చెరకులో రికార్డు దిగుబడి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంత రైతులు వెరైటీ చెరకు వంగ డాలతో అత్యధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరాకు 70 నుంచి 80 టన్నుల దిగుబడి సాధిస్తూ మహారాష్ట్ర రైతులకు సవాల్‌ విసురుతున్నారు. అలాంటి రైతుల్లో ఒకరు న్యాల్‌కల్‌ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతు డా.రాజేశ్వర్‌రెడ్డి.
జహీరాబాద్‌ ప్రాంత రైతులు దశాబ్దాలుగా చెరకును ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎర్రరేగడి నేలలు అధికం. ఈ నేలలు చెరకు సాగుకు అనుకూలం కావడంతో జహీరాబాద్‌ డివిజన్‌లోని జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌ మండలాల్లో చెరకు అధికంగా సాగవుతున్నది. చెరకులో అంతర పంటగా వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలను తీసుకు వచ్చి సాగు చేపడుతున్నారు ఇక్కడి రైతులు. 86032, 93297, 83023, 850186, 89219, 86907, 88014 రకాలను ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు భూసారాన్ని పరిశీలించిన తరువాత వారి సిఫారసుల మేరకే చెరకు వంగడాన్ని నాటుకుంటున్నారు. తాజాగా అధిక దిగుబడి ఇచ్చే వీథి 5354 రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేశారు రైతులు. ఈ ప్రాంతంలో 86032 రకం ఎకరాకు 40 నుండి 60 టన్నుల వరకు దిగుబడి రాగా, మహారాష్ట్ర రైతులు ఎకరాకు 100 టన్నుల దిగుబడి సాధించారు. దీన్ని స్వల్పకాలిక రకంగా పిలుస్తారు. తక్కువ నీటితో కూడా సాగు చేసే వీలుంటుంది. 850186 రకం చెరకును హరిత రకంగా పిలుస్తారు. ఈ రకం ఎక్కువగా అడవిపందుల బెడదున్న ప్రాంతాల్లో వేసినా తట్టుకుని మంచి దిగుబడులు ఇస్తుంది. చెరకు పంటను 5-6 ఫీట్ల మధ్య దూరంలో వేయడం వల్ల కలుపు నివారణకు అనుకూలంగా ఉంటుంది. చాళ్ళ మధ్యలో గడ్డి పెరగకుండా మినీ ట్రాక్టర్ల సహాయంతో కలుపును తీసుకోవచ్చు. దాంతో కూలీల సమస్య వుండదు. ఎకరా చెరకు సాగుకు రూ. 50 వేల మేర ఖర్చు వస్తుంది. ఈ ప్రాంతంలో పలువురు రైతులు గతేడాది ఎకరానికి70 టన్నుల దిగుబడి సాధించారు. ఈ ఏడాది 60 టన్నులకు పైగానే వస్తుందని చెబుతున్నారు. చెరకు పంటను పండించడం ఒక ఎత్తయితే, అమ్ముకోవడం సమస్యగా మారింది. జహీరాబాద్‌ ప్రాంతంలో వున్న చెరకు మిల్లులకు పంటను తరలిస్తే అన్నీ ఖర్చులు కలిపి టన్నుకు రూ. 2940 మాత్రమే ఇస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలకు తరలిస్తే రూ. 3930 వరకు చెల్లిస్తున్నారు. చెరకు మార్కెట్‌ విషయంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
80 టన్నుల దిగుబడి ఖాయం
20 ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది 17 ఎకరాల్లో ఎకరాకు 60 టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. మరో మూడు ఎకరాల్లో చెరకు నరికేందుకు సిద్ధంగా వుంది. అందులో 80 టన్నుల వరకు దిగుబడి రావడం ఖాయం.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *