నారు ఎదగడం లేదు..ఏం చేయాలి?

ఖరీఫ్ లో వరి పంట చేతికి వచ్చే సమయంలో దోమపోటుతో పంట నష్టపోయాం. రబీ నార్లు చలి కారణంగా సరిగా ఎదగడం లేదు. దీనికితోడు నార్లకు అగ్గితెగులు, మొగి పురుగు సోకుతున్నాయి. నారు దశలోనే రెండు, మూడుసార్లు మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. నారు సక్రమంగా ఎదిగేందుకు ఏం చేయాలి?
– ముత్యాల గంగారెడ్డి, రైతు, తాటిపెల్లి
రబీ సీజన్‌లో సాధారణంగా చలి తీవ్రత పెరుగుతుంది. అందుకోసం స్వల్పకాలిక, చలిని తట్టుకునే వరి రకాలను ఎంచుకోవడం ఉత్తమం. ఫిబ్రవరి 15 తర్వాత వరి పంట పూత దశ దాటే విధంగా చూసుకోవాలి. పూత దశలో చలి ఎక్కువగా వుంటే పంట నష్టపోయే ప్రమాదం ఉంది. ఏప్రిల్‌ మొదటి వారంలోపు పంట కోత పూర్తయ్యే విధంగా చూసుకోవాలి. లేదంటే ఎండ వేడిమి పెరగడంతోపాటు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఇదంతా జరగాలంటే జనవరి 10లోపు వరినాట్లు పూర్తయ్యే విధంగా చూసుకోవడం తప్పనిసరి.
చలికి పోషకాల లోపంతో నారు సరిగా ఎదగకపోవడంతో పాటు ఆకుల రంగు మారిపోతోంది. జింక్‌లోపం, ఇతర పోషకాల లోపం గానీ ఉంటే రైతులు గమనించి ఎగ్రోమిన్‌ వాక్స్‌ గానీ, ఫార్ములా – 4, ఫార్ములా – 6 వంటి మందులను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి నారుపై పిచికారీ చేయాలి. అలాగే అగ్గి తెగులు సోకినట్లైతే ట్రైసైక్లోజోన్‌ లీటరు నీటికి 0.6 గ్రాములు, మొగి పురుగు ఉధృతి ఉంటే ఎకరానికి సరిపోయే నారుకు 600-800 గ్రాముల 3జీ గానీ, 4జీ గానీ చల్లుకోవాలి. అలాగే నారుమడిలో ఉండే నీటిని ఉదయం తీసేసి, మళ్లీ కొత్త నీటిని పెట్టాలి. దీనివల్ల తెగుళ్ల ఉధృతి తగ్గే అవకాశం ఉంది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *