ఆకుకూరల పల్లెలు!

  • చిత్తూరు సరిహద్దు మండలాల రైతులకు నిత్యం ఆదాయం
  • మామిడిలో అంతర పంటగా సాగు
ఈ కాలంలో నిత్యం ఆకుకూరలు తినే అలవాటు పెరగడంతో వాటికి గిరాకీ పెరిగింది. దాన్ని గుర్తించిన చిత్తూరు నగరానికి చుట్టుపక్కల వుండే మండలాల రైతులు ఆకుకూరల సాగుకు ప్రాధాన్యతనిస్తూ నిత్యం ఆదాయం పొందుతున్నారు.
చిత్తూరు నగరానికి సరిహద్దుల్లో వుండే చిత్తూరు రూరల్‌, యాదమరి, గుడిపాల, గంగాధర నెల్లూరు, పెనుమూరు, తవణంపల్లె, పూతలపట్టు, ఐరాల మండలాలకు చెందిన రైతులు ఆకుకూరల సాగును నమ్ముకుని లాభాలు పొందుతున్నారు. ఈ మండలాల్లోని 15కు పైగా గ్రామాల రైతులంతా రెండు నుంచి మూడెకరాల విస్తీర్ణంలో ఆకు కూరలను సాగు చేస్తున్నారు.
సాగుచేస్తున్న ఆకుకూరల్లో సిర్రాకు (సిరికూరాకు) ఎక్కువగా వుంది. దీంతోపాటు పాలకూర, చుక్కాకు, మెంతాకు, దంటుకూరాకు, పుదిన కూడా విస్తృతంగా సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు. చిత్తూరు నగరంలో 1.90 లక్షల కుటుంబాలున్నాయి. వీటిలో దాదాపు 25 శాతం కుటుంబాల వారు నిత్యం ఏదో ఒక పూట విధిగా ఆకుకూరను ఆహారంలో తీసుకుంటారు. చిత్తూరు నగరవాసులు రోజుకు 4,500 నుంచి 5 వేల ఆకుకూరల కట్టలను కొనుగోలు చేస్తున్నట్లు అంచనా.
ఆకుకూర కట్ట డిమాండును బట్టి రూ.5 నుంచి రూ.10 వరకు ధర పలుకుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో సిరికూరాకు కట్ట రూ.3 నుంచి రూ.4 వరకు పలుకుతోంది. దీన్నిబట్టి చూస్తే రోజుకు చిత్తూరు నగరంలో రూ.15 వేల నుంచి రూ.20 వేల వ్యాపారం జరుగుతోంది. వీధుల్లో తిరుగుతూ అమ్మేవాళ్లు రోజు సాయంత్రం పొలాలకెళ్ళి ఆకుకూరలను సేకరించి కట్టలు కట్టి ఇళ్ళకు తెచ్చుకుంటారు. బస్సు సౌకర్యం వుంటే బస్సుల్లో, లేకుంటే ఆటోలు, అవీ లేకుంటే స్కూటర్ల ద్వారా తెల్లవారుజామునే నగరానికి చేరుకుని అమ్మకాలను చేపడతారు.
తెచ్చిన ఆకుకూరలను తెల్లారేసరికల్లా అమ్మేసి తిరిగి గ్రామాలకు చేరుకుని యథావిధిగా పొలం పనులకు వెళ్ళడం చిత్తూరు సరిహద్దుల్లో వుండే గ్రామాల రైతుల నిత్యకృత్యం. చిత్తూరు జిల్లాలో మామిడి సాగు ఏటికేడు విపరీతంగా పెరుగుతోంది. దానికి తోడు కొత్తగా మామిడిమొక్కలను నాటిన పొలాల్లో ఐదారేళ్ళ వరకు అంతరపంటగా ఆకుకూరలు, కూరగాయలతో పాటు పశువులకు అవసరమైన పశుగ్రాసం సాగు చేసుకోవచ్చు. ఆకుకూరల సాగులో ఆదాయాన్ని రుచిచూసిన రైతులంతా తమ మామిడి తోటల్లో అంతరపంటగా ఆకుకూరల సాగుకే అధిక ప్రాధాన్యతనిస్తూ నిత్యం ఆదాయం ఆర్జిస్తున్నారు.
మా ఊరంతా ఇదే సాగు
మా ఊరులో వుండే రైతులంతా ఆకుకూరల సాగును చేస్తావున్నాం. దీంతో రోజూ చేతికి డబ్బు వస్తాది. ఇంటి ఖర్చులకు ఇబ్బంది వుండదు. మామిడి తోటలో అంతరపంటగా సాగు చేయడం వల్ల పని కూడా తక్కువ. ఉండేదాంట్లోనే కొంత కూరాకు విత్తనాలను చల్లేస్తాం. ఖర్చు కూడా పెద్దగా వుండదు.
– చిన్నస్వామి, కొత్తగొల్లపల్లె
ఇప్పుడు రేటయితే లేదు
ఆకుకూరలకు రేటుంటేనే లాభం. ఒక్కోసారి కూరాకు కట్ట రూపాయి కూడా పలకదు. అదే కట్ట ఒకప్పుడు రూ. 10 కూడా పలుకుతుంది. ఆటో ఖర్చు రూ. 150 అవుతుంది. దీంతో కొంత బొప్పాయి సాగు చేయాలనుకున్నాం. అయితే ఎప్పటినుంచో సాగు చేస్తున్నాం కాబట్టి కూరాకును వదలాలంటే మనసురావడం లేదు.
– జ్యోతి, నల్లిశెట్టిపల్లె, తవణంపల్లె మండలం
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *