తీస్తే కష్టం.. ఉంచితే నష్టం!

  • ఆటో స్టార్టర్లపై మీమాంస
24గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేయాలనే నిర్ణయం మంచిదే. కానీ ఆటో స్టార్టర్లను తొలగిస్తే కష్టాలు తప్పవేమో? ముఖ్యంగా ఒకటి కన్నా ఎక్కువ బోరు మోటార్లు ఉన్న రైతులకు దీని వల్ల ఇబ్బందే. కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే మళ్లీ ఆన్‌ చేసేందుకు తరచూ బోరు బావుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
 
దీనివల్ల సమయం, శ్రమ వృధా అవుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశమూ వుంది. గ్రామాల్లో మహిళా రైతులు కూడా పంటలకు నీటి తడులను అందిస్తారు. వీరికి బోరు మోటార్లను ఆన్‌ చేయడంపై అవగాహన తక్కువ. దాంతో తప్పని సరిగా మరో వ్యక్తి అవసరం తీసుకోవాలి. కొమ్మ ఊగితే కరెంట్‌ పోయే పరిస్థితుల్లో ఆటో స్టార్టర్లను తొలగిస్తే రైతులకు కష్టాలు తప్పవు. పగలంతా ఆన్‌ చేసినా రాత్రి వేళల్లో ఆటో స్టార్టర్లను బంద్‌ చేసేందుకు మేం సిద్ధం. 
– జాదవ్‌ బాపురావ్‌, నేరడిగొండ, ఆదిలాబాద్‌
జనవరి నుంచి వ్యవసాయానికి నిరంతరంగా 24గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రయల్‌గా సరఫరా చేసి సక్సెస్‌ అయింది. నిరంతర విద్యుత్‌ సరఫరా వల్ల విద్యుత్‌ దుర్వినియోగం అయ్యే అవకాశం వుందని ప్రభుత్వం పసిగట్టింది. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షా 11వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.
ఇందులో 62వేల వ్యవసాయ బోరు మోటార్లకు ఆటో స్టార్టర్లు వున్నాయి. ఇప్పటికి 12 వేల ఆటో స్టార్టర్లు మాత్రమే తొలగించారని సమాచారం. వరి సాగు చేసే రైతులే ఎక్కువగా ఆటో స్టార్టర్లను వినియోగిస్తున్నారు. గతంలో కరెంట్‌ కోతలతో రైతులు ఆటో స్టార్టర్ల ఏర్పాటు తప్పనిసరైంది. 24గంటల విద్యుత్‌ సరఫరా అమల్లోకి వస్తే నీటి వృథాతో పాటు, కరెంట్‌ వినియోగం విచ్చలవిడిగా జరిగే ప్రమాదం వుంది.
కరెంట్‌ను పొదుపుగా వాడుకునే అంశంపై స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో రైతులకు భూగర్భ జలాల ప్రాధాన్యతను వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి 24గంటల కరెంట్‌ సరఫరాపై వివరించాలని ఆదేశించింది.
– జేఆర్‌ చౌహాన్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ, ఉమ్మడి జిల్లా
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *