దశ మార్చే దేశీ కోళ్లు 

బీటెక్‌ చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూడలేదు ఆ యువకులు.
నాటుకోళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ గమనించి అరుదైన నాటుకోళ్ల పెంపకం చేపట్టారు ఖమ్మం పట్టణానికి చెందిన యువకులు బసవ నవీన్‌కుమార్‌, శేరెడ్డి శివారెడ్డి. 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని అరుదైన నాటుకోళ్లను పెంచుతూ లాభాలు ఆర్జించడంతో పాటు పది మందికి ఉపాథి కల్పిస్తున్న ఆ యువకులు ప్రస్థానం.
ఇద్దరు ఇంజనీర్ల వినూత్నయత్నం
ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన రుక్మాంగదరావు 20 ఎకరాల తన వ్యవసాయ భూమిలో ఏడాది క్రితం నాటుకోళ్ల ఫారం ఏర్పాటు చేశారు. వివిధ రకాలు, జాతులకు చెందిన నాటుకోళ్లను పెంచి విక్రయించేవారాయన. ఆయన గురించి తెలుసుకున్నారు ఖమ్మం పట్టణానికి చెందిన బసవ నవీన్‌కుమార్‌, శేరెడ్డి శివారెడ్డి. ఏదైనా లాభసాటి వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ రుక్మాంగద రావును కలుసుకున్నారు. నాటుకోళ్ల పెంపకం గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌ను అధ్యయనం చేశారు. వారి ఆసక్తిని గమనించిన కోళ్ల పారం యజమాని ఫారంను లీజుకిచ్చేందుకు ముందు కొచ్చారు. ఇంజనీరింగ్‌ చదివిన ఆ యువకులు పౌలీ్ట్ర రైతులుగా మారారు. తాము చదువుకున్న విద్యతో, ఒంటబట్టించుకున్న సాంకేతికతను జోడించి పౌలీ్ట్రని లాభసాటిగా తీర్చిదిద్దారు. పదిమందికి ఉపాథి కల్పించే స్థాయికి ఎదిగిన ఆ యువకులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు
 
నెలకు 70 వేల ఆదాయం
వెరైటీ నాటుకోళ్లకు పెరుగుతున్న గిరాకీని గమనించిన ఆ యువకులు ఏపీ తదితర ప్రాంతాల నుంచి కడక్‌నాథ్‌ కోళ్లతో పాటు చీమకోళ్లు, సవేలా, డేగ, టర్కీ, కాకినెమలి, ఇటుక తదితర జాతులకు చెందిన నాటు కోడిపుంజులు, పెట్టలను తీసుకువచ్చి పెంచుతున్నారు. వీటితో పాటు కౌజు పిట్టలను కూడా పెంచుతున్నారు. కేవలం కోళ్ల పెంపకానికి పరిమితం కాకుండా జర్సీ, గిర్‌ జాతులకు చెందిన ఆవులను పెంచుతూ పాలను విక్రయిస్తూ రెండు విధాలా ఆదాయం గడిస్తున్నారు. ఫారంలో నాటు మేకపోతులు, గొర్రెపోతులను కూడా పెంచుతున్నారు ఈ యువకులు. ఈ కోళ్లఫారంలో పెంచుతున్న కోళ్ల నుంచి వచ్చే గుడ్లను ఇంక్యుబేటర్‌ సాయంతో పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. నాటుకోడి, కడక్‌నాథ్‌, కౌజుపిట్టల గుడ్లను మిషన్‌ ద్వారా పొదిగించడం విశేషం.
           ఈ కోళ్లఫారంలో కేవలం కోడిపిల్లలను మాత్రమే విక్రయిస్తున్నారు. కోళ్లను అమ్మకుండా కేవలం వాటినుంచి వచ్చే గుడ్ల ద్వారా పిల్లలను పొదిగించి.. వాటిని, కోడిగుడ్లను అమ్ముతూ లాభార్జన చేస్తున్నారు. నాటుకోళ్ల నుంచి రోజుకు 30 గుడ్లు, కడక్‌నాథ్‌ కోళ్లనుంచి 20 గుడ్లు వస్తుంటాయి. నెలకు నాటుకోళ్లకు 900 గుడ్లు వస్తే వాటిలో 600 గుడ్లను పొదగేసి.. పిల్లలు ఉత్పత్తి చేయిస్తారు. ఒక్కో కోడిపిల్లను రూ.50లకు విక్రయిస్తారు. అలా నెలకు సుమారు 600 పిల్లలను విక్రయిస్తే రూ.30 వేల ఆదాయం వస్తుందని, కడక్‌నాథ్‌ గుడ్లు కూడా రోజుకు 20 చొప్పున నెలకు 600 వస్తుంటాయి. అం దులో 400 గుడ్లను పిల్లలు చేయించి.. ఒక్కో పిల్లను రూ.100 నుంచి రూ.200 వరకు విక్రయిస్తామని నవీన్‌, శివారెడ్డి చెబుతున్నారు. వాటి ద్వారా నెలకు రూ.40వేల ఆదాయం వస్తుందని చెప్పారు. వాటితోపాటు కౌజుపిట్ట గుడ్లను పొదిగించి వాటిని పెంచి ఒక్కో పిట్టను రూ.50 లకు విక్రయిస్తుంటామని మొత్తం గా… అన్ని కోళ్లు.. కౌజుపిట్టల ద్వారా సుమారు రూ.70 వేల వరకు ఆదాయం ఉంటుందని వారు తెలిపారు.
 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఖమ్మం రూరల్‌
 
వ్యవసాయం కంటే మేలు
వ్యవసాయానికి భారీగా ఖర్చు పెట్టాలి. కలిసి రాకపోతే అప్పులు మిగులుతున్నాయి. పెద్దగా పెట్టుబడులు లేని, ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ ఉండే వ్యాపారం చేయాలనుకుని నాటుకోళ్ల వ్యాపారం మొదలుపెట్టానన్నారు ఈ ఫారం యజమాని రుక్మాంగదరావు. ఇప్పుడు యువకుల ఆసక్తిని గమనించి ఫారంను వాళ్లకు లీజుకిచ్చినట్లు వివరించారు.
సొంతంగా ఏదైనా చేయాలని…
బీటెక్‌ చదివినా ఏదో వెలితి. ఊరికి, అయినవారికి దూరంగా ఎక్కడో ఉద్యోగం చేసే కంటే.. సొంతంగా వ్యాపారం చేసి.. స్థిరపడాలనే కోరిక. వ్యాపారంపై మక్కువతోనే ఈ కోళ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాం. దీని ద్వారా మరో పదిమందికి ఉపాధి కూడా అందించగలుగుతున్నాం.
బసవ నవీన్‌కుమార్‌ (సెల్‌ 9160608085),
శేరెడ్డి శివారెడ్డి (సెల్‌ 9492051986)
 
సేంద్రియ పద్ధతిలో ఖర్చు తక్కువ
సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది. తెగుళ్లు రాలేదు. నాణ్యమైన కాయలు రావడం వల్ల మంచి ధర వచ్చింది. ఏటా ఒకే పంట కాకుండా పంట మార్పిడి పాటించడం వల్ల ప్రయోజనం వుంటుంది. డ్రిప్‌ కోసం ఉద్యాన శాఖ సబ్సిడీ ఇచ్చింది. విత్తనాల మీద కూడా సన్నకారు రైతులకు సబ్సిడీ ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది.
 గాడి తిరుపతిరెడ్డి, రైతు, ములకలపల్లి
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *