌తో సహా పలు ప్రపంచ దేశాల్లో ఇదే విషయాన్ని ప్రచారం చేసుకుంటున్నది. పాలస్తీనా ప్రజల నుంచి వారి జీవితాలను, భూమిని, వనరులను లాక్కుని, అక్కడి రైతుకు నీరివ్వకుండా, సొంత భూముల్లో సేద్యం చేయనివ్వకుండా ఇజ్రాయెల్‌ దమనకాండ సాగిస్తున్నది. అలాంటి దేశం ప్రపంచానికి అద్భుతమైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని చెబితే ఎలా నమ్మగలం. తెలుగు రాష్ట్రాలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందిస్తున్న కంపెనీల్లో ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన నెటాఫిమ్‌ కీలకంగా మారింది. ఈ కంపెనీ ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి తొత్తు. కుప్పంలో ఇజ్రాయెల్‌ టెక్నాలజీ ప్రయోగం ఎంతవరకు విజయవంతం అయిందో అందరికీ తెలిసిందే. ఆ టెక్నాలజీ పర్యావరణ హితం కాదని, సుస్థిర వ్యవసాయానికి అనుకూలం కాదని తేలింది. పలు అంతర్జాతీయ సంస్థలు నెటాఫిమ్‌ను నాణ్యత కలిగిన కంపెనీల జాబితా నుంచి తొలగించాయి. అయినా తెలుగు ప్రభుత్వాలు ఇజ్రాయెల్‌ సాంకేతిక పరిజ్ఞానం అంటూ వందల కోట్లు వృధా చేస్తున్నాయి.
పాలస్తీనా రైతులు పడుతున్న కష్టాలకు నెటాఫిమ్‌కు ఎలా సంబంధం వుందంటారు?
గత ఏడు దశాబ్దాలుగా 75 శాతం పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ పాలకులు వారి మాతృభూమి నుంచి తరిమివేశారు. పాలస్తీనీయులకు చెందిన 93 శాతం వ్యవసాయ భూముల్ని లాక్కున్నారు. పాలస్తీనా రైతులు సాగు చేసుకునేందుకు నీరివ్వడం లేదు. బందూకుల పహారా మధ్య రైతులు దైన్యంగా సాగు చేసుకుంటున్నారు. దురాక్రమించిన భూభాగాన్ని విభజిస్తూ ఇజ్రాయెల్‌ భారీగా సరిహద్దు గోడను నిర్మిస్తున్నది. ఈ క్రమంలో పాలస్తీనా రైతులకు ప్రాణాధారమైన లక్షలాది ఆలివ్‌ చెట్లను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నది. దురాక్రమించిన పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ పట్టణాలను, పరిశ్రమలను నిర్మించింది. అలా ఏర్పాటైన పరిశ్రమల్లో ఒకటి నెటాఫిమ్‌. ఈ కంపెనీ ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఏజెంట్‌. లక్షల మంది పాలస్తీనీయుల ఉసురుపోసుకుంటున్న అలాంటి కంపెనీతో తెలుగు ప్రభుత్వాలు చేతులు కలపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.
డ్రిప్‌ ఇరిగేషన్‌ను 1966లో ప్రపంచానికి తనే పరిచయం చేశానని నెటాఫిమ్‌ చెప్పుకుంటున్నది కదా?
అందులో ఏమాత్రం నిజం లేదు. చిన్న రైతులు, పాలస్తీనా ప్రజల కన్నీళ్ల మధ్య ఎదిగిన ఆ కంపెనీ తెలుగు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తానంటే ఎలా నమ్మగలం? డ్రిప్‌ ఇరిగేషన్‌ పరిజ్ఞానంలో తమకు తిరుగులేదని ఆ సంస్థ తెలుగు ప్రభుత్వాలకు నమ్మబలుకుతోంది. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌ సబ్సిడీల రూపంలో 274 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వం సిఫారసు చేస్తున్న 28 కంపెనీల్లో నెటాఫిమ్‌ ఒకటి. కానీ తెలుగు ప్రభుత్వాలకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ఏజెంట్‌ అయిన నెటాఫిమ్‌ ముందు నుంచే వల వేస్తున్నది. నెటాఫిమ్‌ పరికరాల నాణ్యతను అధ్యయనం చే సేందుకు తెలంగాణ ప్రభుత్వం వెయ్యి మంది వ్యవసాయ విస్తరణాధికారులను ఇజ్రాయెల్‌ పంపింది. అందుకోసం కోట్లు ఖర్చు చేసింది. ఆ తరువాత వ్యవసాయ అధికారులు సహజంగానే నెటాఫిమ్‌ పరికరాలను రైతులకు సూచిస్తారు. అలా ఆ సంస్థ తెలుగు రైతుల్ని మోసం చేస్తున్నది.
కుప్పం తరహా ప్రయోగం నిష్ఫలం అంటారా?
1995లో కుప్పంలో ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీతో చేపట్టిన ప్రాజెక్టు వల్ల చిన్న రైతులు ఎంతో నష్టపోయారు. తెలంగాణ ప్రభుత్వం నేటికీ ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ వెంటపడుతూనే వున్నది. 2015లో జీడిమెట్లలో ఇండో – ఇజ్రాయెల్‌ వ్యవసాయ ప్రాజెక్టు చేపట్టారు. 10 ఎకరాల్లో బిందుసేద్యం, పాలీ, నెట్‌ సాగు పద్ధతుల్లో పండ్లు, కూరలు, పూలు ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు. గత ఏడాది ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం 12.4 కోట్లు ఖర్చు చేసింది. ములుగులో ఇదే తరహాలో 11 కోట్లు ఖర్చు చేసి 50 ఎకరాల భూమిని సిద్ధం చేశారు. అందులో ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో పండ్ల తోటల సాగుకు 18 కోట్ల కేటాయించారు. స్థానిక సాగు పద్ధతుల్ని వదిలేసి ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ వెంటపడటం విచారకరం.
తెలుగు ప్రభుత్వాలు, రైతులకు మీరిచ్చే సలహా?
ఇజ్రాయెల్‌ ఆగ్రో టెక్నాలజీ పెద్ద రైతులు, పెద్ద కమతాలను ఉద్దేశించి రూపొందింది. చిన్న రైతులకు అది ఏమాత్రం ఉపయోగపడదని పాలస్తీనా రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. చిన్న రైతులు అధిక సంఖ్యలో వున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడదు. స్థానిక వనరులు, అవసరాలకు అనుగుణమైన టెక్నాలజీని ఉపయోగించుకుంటే వ్యవసాయం లాభసాటి అవుతుంది.
Credits : Andhrajyothi

చిన్నరైతుకు పట్టు సిరులు

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు రైతులు మల్బరీ సాగు, పట్టుగూళ్ల పెంపకంపై దృష్టి సారించారు. ప్రభుత్వ సబ్సిడీలు పట్టుసాగును మరింత ఆకర్షిణీయంగా మార్చాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, పినపాక, కరకగూడెం, అశ్వారావుపేట, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో రైతులు మల్బరీ సాగుపై దృష్టి సారిస్తున్నారు. జిల్లాకు చెందిన 60 మంది రైతులు 145 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తున్నారు. ప్రభుత్వం మల్బరీ సాగుపై ప్రత్యేక శద్ధ చూపడం, రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడంతో మరింతమంది రైతులు పట్టు సాగు దిశగా అడుగులు వేస్తున్నారు.
పట్టు సాగు వల్ల ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుంది. నీటి వసతి తక్కువగా వున్న ప్రాంతాల్లో కూడా, అతి తక్కువ పెట్టుబడితో దీనిని సాగు చేయవచ్చు. చౌడు, నల్లరేగడి భూములు మినహా మిగతా అన్ని రకాల భూముల్లో, అన్ని కాలాల్లో మల్బరీ సాగు చేసుకోవచ్చు. ఏడాది పొడవునా మంచి ఆదా యం పొందే వీలు కూడా వుండటంతో పలువురు రైతులు పట్టు సాగు చేపడుతున్నారు. మల్బరీ సాగు చేసే రైతులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం ద్వారా పట్టు పురుగుల పెంపకం గది(షెడ్డు) నిర్మాణానికి రూ.1.03 లక్షలు అందిస్తోంది.
సాగు ఖర్చుల కోసం మొదటి ఏడాది రూ.50,468, రెండో ఏడాది రూ.44,269 చొప్పున రైతుకు ప్రభుత్వం అందిస్తున్నది. ఎస్సీ, సన్న చిన్న కారు రైతులకు రెండెకరాల మల్బరీ సాగుకు, పట్టు పురుగుల పెంపకానికి రూ.3.49 లక్షలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తోంది. మల్బరీ మొక్కను ఒకసారి నాటితే 15 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు. మల్బరీ తోటను రెండు లేదా మూడు భాగాలుగా సాగు చేస్తే ఏడాదిలో 10-11 పంటలు తీసే వీలుంటుంది. ఆధునిక పద్ధతులలో రేరింగ్‌ గది నిర్మించి తగినన్ని పరికరాలు ఏర్పాటు చేసుకుంటే దిగుబడి పెరిగే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లోని తిరుమలగిరి, జనగామ జిల్లాలోని జనగామలో పట్టుగూళ్లు మార్కెట్లున్నాయి. ఇక్కడ గూళ్ల నాణ్యతను బట్టి ధరలుంటాయి. బీవీ పట్టు గూళ్లపై కిలో రూ.75, సీ, బీ, గూళ్లపై కిలో రూ.40 ప్రభుత్వం ప్రోత్సాహంగా అందజేస్తోంది. ఏడాదికి 20-30 వేలు పెట్టుబడి పెడితే రూ.6 లక్షలు వరకు సంపాదించుకొనేందుకు అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
అధిక లాభాలు
ఎకరంలో మల్బరీ సాగు చేసి పట్టుగూళ్లు పెంచడం వల్ల 45 రోజుల్లోనే రూ. 2.84 లక్షలు ఆదాయం వచ్చింది. గతంలో పత్తి సాగు చేసేవాడిని. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఈ ఏడాది పట్టు సాగు చేశా. వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయం మల్బరీ పంట.
ఎం.ముకుందరెడ్డి, లక్ష్మీపురం రైతు
మల్బరీ సాగు మేలు
సన్న, చిన్నకారు రైతులకు మల్బరీ సాగు ఎంతో లాభదాయకం. పెట్టుబడి తక్కువ. ప్రభుత్వ రాయితీల కారణంగా అధిక లాభాలు కూడా పొందే వీలుంటుంది. పత్తి సాగు చేపట్టి చేతులు కాల్చుకునే కంటే మల్బరీ సాగు చేసి, పట్టు గూళ్లు పెంచకోవడం శ్రేయస్కరం.
Credits : Andhrajyothi

బండ్‌ ఫార్మర్‌కు భలే గిరాకీ

  • జగిత్యాల జిల్లాలో ఆదరణ
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగింది. స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా రైతులు స్వంతంగా ఆలోచన చేసి కొత్త వ్యవసాయ పరికరాలను  రూపొందించుకుంటున్నారు. ఇలాంటిదే బండ్‌ ఫార్మర్‌ (బెడ్‌ మేకర్‌) పరికరం.
బెడ్‌ పద్ధతిలో పంటల సాగు చాలా ఉపయోగకరంగా వుండే ఈ బెడ్‌మేకర్‌ను జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నీటి వృధాను అరికట్టడంతో పాటు కలుపు ఇబ్బందులు ఉండవు. ఎరువులు కూడా నేరుగా మొక్కలకే అందుతాయి. ఈ పద్ధతిలో పసుపు, అల్లం పంటలను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. మిర్చి, టమాట, చెరుకు, పుచ్చకాయ, ఆకుకూరలు, కొత్తిమీర, క్యారెట్‌ పలు రకాల కూరగాయలు కూడా ఈ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. దీని వల్ల మొక్కలకు నేరుగా నీళ్లు తగలవు. మట్టి మాత్రం తడుస్తుంది. వేరుకుళ్లు లాంటి తెగుళ్లతోపాటు చాలా రోగాలు రాకుండా నివారించే వీలుంటుంది.
ఈ బెడ్‌ మేకర్‌ (బండ్‌ ఫార్మర్‌)ను కేవలం రూ.30 వేల నుంచి రూ.35 వేలలో తయారుచేసుకోవచ్చు. మెట్‌పల్లి ప్రాంతంలో రైతులే దీన్ని తయారు
చేసుకుని ఉపయోగిస్తున్నారు. రైతులు బెడ్‌లు వేస్తే అవి సరిగా రావడం లేదు. ఈ బెడ్‌మేకర్‌తో బెడ్‌లు వేస్తే భూమి మొత్తం ఎటు చూసినా ఒకే సైజులో వస్తాయి. ట్రాక్టర్‌ వెనకాల ఒకటి, రెండు బెడ్‌లు వచ్చేలా ఈ బెడ్‌మేకర్‌ను రూపొందించారు. గంటలోనే ఎకరం భూమిలో బెడ్‌లు వేయవచ్చు. ఈ బెడ్‌ మేకర్‌ల కోసం జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి కూడా రైతులు పెద్ద సంఖ్యలో మెట్‌పల్లికి వస్తుంటారు. ఉద్యానశాఖ దీనిపై సబ్సిడీ ఇస్తే ఎంతో ఉపయోగంగా వుంటుందని రైతులు అంటున్నారు.
Credits : Andhrajyothi

అంటుతో మామిడి మధురం

ఏ పండ్ల రకంలో లేనివిధంగా మామిడిలో 70 వేల రకాలు ఉన్నాయి. నాణ్యమైన వంగడానికి మరింత నాణ్యమైన వంగడాన్ని అంటుకట్టడం ద్వారా నిరంతరం మేలైన వంగడాలు జత కావడమే ఇందుకు కారణం. అంటుకట్టే పద్ధతి ద్వారా మంచి రుచి, పరిమాణం వున్న మామిడి రకాలు మనకు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. మామిడి విత్తనాల కొరత వల్ల ఈ తరహా అంటు కట్టే విధానం మొదలైంది. దీంతో మామిడి సాగులో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, సంగారెడ్డి మామిడి పరిశోధనా క్షేత్రాల్లో ప్రాంతాల్లో టెంకలు (విత్తనాలు) తీసుకుని దాన్ని మొక్కలుగా పెంచుతారు. తరువాత వాటికి తొడుగు కింద మనకు కావాల్సిన రకాన్ని అంటు కట్టి మనకు కావాల్సిన రీతిలో షేడ్‌ నెట్‌లో పెంచుతారు. విత్తనం వేసి పెంచే మామిడి చెట్లు ఆరేళ్ల వరకు కాయలు కాయవు. అదే అంటు మామిడి నాలుగేళ్ల లోపే ఫలాలనిస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ చెట్లను పెంచే అవకాశం వుండటం, సగటు దిగుబడి అత్యధికంగా వుండటంతో అంటు మామిడికి ఆదరణ పెరిగింది.
 
బంగినపల్లిలో 40 వేల రకాలు
వెంకట్రామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానంలో చాలా రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అందుల్లో బంగినపల్లిలో 40 వేల రకాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, హిమాయత్‌, ఆల్‌ఫెన్స్‌జో, మల్లిక, కొత్తపల్లి కొబ్బరి, యలమందల, చెరుకు రసం, పునాస, రాయల్‌ స్పెషల్‌ తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. పరిశోధనా స్థానంలో 70 వేల మొక్కలు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మామిడి అంటే సీజనల్‌ ఫ్రూట్‌.. కానీ మామిడిలో కూడా సంవత్సరం పొడవునా ఫలాలనిచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనకు తెలిసిన పునాసతోపాటు రాయల్‌ స్పెషల్‌ కూడా సంవత్సరం అంతా కాపునిస్తుంది. దీంతో మామిడికి సీజన్‌ కూడా అవసరం లేదన్నారు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ వి. రమేష్‌బాబు.
Credits : Andhrajyothi

అకాల వర్షంతో వరికి మెడవిరుపు

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు ఇప్పటికే కోతకు వచ్చిన లేదా గింజ గట్టిపడే దశలో ఉన్న వరిపైరుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో వరి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధనా కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త ఆర్‌. జగదీశ్వర్‌.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరిపంట పడిపోయి, గింజ రాలిపోయింది. ఆలస్యంగా నాటిన రబీ వరిపైరు పూత దశలో ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పుప్పొడి రాలి ఫలదీకరణం చెందలేదు. మరికొన్నిచోట్ల మెడవిరుపు తెగులు, సుడిదోమ, వరి ఈగ వలన పైరుకు కొంత మేర నష్టం వాటిల్లింది. వరిలో ఈ సమస్యలను అధిగమించేందుకు తక్షణం ఈ చర్యలు తీసుకోవాలి.
  •  కోతకు సిద్ధంగా ఉండి పడిపోయిన వరి పొలంలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసెయ్యాలి.
  •  గింజ మొలకెత్తకుండా, రంగు మారకుండా ఉండేందుకు అయిదు శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల ఉప్పును ఒక లీటరు నీటిలో కలిపి) వరి పనలపైన పిచికారీ చేయాలి.
  •  పూత దశ నుండి గింజ గట్టిపడే దశలో ఉండి నేలకొరిగిన పంటను వీలైనంత వరకు నిలబెట్టి జడల మాదిరిగా కట్టాలి.\
  •  ఈ పరిస్థితుల్లో వరి పైరులో వివిధ రకాలైన శిలీంద్రపు బూజు తెగుళ్ళు పెరిగి గింజలు నాణ్యతను కోల్పోతాయి. వీటిని నివారించడానికి ప్రొపికొనజోల్‌ 1.0 మిల్లీలీటరును లీటరు నీటకి కలిపి ఒకసారి పిచికారీ చేయాలి.
  •  ప్రతికూల వాతావరణం దృష్ట్యా ఆలస్యంగా నాటిన వరి పైరుకు మెడవిరుపు తెగులు ఉధృతి ఇంకా పెరుగుతుంది. దీనిని ముందస్తుగా నివారించడానికి కానుగామైసిన్‌ 2.5 మి.లీ. లేదా ఐసోప్రొథయెలేన్‌ 1.5 మి.లీ. లేదా ట్రైసైక్లజోల్‌ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.- ఈ అకాల వర్షాలకు రెల్ల రాల్చు పురుగు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కనుక దీని నివారణకు క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ., డైక్లోరోవాస్‌ ఒక మి.లీ.ను లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి.

Credits : Andhrajyothi

 

పాడి రైతులకు లాభాల ‘పనీర్‌’

పశుపోషణ లాభదాయకమే కానీ పాల ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి విక్రయిస్తే రెట్టింపు లాభాలు వస్తాయని నిరూపిస్తున్నారు జనగాం జిల్లా పాడి రైతులు. సొంతంగా పనీర్‌ తయారుచేసి హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు బచ్చన్నపేట మండలం పోచన్నపేట, ఇటుకాలపల్లి పాడి రైతులు.
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఎత్తయిన ప్రాంతంలో వుండటం, వర్షపాతం తక్కువగా వుండటంతో రైతులకు వర్షాధార పంటలే శరణ్యం. దేవాదుల పథకం వల్ల భూగర్భజలాలు పెరిగాయి. దాంతో తక్కువ నీరు సరిపోయే పాడి పరిశ్రమ వైపు ఈ ప్రాంత రైతులు దృష్టి పెట్టారు. పాలను తక్కువ ధరకు ఎవరికో అమ్ముకునే కంటే పాల ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి, వాటిని విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని ఆలోచించారు బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రాజిరెడ్డి. స్వగ్రామంలో కరవు పరిస్థితుల దృష్ట్యా పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌ వెళ్లి ఓ పనీర్‌ తయారీ కేంద్రంలో సూపర్‌వైజర్‌గా పనిచేశారాయన.
నేనే ఎందుకు పనీర్‌ తయారు చేయకూడదనుకున్నారు. స్వగ్రామం చేరుకుని 50 లీటర్ల పాలు సేకరించి పనీర్‌ తయారుచేయడం ప్రారంభించారు. క్రమంగా వెయ్యి లీటర్ల పాలతో పనీర్‌ తయారుచేసే స్థాయికి ఎదిగారు. రాజిరెడ్డి స్ఫూర్తితో అదే గ్రామానికి చెందిన అనిల్‌, తిరుపతి పనీర్‌ తయారీ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇటుకాలపల్లి గ్రామంలో అన్నదమ్ములు బొడిగం నర్సిరెడ్డి, వెంకట్‌రెడ్డి ఎనిమిదేళ్లుగా పనీర్‌ తయారుచేస్తూ హైదరాబాద్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. డెయిరీలు రైతులకు చెల్లిస్తున్న పాల ధరకన్నా రూ.2 చొప్పున అదనంగా చెల్లిస్తుండడంతో రైతులు వారికే పాలు పోయడానికి ఉత్సాహం చూపుతున్నారు.
పనీర్‌ తయారీ ఇలా.. 
రైతుల వద్ద నుంచి సేకరించిన పాలను 50 లీటర్ల చొప్పున గిన్నెల్లో పోసి కట్టెల పొయ్యి మీద 85 డిగ్రీల సెల్సియస్‌ వరకు కాగేలా మరుగబెడతారు. అనంతరం ప్లాస్టిక్‌ డబ్బాలో పోస్తారు. ఇందులో 100 ఎం.ఎల్‌ వెనిగర్‌ను కలిపి కలియబెడతారు. దీంతో జున్నుగడ్డలా పనీర్‌ మిశ్రమం తయారవుతుంది. పనీర్‌ గడ్డను బట్టలో మూటగట్టి బరువు పెడతారు. రెండు నుంచి మూడు గంటలు అలా ఉంచి ప్లాస్టిక్‌ సంచుల్లో వేసి అమ్మకానికి హైదరాబాద్‌కు తరలిస్తారు. సాధారణ వెన్న శాతం కలిగిన ఆరు లీటర్ల ఆవుపాలకు కిలో పనీర్‌ వస్తుంది. మార్కెట్‌లో హోల్‌సేల్‌గా కిలోకు రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. రిటైలర్లు 200 గ్రాముల నుంచి 5 కిలోల వరకు ఆకర్షణీయమైన కవర్లలో ప్యాక్‌ చేసి మూడు రెట్ల అధిక ధరకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారని వారు తెలిపారు. దళారీల బెడదతో కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదంటున్నారు పనీర్‌ తయారీదారులు. పైగా ఇటీవల మహారాష్ట్రలోని బీదర్‌, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి సోయాపాలతో తయారుచేసిన పనీర్‌ మార్కెట్లోకి వస్తున్నది. దాన్నీ పాలతో తయారుచేసిన పన్నీరుగా చెబుతూ తక్కువ రేటుకు అమ్మడంతో ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామన్నారు పనీర్‌ తయారీదారులు.
నా బాటలో పలువురు
పనీర్‌ తయారు చేస్తానంటే మొదట అంతా ఆశ్చర్యపోయారు. పాలు కూడా పోయలేదు. నేనే డెయిరీ ప్రారంభించాను. క్రమంగా అందరూ పాలు పోయ సాగారు. పనీర్‌ తయారీతో పాడి రైతుతో పాటు పదిమందికీ ఉపాథి కలుగుతున్నది. ఎంతోమంది ఈ విధానాన్ని తెలుసుకుని పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటున్నారు.
 దండ్యాల రాజిరెడ్డి
Credits : Andhrajyothi