ఛలో ట్రాక్టర్‌ నగర్‌

దుక్కి దున్నడం మొదలు పంట కోత , నూర్పిడికి రైతులు యంత్రాల మీదే ఆధారపడుతున్నారు. ఈ యంత్రాలను ఎలా ఉపయోగించాలో తెలియక రైతులు పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. ఆధునిక యంత్ర పరికరాలను ఉపయోగించడంలో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రం సమీపంలో దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరీక్షణ సంస్థ (ట్రాక్టర్‌ నగర్‌)ను ఏర్పాటు చేసింది. వివిధ కోర్సుల్లో యువకులకు ఉపకార వేతనం, వసతి ఇచ్చి మరీ శిక్షణ ఇచ్చే ఆ సంస్థ విశేషాలు.
ఆధునిక యంత్రాల వాడకంలో యువరైతులకు శిక్షణ
దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన యువరైతులకు శిక్షణనిచ్చేందుకు 1983 సంవత్సరంలో 500 ఎకరాల విస్తీర్ణంలో ట్రాక్టర్‌ నగర్‌ను ఏర్పాటుచేశారు. ఏదైనా నూతన వ్యవసాయ పరికరం తయారైన అనంతరం దాన్ని పరీక్షించి బహిరంగ మార్కెట్‌లోకి తరలించేందుకు ఈ సంస్థ ధ్రువీకరణ తప్పనిసరి. ఏటా ట్రాక్టర్‌ నగర్‌లో సీజన్‌కు అనుగుణంగా ఆయా యంత్రాలను ఉపయోగించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు 34 వేల మందికి పైగా ఇక్కడ ఆధునిక యంత్రాల వాడకంపై శిక్షణ పొందడం విశేషం.
ట్రాక్టర్‌ నగర్‌లో పలు రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. యూజర్‌ లెవల్‌ కోర్సుల్లో ఒక వారం నుంచి ఆరు వారాలు వరకు వివిధ రకాలపై శిక్షణనిస్తున్నారు. వ్యవసాయంలో శక్తి వినియోగంపై నాలుగు వారాలు, వివిధ యంత్రీకరణ యంత్రాల ఎంపికలో ఆరు వారాలు, పవర్‌ టిల్లర్‌ను నడపడం, యాజమాన్య పద్ధతులు రెండు వారాలు, మహిళా రైతులకు వివిధ వ్యవసాయ పనిముట్ల వాడకంపై మూడు రోజులు, బిందు-తుంపర సేద్యం చేసే విధానంపై ఒక వారం, సస్యరక్షణ పరికరాల ఎంపిక, వినియోగంపై ఒక వారం.. ఇలా పలు కోర్సులను రూపకల్పన చేసి నిపుణుల చేత శిక్షణ ఇప్పిస్తున్నారు. యూజర్‌ లెవల్‌ కోర్సులకు కనీసం విద్యార్హత 8వ తరగతి. వయస్సు 18 ఏళ్ళు పూర్తి అయి ఉండాలి. పొలం, వ్యవసాయ యంత్రాలు కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తారు.
కోర్సులపై ఉచితంగా శిక్షణనిస్తారు. శిక్షణ పొందే విద్యార్థులకు రోజుకు రూ.175 చొప్పున ఉపకార వేతనం కూడా ఇస్తారు. శిక్షణా కేంద్రానికి వచ్చి వెళ్లేందుకు అయ్యే రవాణా ఖర్చులు అందిస్తారు. ట్రాక్టర్లు, డీజిల్‌ ఇంజన్లు, పవర్‌ టిల్లర్లు, వ్యవసాయ యంత్రాలు, హైడ్రాలిక్‌ సిస్టమ్స్‌, ఆటో ఎలక్ట్రికల్‌ పరికరాలు, బ్యాటరీ మరమ్మతులు, భూమి చదును చేసే యంత్రాల నిర్వహణ, బుల్‌డోజర్‌ నిర్వహణలపై ఒకటి నుంచి నాలుగు వారాల వ్యవధిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. టెక్నీషియన్‌ లెవల్‌ కోర్సులకు ఐటీఐ (డీజల్‌/ మోటర్‌ మెకానిక్‌ కోర్సులు) పూర్తి చేసి ఉండాలి. ఈ కోర్సులకు వారానికి రూ. 50లు చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ట్రాక్టర్‌ నగర్‌లో శిక్షణ పొందే యువత, రైతులకు అధునాతన వసతి గృహంలో వసతి, భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సంస్థ ఆవరణలోనే విజ్ఞాన సమాచార కేంద్రం విద్యార్థులకు అందుబాటులో ఉంది.
శిక్షణతో ఎంతో ప్రయోజనం
అన్ని రకాల పంటలకు సంబంధించిన ఆధునిక యంత్ర పరికరాలను ట్రాక్టర్‌ నగర్‌లో ప్రదర్శనకు ఉంచాం. వీటిని ఎలా ఉపయోగించాలి? ఎలా మరమ్మతులు చేయాలనే అంశాలపై కోర్సులు రూపొందించి, యువతకు శిక్షణ ఇస్తున్నాం. వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి యంత్రానికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *