ఏజెన్సీకి రబ్బరు మెరుపులు!

  • మారేడుమిల్లిలో 90 హెక్టార్లలో సాగు
  • 40 ఏళ్ల తరువాత రబ్బరు కలప రెడీ
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రబ్బరు తోటల సాగు గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. మారేడుమిల్లి మండలం దేవరాపల్లి, పూజారి పాకలు గ్రామాల్లో 90 హెక్టార్లలో రబ్బరు సాగవుతున్నది. మార్కెట్‌లో మంచి ధర వస్తే రబ్బరు సాగు మరింత లాభదాయకం అంటున్నారు రైతులు.
మారేడుమిల్లి మండలంలోని దేవరాపల్లి గ్రామంలో కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో 1994-99 మధ్యలో 50 హెక్టార్లలో రబ్బరు తోటల సాగు మొదలైంది. ఒకేచోట రబ్బరు తోటల సముదాయం పథకం కింద 35 మంది గిరిజన రైతులతో రబ్బర్‌ గ్రోయర్స్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఏర్పాటుచేసి 50 హెక్టార్లలో రబ్బరు మొక్కల పెంపకం ప్రారంభించారు. 1998లో పూజారిపాకలలో మరో 40 హెక్టార్లలో 32 మంది రైతులు రబ్బరు సాగు చేపట్టారు. ఈ మొక్కలు వేసిన 10వ ఏడాది నుంచి 40 ఏళ్ల వరకు మాత్రమే పాలు వస్తాయి. మొదట్లో రబ్బరు రైతులకు ఆదాయం వుండదు కాబట్టి పని చేసిన రోజున, రోజుకు రూ.40 వంతున గౌరవ వేతనం చెల్లించారు.
2008 నుంచి చెట్లకు పాలు రావడం మొదలైంది. ఈ చెట్లు ఏపుగా పెరగడానికి యూరియా, పొటాషియం ఎరువుగా వేశారు. హెక్టారుకు సుమారు 490 చెట్ల వరకు ఉంటాయి. చెట్టు మొదటి భాగంలో పెచ్చులు ఊడేటట్టు కత్తితో కోస్తారు. అక్కడ నుంచి చిన్న దారి కింద వరకు గీస్తారు. అక్కడ ఒక కప్పును కడతారు. ఈ పాలు నెమ్మదిగా కారుతూ వచ్చి ఈ కప్పులో పడతాయి. వీటిని రెండు రోజులకు ఒకసారి తెల్లవారుఝామున మూడు నుంచి 7 గంటల వరకు సేకరిస్తారు. ఈ చెట్లకు ఆగస్టు నుంచి జనవరి వరకు మాత్రమే పాలు వస్తాయి. ఒక్కో చెట్టు నుంచి రోజుకు లీటరు నుంచి లీటరున్నర వరకు పాలు వస్తాయి.
ఈ ప్రాంతంలో రబ్బరు తోటలను ఐటీడీఏ 1968లోనే ఆరు వేల హెక్టార్లలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. మార్కెట్‌ చేయలేకనో, పర్యవేక్షణ లోపమో కానీ కాలక్రమంలో ఆ తోటలను గాలికి వదిలేసింది. ప్రస్తుతం సుమారు 600 హెక్టార్లలో మాత్రమే చెట్లు మిగిలి ఉన్నాయి. వీటి లావు 100 సెంటీమీటర్లు అయ్యింది. వీటిని ప్రస్తుతం కలపగా ఉపయోగించుకోవచ్చు. రబ్బరు చెట్టు 40 ఏళ్ల తరువాత కలపగా బాగా ఉపయోగపడుతుంది. అయితే రబ్బరు కలపను ప్రొసెసింగ్‌ చేసే రబ్బరు ఉడ్‌ ఫ్యాక్టరీ కేరళలో మాత్రమే వుంది. మన దగ్గర ఆ అవకాశం లేకపోవడంతో రెండు వేల మంది రైతులు ఈ పంట నుంచి ఏ ఫలితం రాక వాటిని వదిలేశారు. ఐటీడీఏ చొరవ తీసుకుంటే పెరిగిన చెట్ల నుంచి వేలాది మంది రైతులకు ఆదాయం వస్తుంది.
రబ్బరుకు గతంలో కేజీకి రూ. 234 ధర వుండేది. ఇప్పుడు 126కు పడిపోయింది. వియత్నాం, మలేషియా, థాయిలాండ్‌ నుంచి దిగుమతులు పెరగడం ధరల పతనానికి కారణం. మన దేశంలో కేరళలో రబ్బరు అధికంగా సాగవుతుంది. వర్షపాతం ఎక్కువగా వుండి, ఉష్ణోగ్రతలు తక్కువగా వుండటం కేరళ ప్రత్యేకత. తూర్పు ఏజెన్సీలో తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు కూడా రబ్బరు రైతులకు ప్రతికూలంగా మారాయన్నారు రబ్బర్‌ బోర్డు ఫీల్డ్‌ ఆఫీసర్‌ జగన్మోహన్‌రెడ్డి.
రబ్బరు తయారీ ఇలా..
రబ్బరు చెట్ల నుంచి సేకరించిన పాలను ప్రొసెసింగ్‌ యూనిట్లకు తీసుకువస్తారు. అక్కడ రెండు లీటర్లు నీళ్ళు, రెండు లీటర్లు పాలు కలిపి ఒక ట్రేలో వేస్తారు. అంతకుముందే 5 లీటర్ల నీళ్ళలో 50 మిల్లీలీటర్ల ఫార్మిక్‌ యాసిడ్‌ను కలిపి ఒక ట్రేలో ఉంచుతారు. అందులో 200 నుంచి 250 మిల్లీలీటర్ల ఫార్మిక్‌ యాసిడ్‌ కలిపిన నీళ్ళను పాలలో కలుపుతారు. ఒక రోజంతా ఆ ట్రేలోనే ఉంచుతారు. తెల్లవారేసరికి పెరుగులా తోడుకుంటుంది. ఒక తెల్లటి షీట్‌ వస్తుంది. దాన్ని మిషన్‌లో రోలింగ్‌ చేస్తారు. తరువాత ఒకరోజు ఆరబెడతారు. ఆ షీట్‌ను నాలుగు రోజుల పాటు స్మోక్‌ హౌస్‌లో పెడతారు. తరువాత అది తేనె కలర్‌లోకి మారుతుంది. షీట్‌ను వేరు చేసి మార్కెట్‌కు తరలిస్తారు. దాన్ని ఫ్యాక్టరీ వారు కొనుక్కొని రబ్బరు వస్తువులు తయారు చేస్తారు. దీన్ని సియట్‌, ఎంఆర్‌ఎఫ్‌ వంటి కంపెనీలు కొనుగోలు చేస్తాయి.
లాభదాయకమే
రబ్బరు సాగు లాభదాయకంగా ఉంది. రోజూ ఆరు నుంచి ఏడు గంటలు పనిచేస్తాం. ఎవరికి వారే రబ్బరు పాలు సేకరించి, షీట్లు తయారు చేసుకుంటున్నాం. ఈ మధ్యనే ఆరు టన్నుల రబ్బరు షీట్లు అమ్మాం. మంచి ధర వుంటే మరిన్ని లాభాలు వచ్చేవి.
– చిన్నారెడ్డి, లక్ష్మి, రైతులు, దేవరాపల్లి
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, రాజమహేంద్రవరం
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *