పసుపు రైతుకు వరం స్టీమ్‌ బాయిలర్‌

  • రోజుకు 180 క్వింటాళ్ల కొమ్ము స్టీమ్‌
పసుపు రైతులకు స్టీమ్‌ బాయిలర్‌లు వరంగా మారాయి. కూలీల సమస్యను అధిగమించి, పండిన పసుపును తక్కువ సమయంలో ఉడికించేందుకు ఈ యంత్రం ఎంతో అనుకూలంగా వుంటున్నది. గంట పాటు ఆవిరి వచ్చేదాకా నీళ్ళను వేడి చేస్తే చాలు. 10 నిమిషాలకు ఒకసారి 3 క్వింటాళ్ళ కొమ్మును ఉడికిస్తుంది ఈ యంత్రం. 6 నుంచి 8 మంది కూలీల సాయంతో రోజులో 180 క్వింటాళ్లకు పైగా పసుపును ఉడికించుకోవచ్చు. ఈ యంత్రంలో రెండు రకాలు ఉన్నాయి. రూ.4 నుంచి రూ. 4.5 లక్షల ఖరీదు చేసే పసుపును ఉడికించే యంత్రాన్ని ప్రభుత్వం సబ్సిడీ కింద ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. నందిపేట మండలంలో ఈ ఆధునిక యంత్రాలు 50కి పైగా ఉన్నాయి. క్వింటాలు పసుపును ఉడికించేందుకు రూ.130 అద్దెగా తీసుకుంటున్నారు.
ఈ యంత్రంలో పసుపును ఉండికించడానికి నాలుగు కుక్కర్లు(బాయిలర్లు) ఉంటాయి. ఒక్కొక్క బాయిలర్‌లో 3 క్వింటాళ్ళ పసుపు ఉడుకుతుంది. స్టీమ్‌ వచ్చే వరకు అంటే సుమారు గంటపాటు నిప్పు పెట్టాలి. 10 నిమిషాల వ్యవధిలో 3 క్వింటాళ్ళ చొప్పున ఉడికించిన పసుపు బయటకు వస్తుంది. రోజుకు 180కి పైగా క్వింటాళ్ళ పసుపును ఉడికించుకోవచ్చు.
ఎనిమిది మంది కూలీలు ఉంటే చాలు. రెండున్నర నుంచి మూడు టన్నుల కలప అవసరం ఉంటుంది. యంత్రం ఖరీదు రూ.4.50 లక్షలు. రెండు డ్రమ్ముల యంత్రంలో రెండు కుక్కర్లు వుంటాయి. ఒక్కొక్క బాయిలర్‌లో మూడు క్వింటాళ్ళ పసుపు ఉడుకుతుంది. దీని ధర నాలుగు లక్షలు.
సబ్సిడీపై ఇవ్వాలి
పసుపును ఉడికించే యం త్రాన్ని ప్రభుత్వం సబ్సిడీపై అందజేయాలి. కనీసం యంత్రం కొనుగోలుకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలి. బీమా సౌకర్యం కల్పించాలి. గ్రామానికి ఒక యంత్రాన్ని సిద్ధంగా వుంచి పీఏసీఎస్‌ సొసైటీల ద్వారా అద్దెకు ఇప్పించినా రైతులకు సౌకర్యంగా వుంటుంది.
– గోక శ్రీనివాస్‌ రెడ్డి, రైతు, డొంకేశ్వర్‌
నాణ్యత పెరిగింది
పసుపును ఉడికించే ఆధునిక యంత్రం రావడంతో కూలీల సమస్య తీరింది. గతంలో 180 క్వింటాళ్ళ పసుపును ఉడికించేందుకు రెండు రోజులు పట్టేది. గాడీలపై కడాయిలు పెట్టి పసుపును ఉడికించడం ద్వారా నాణ్యత తగ్గేది. స్టీమ్‌ ద్వారా పసుపు నాణ్యత పెరిగింది.
– జి సాయికృష్ణ,
మండల వ్యవసాయ అధికారి, నందిపేట
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నందిపేట
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *