ఆలూ సాగు భళా!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతం ఆలుగడ్డల సాగుకు పెట్టింది పేరు. ఆలుగడ్డలే కాదు అల్లం, వె ల్లుల్లి, అరటి, వాము తదితర వెరైటీ పంటలకు కూడా ఈ ప్రాంతం కేరాఫ్‌ అడ్ర్‌సగా మారింది. వాణిజ్య పంటలను నీటి తడుల కింద సాగు చేయడం ఈ ప్రాంత రైతుల ప్రత్యేకత.
 
70 రోజుల్లో రూ.50 వేలు లాభం
అతి తక్కువ సమయంలో చేతికి వచ్చే ఆలుగడ్డలను జహీరాబాద్‌ ప్రాంత రైతులు తమ పొలంలోని కొంత భాగంలో తప్పనిసరిగా సాగు చేస్తారు. దశాబ్దాలుగా జిల్లాలోని కోహీర్‌, జహీరాబాద్‌ మండలాల్లో బంగాళదుంప సాగు కొనసాగుతున్నది. ఇటీవల కాలంలో జహీరాబాద్‌ డివిజన్‌లోని ఝరాసంగం, న్యాల్‌కల్‌, రాయికోడ్‌ మండలాల్లో ఆలుగడ్డ విస్తరించింది. చలికాలంలో వేసే ఆలుగడ్డల పంట 70 రోజుల్లో చేతికి అందుతుంది. నీటి అవసరం కూడా తక్కువ కావడంతో రైతులు ఆలుగడ్డల సాగుపై మక్కువ చూపుతున్నారు. ఈ పంటకు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెంటీగ్రేడ్లు నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్యలో వుండాలి. అందుకోసం ఈ పంటను శీతాకాలంలో సాగు చేస్తారు. వాతావరణం సహకరించి, మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తే ఆలుగడ్డల సాగు లాభాలు తెచ్చిపెడుతుందంటున్నారు రైతులు. ఈ ప్రాంతంలో గిడ్డంగి సదుపాయం లేకపోవడంతో పంట నిల్వ చేసుకోవడానికి వీలులేకుండా పోతున్నది. దీంతో పంటను ఏదో ఒక ధరకు తెగనమ్ముకోవాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో రైతులు ఆలు పంటను సాగుచేయడానికి అవసరమయ్యే విత్తనాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతం నుండి ఎక్కువగా తీసుకు వస్తారు. గతేడాది జహీరాబాద్‌ డివిజన్‌లో ఐదువేల ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది రెండువేల పైచిలుకు ఎకరాల్లో మాత్రమే సాగుచేశారు. అందులో భాగంగా జహీరాబాద్‌, మొగుడంపల్లి మండలాల్లో 1100 ఎకరాల్లో, కోహీర్‌ మండలంలో 500 ఎకరాలు, న్యాల్‌కల్‌లో 280 ఎకరాలు, ఝరాసంగం మండలంలో 280 ఎకరాల చొప్పున ఆలుగడ్డలు సాగు చేశారు. గతేడాది గిట్టుబాటు ధర సరిగా లేకపోవడం సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. ఆలుగడ్డల సాగుకు ఎకరాకు సుమారు రూ. 50 వేల రూపాయల ఖర్చవుతుంది. ఎకరాకు 100 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుంది. ప్రస్తుతం 600-800 మధ్యలో ధర వుంది. మార్కెట్‌లో మంచి ధర పలికితే ఎకరాకు లక్ష ఆదాయం వస్తుంది. ఖర్చులు పోను నికరంగా 50 వేల ఆదాయం లభిస్తుందంటున్నారు ఆలుగడ్డల రైతులు.
 
శీతల గిడ్డంగులతో మేలు
పదిహేనేళ్లుగా ఆలుగడ్డలు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది 22 ఎకరాల్లో పంట వేశాను. ఒక ఏడాది నష్టం వచ్చినా మరోసారి లాభం వస్తుందనే ఆశతో బంగాళదుంప సాగు చేస్తున్నాం. అధికారుల సలహాలు, సూచనలు పాటించి పంట చీడపీడలు, తెగుళ్లబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. శీతల గిడ్డంగుల సౌకర్యం వుంటే మరింత మంది ఈ పంట సాగు చేస్తారు.
– రవూఫ్‌, ఆలుగడ్డ
రైతు, కవేలి
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *