గుర్రపు డెక్కతో కంపోస్టు ఎరువు

  •  జీహెచ్‌ఎంసీ, ఐఐసీటీ సహకారం
  •  ముందుకొచ్చిన ఖార్‌ ఎనర్జీ ఆప్థమైజర్‌ సంస్థ
  •  కాప్రా చెరువులో పైలెట్‌ ప్రాజెక్టు
  • వాణిజ్య సముదాయాల్లో కంపోస్ట్‌ యూనిట్ల ఏర్పాటు తప్పనిసిరి
 
గుర్రపు డెక్కతో కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. దీనికి కాప్రా చెరువును పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. జీహెచ్‌ఎంసీ, ఐఐసీటీ సహకారంతో ఓ సంస్థ ఈ పైలెట్‌ ప్రాజెక్టును చేపట్టింది. ఇది విజయవంతమైతే రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన ఎరువు లభించనుంది.
\
 హైదరాబాద్‌: కాప్రా చెరువు మొదట్లో 164 ఎకరాలలో విస్తరించి ఉండేది. ఆక్రమణలతో అది 113 ఎకరాలకు తగ్గింది. ఇందులోని 80 ఎకరాలలో మొత్తం గుర్రపు డెక్క పెరిగింది. ఈ గుర్రపు డెక్క సుమారు 16 వేల టన్నుల వరకు ఉంటుందని అంచనా. కాగా చెరువులలో గుర్రపు డెక్క సాధారణ స్థాయిలో ఉండటం మంచిదే. అదే ఎక్కువ శాతం పెరిగితే అన్నీ అనర్థాలే. చెరువును ఆక్రమించే గుర్రపు డెక్క నీటిలోని కాలుష్యకారకమై న పదార్థాలను, హానికరమైన రసాయనాలను స్వీకరిస్తాయి. నీటి లోపల ఉండే ఆక్సిజన్‌ను సై తం గుర్రపు డెక్క గ్రహిస్తుంది. కాలుష్య రసాయనాలు, వేర్ల స్థాయిలోనే ఉంటాయి. మొక్క కాండ ఆకుల్లో ఆర్గానిక్‌ పదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల దీని నుంచి తయారయ్యే కంపోస్టు ఎరువు హానికర రసాయనాలు లేకుండా ఉంటుంది. కాగా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసిటీ) సీనియర్‌ ప్రిన్సిపాల్‌ సైంటిస్ట్‌ గంగాగ్నిరావు గుర్రపు డెక్కతో కంపోస్టు ఎరువు తయారీ విజయవంతమైన ప్రక్రియ అని, ఇది మంచి నాణ్యతతో కూడిన ఎరువు అని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఖార్‌ ఎనర్జీ ఆప్థమైజర్‌ సంస్థ గుర్రపు డెక్కతో కంపోస్టు ఎరువును తయారు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకు కాప్రా చెరువును ఎంచుకుని గుర్రపు డెక్కతో ఇక్కడే ఎరువు తయారీకి శ్రీకారం చుట్టింది.
 
ఆరు దశలలో తయారీ…
గుర్రపు డెక్కతో ఆరు దశలలో కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నారు.
  •  మొదటి దశలో చెరువు నుంచి గుర్రపు డెక్కను తొలగించి ఒడ్డుకు చేరుస్తారు.
  •  రెండో దశలో ఒడ్డుకు చేర్చిన గుర్రపు డెక్క వేర్ల భాగాన్ని, కాండాన్ని వేరు చేస్తారు.
  •  మూడో దశలో వేరు చేసిన కాండం, ఆకులను రెండు రోజుల పాటు ఆరబెట్టి నిలువ ఉంచుతారు.
  •  నాలుగో దశలో నిలువ ఉంచిన కాండం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేస్తారు.
  •  అయిదో దశలో కట్‌ చేసిన ముక్కల మొత్తాన్ని విభాగాలుగా ఏర్పాటు చేసిన గదుల్లో వేస్తారు. దానిపై ప్లాస్టిక్‌ షీట్‌ను కప్పి 25 రోజుల వరకు నిలువ ఉంచుతారు.
  •  ఆరో దశలో 25 రోజుల తర్వాత అది కం పోస్టు ఎరువుగా తయారవుతుంది. దీన్ని రెండు విధాలుగా ఉపయోగిస్తారు. గుర్రపు డెక్క కాండం, ఆకుల నుంచి వచ్చే ఎరువును అన్ని రకాల పంటలకూ వాడుకోవచ్చు. వేర్ల నుంచి వచ్చిన ఎరువు మాత్రం పూల మొక్కలకు ఉపయోగపడుతుంది.
లాభాపేక్ష లేకుండా తయారీ
సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉం చుకుని లాభాపేక్ష లేకుండా గుర్రపు డెక్కతో ఎరువును తయారు చేస్తు న్నాం. కాప్రా చెరువు వద్ద ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించడానికి నాలుగు నుంచి ఐదు నెలలు పడుతుంది. ఈ ప్రక్రియ మొత్తానికి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇదంతా మా సంస్థే భరిస్తుంది. ఈ ఎరువును రైతులకు తక్కువ ధరలో విక్రయిస్తాం.
– కెఎల్‌ఎన్‌. రాజు, ఖార్‌ ఎనర్జీ ఆప్థమైజర్‌ సీఈవో
అభినందనీయం
గుర్రపు డెక్కతో ఎరువును తయారు చేయడం అభినందనీయం. ఇందుకు కాప్రా చెరువును పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంచుకోవడం సంతోషకరం. చెరువులో గుర్రపు డెక్క సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాం. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర చెరువులలో కూడా గుర్రపు డెక్క సమస్య తొలగిపోనుంది. ఎరువు తయారు చేస్తున్న ఖార్‌ ఎనర్జీ ఆఫ్థమైజర్‌ సంస్థకు జీహెచ్‌ఎంసీ నుంచి పూర్తి సహకారం అందిస్తాం.
– ఎస్‌.పంకజ, డీసీ, కాప్రా
సేంద్రీయ ఎరువుగా చెత్త
 హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్లలో వెలువడే చెత్తను ఆయా ప్రాంగణాల్లోనే సేంద్రీయ ఎరువుగా మార్చాలి. నిత్యం 50 కిలోల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి అయ్యే హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్లలో కంపోస్ట్‌ యూనిట్ల ఏర్పాటును జీహెచ్‌ఎంసీ తప్పనిసరి చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కంపోస్ట్‌ యూనిట్‌ ఏర్పాటు చేయకుంటే ఆయా సంస్థల యజమానులకు.. చెత్త సేకరిస్తే కార్మికులు, సంబంధిత అధికారులకు జరిమానా విధించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సమగ్ర వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2017, స్వచ్ఛ భారత్‌ మార్గదర్శకాల ప్రకారం 50 కిలోల కంటే ఎక్కువ చెత్త రోజూ వెలువడితే నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలదే. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో కంపోస్ట్‌ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదన గతంలోనే తెరపైకి రాగా.. ఆశించిన స్పందన రాకపోవడంతో ఇక తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. వీటి ఏర్పాటుకు ఎక్కువ స్థలం అవసరం లేదని, 40 చదరపు అడుగుల నుంచి 200 చ.అ.ల విస్తీర్ణంలో యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులను గార్డెనింగ్‌, మొక్కల పెంపకానికి వినియోగించే అవకాశం ఉంటుంది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *