ఇక వేసవిలోనూ టమాటా

  • 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌లోనూ పండే వంగడం సిద్ధం
  • అభివృద్ధి చేసిన ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు
పటాన్‌చెరు, జనవరి 18: టమాటాలను ఇక వేసవిలోనూ పండించవచ్చు. 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలోనూ పండించ గలిగే టమాటా వంగడాన్ని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచ కూరగాయల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రంలో టమాటాలో మెరుగైన వంగడాలను అభివృద్ధి చేశారు. ఇక్రిశాట్‌లో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల శాస్త్రవేత్తలు, ప్రముఖ విత్తన కంపెనీల ప్రతినిధులు టమాటా వంగడాలను పరిశీలించారు. వర్షాకాలం, చలికాలంలోనే పండే టమాటా వేసవి కాలంలో కొండెక్కి కూర్చుంటోంది. మిగిలిన రోజుల్లో రూ.5కు లభించే కిలో టమాటా వేసవిలో రూ.100కు చేరుతోంది. ఆలుగడ్డ, ఉల్లి తర్వాత కూరల్లో తప్పనిసరి వేయాల్సి రావడంతో ప్రజలు ఎక్కువ ధరకూ కొనాల్సి వస్తోంది. దీంతో ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు టమాటా వంగడాలపై ఐదేళ్లుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. కూరగాయల పరిశోధనా కేంద్రం రీజినల్‌ డైరెక్టర్‌ వార్విక్‌ ఎస్‌డౌన్‌ మాట్లాడుతూ.. వాతావరణ, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసిన 3 రకాల టమాటా వంగడాలను రైతుల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అధిక ఊష్ణోగ్రతలను తట్టుకుని 45 డిగ్రీల సెల్సియన్‌లోనూ అధిక దిగుబడులు ఇచ్చే ఏవీటీఓ-1424 రకాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఇక టమాటా పంటను తరచూ పీడిస్తున్న ఆకులకు వచ్చే పసుపు పచ్చ తెగులు, ఇతర వైరస్‌ తెగుల్లు, నల్లమచ్చలను తట్టుకునే ఏవీటీఓ-1609, ఏవీటీఓ-1617 రకాలను అభివృద్ధి చేశామన్నారు. ఇవి పరిశీలన దశలోనే ఉన్నాయని, రైతుల పొలాలకు చేరేందుకు మరింత సమయం పడుతుందన్నారు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *