గోఆధారిత సేద్యమే రక్ష

సహజ వనరులతో సేద్యం చేయడం ఒక్కటే రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాలకు పరిష్కారం అంటున్నారు ప్రకృతి సేద్యం ఉద్యమకారుడు పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌. జనవరి 8 వరకు ప్రకృతి సేద్యంపై పాలేకర్‌ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుంటూరు నాగార్జునా విశ్వవిద్యాలయం సమీపంలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నది. ఈ సదస్సులో పాల్గొన్న రైతులను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది.
 
హరిత విప్లవం పేరుతో మనం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు సరికావని స్పష్టం అవుతున్నది. దేశవ్యాప్తంగా పత్తి రైతుకు అపారనష్టం కలిగించిన గులాబీ పురుగును అరికట్టడంలో శాస్త్రవేత్తలు ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు గో ఆధారిత సేద్యం ఉద్యమకారుడు పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌. రైతులతో పాటు విచ్చలవిడిగా సాగుతున్న రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. గో ఆధారిత సేద్యమే ఈ సమస్యకు పరిష్కారం. ఒక ఆవుతో రైతు 20-25 ఎకరాలు సాగు చేయవచ్చు. అందువల్ల రైతులంతా ఆవులు కొనాలి. గత ఏడాది అప్పుల బారిన పడిన వేలాదిమంది రైతులు ఆత్మాభిమానంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విధ్వంసం ఆగాలంటే ఖర్చులేని ప్రకృతి వ్యవసాయమే శరణ్యమన్నారు పాలేకర్‌.
పెట్టుబడిలేని సేద్యం మేలు
20 ఎకరాల బత్తాయి తోట సాగు చేస్తున్నాను. కేవలం ప్రకృతి ఎరువులు ఉపయోగిస్తున్నాను. నాణ్యమైన ఉత్పత్తులతో పాటు ఖర్చులు గణనీయంగా తగ్గించుకోగలిగాను. పెట్టుబడి లేని గో ఆధారిత సేద్యంలో ఎటువంటి ఎరువులూ వాడవలసిన అవసరం లేదు.
– ఈదా మాధవరెడ్డి, కాజ, గుంటూరు జిల్లా.
పశువు లేనిదే సేద్యం లేదు
పశువు లేనిదే సేద్యం లేదు ఒక గ్రాము ఆవు పేడ భూమిలో కలిస్తే 300 నుంచి 500 బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విషయం తెలియక లక్షల రూపాయలు ఎరువులు, పురుగుల మందులకు ఖర్చు చేసి అప్పులు మిగుల్చుకున్నాను. ఆరేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నాను. ఎకరాకు రూ.9 వేల పెట్టుబడితో రూ.90 వేల ఆదాయం వస్తున్నది. పండిన ధాన్యాలను నేనే నేరుగా వినియోగదారుడికి అమ్ముతున్నాను. ఆవు పాలు అమ్మడంతోపాటు కోడెదూడలను అమ్ముతున్నాను.
– మేకా రాధాకృష్ణమూర్తి, మంత్రిపాలెం
రైతులకు ఆవుల్ని ఇవ్వాలి
రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ప్రయోజనం కోసం సబ్సిడీపై ఎరువులు, యంత్ర పరికరాలను ప్రభుత్వం అందజేస్తున్నది. అదేవిధంగా పెట్టుబడి లేని వ్యవసాయానికి మూలాధారమైన ఆవును ఉచితంగా రైతుకు అందజేయాలి.
– రవీంద్రరెడ్డి వనపర్తి, తెలంగాణ
అరెకరంలో ఆరు పంటలు
నాకున్న అరెకరంలో మిశ్రమ పంటలు పండిస్తూ ఆధిక ఆదాయాన్ని పొందుతున్నా. సాళ్ల వారిగా వరి, మినుము, కంది, బొబ్బర్లు, కూరగాయలు సాగు చేస్తున్నా. ఎటువంటి రసాయనాలు వాడని పంటకు మంచి డిమాండ్‌ వుంది. కషాయాల సేద్యం వల్ల ఆర్థికంగా స్థిరపడ్డాను. రైతులంతా ప్రకృతి సేద్యాన్ని తప్పక అనుసరించాలి.
– లింగా విజయ్‌ కుమార్‌, ఖమ్మం
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి,గుంటూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *