కలుపు కష్టాలకు చెల్లు

పత్తి చేలలో, కూరగాయల సాగులో కలుపు తీయడానికి కూలీల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి, వారికి ఉపయోగపడే యంత్రం రూపొందించాలని ఆలోచించాడు ఓ యువకుడు. కలుపు తీయడంతో పాటు గొర్రుగా కూడా ఉపయోగించుకునే యంత్రాన్ని రూపొందించాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగపూర్‌ గ్రామానికి చెందిన కొడుముంజ ప్రవీణ్‌కుమార్‌ అనే యువకుడు రైతులకు ఉపయోగపడే కొత్త యంత్రాలు ఆవిష్కరిస్తున్నాడు. ఏడో తరగతి వరకే చదువుకున్న ప్రవీణ్‌… మోటర్‌ వైండింగ్‌లో ఏడాది పాటు శిక్షణ పొందాడు. గ్రామంలో వ్యవసాయ విద్యుత్తు మోటర్ల మరమ్మతులు చేస్తుండేవాడు. జిల్లెల్ల గ్రామంలో షాప్‌ ఏర్పాటుచేసుకుని వైండింగ్‌తో పాటు లేత్‌ మిషన్‌, వెల్డింగ్‌ పనులు చేయడం మొదలుపెట్టాడు. మొదట సైకిల్‌తో కలుపు తీసే పరికరం రూపొందించాడు. ఆ తరువాత తక్కువ శ్రమతో సునాయాసంగా కలుపుతీసే లక్ష్యంతో సుజికి ఇంజన్‌తో కలుపుతీసే యంత్రాన్ని తయారుచేశాడు. దాని ఇంజన్‌ స్పీడ్‌ ఎక్కువగా వుండటంతో అది సరిగా పనిచేయలేదు. దాంతో ఈసారి స్కూటర్‌ ఇంజన్‌తో ప్రయోగం చేసి విజయం సాధించాడు ప్రవీణ్‌. ఇంజిన్‌లో రెండు లీటర్ల పెట్రోలు పోస్తే ఎకరంలో కలుపు తీస్తుంది.
ఈ యంత్రంతో కూలీల సమస్య తీరడంతో పాటు డబ్బు, సమయం కూడా ఆదా అవుతుంది. ఓ రైతు సహకారంతో 15 వేలు ఖర్చు చేసి కలుపు యంత్రాన్ని సిద్ధం చేశాడు ప్రవీణ్‌. ముందుగా స్టాండ్‌ తయారుచేసి దానికి ఇంజన్‌తో పాటు బేరింగ్‌లు, చైనులు బిగించాడు. అనంతరం స్కూటర్‌ లేక ఆటోకు చెందిన పాత హ్యాండిల్‌ను బిగించి గేరు, బ్రేక్‌ అక్కడే ఏర్పాటుచేశాడు. కేవలం కలుపు తీయడం కాకుండా బహుళ ప్రయోజనకరంగా ఈ యంత్రాన్ని తీర్చిదిద్దాడు. కలుపు తీయడంతో గొర్రుగా కూడా ఈ యంత్రాన్ని ఉపయోగించవచ్చంటాడు ప్రవీణ్‌.
 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, తంగళ్లపల్లి,
 
చేయూతతో అద్భుతాలు
ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగ సంస్థలు సహకరిస్తే రైతులకు ఉపయోగపడే యంత్రాలు తయారు చేయగలననే నమ్మకం వుంది. తక్కువ ఖర్చుతో కొత్త యంత్రాలు తయారుచేసే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నాను. రైతులకు ఈ రకంగా సేవచేయడం సంతోషంగా వుంది.
 కొడుముంజ ప్రవీణ్‌,
చిన్నలింగపూర్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *