పాలీహౌస్‌తో లాభాల పూలబాట

  • జర్బరా సాగుతో ఏటా 5 లక్షల ఆదాయం
కాయకష్టానికి ఆధునిక టెక్నాలజీ తోడైనప్పుడే సేద్యం లాభసాటి అవుతుందని నిరూపించాడు చేవెళ్ల మండలం ఇక్కరెడ్డి గ్రామానికి చెందిన యువరైతు గణపతి చంద్రశేఖర్‌ రెడ్డి. పాలీహౌస్‌లో జర్బరా పూల సాగు చేపట్టి, నాణ్యమైన ఆ పూలను వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న ఆ రైతు విజయగాథ.
రంగారెడ్డి జిల్లాలోని ఆ ప్రాంతం కూరగాయల సాగుకు పెట్టింది పేరు. చేవెళ్ల మండలం చనువల్లి అనుబంధ గ్రామామైన ఇక్కరెడ్డి గ్రామానికి చెందిన గణపతి చంద్రశేఖర్‌రెడ్డి ఎంతోకాలంగా కూరగాయల సాగు చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా చేతిక అందక తీవ్రంగా నష్టపోయారు. కూరగాయల బదులు మరేదైనా సాగు చేయాలని ఆలోచించాడు ఆ యువరైతు. తనకున్న రెండున్నర ఎకరాల్లో పాలిహౌ్‌సను ఏర్పాటు చేసుకున్నాడు. మూడేళ్లుగా జర్బరా పూల సాగు చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నాడు.
పాలీహౌస్‌ నిర్మాణానికి 25 లక్షల ఖర్చవుతుంది. అందులో 75 శాతం మొత్తం ప్రభుత్వం నుంచి సబ్సిడీగా అందుతుంది. అలా చేవెళ్ల మండలంలోనే మొట్టమొదటగా ఇక్కరెడ్డి గూడలో పాలిహౌ్‌సను ఏర్పాటుచేసి జర్బరా పూల సాగు ప్రారంభించాడు ఆ రైతు. పూలను హైదరాబాద్‌ మార్కెట్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, పూనే తదితర ప్రాంతాలకు నేరుగా ఆర్డర్లు తీసుకుని ఎగుమతి చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. రెండేళ్ల క్రితం జర్బరా పూలు మంచి ధర పలికాయి. దాంతో 25 లక్షల దాకా ఆదాయం లభించిందని ఆ రైతు చెప్పారు.
 
పెళ్లిళ్ల సీజన్‌లో గిరాకీ
పెళ్లి పందిళ్లకు అలంకరణ కోసం ఉపయోగించే జర్బరా పూలకు రెండేళ్ల క్రితం వరకు భారీగా డిమాండ్‌ వుండేది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు అంతటా సాగు పెరిగింది.
దీంతో ధర తగ్గింది. గతంతో పోల్చితే ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌తో పాటు ఇతర రాష్ర్టాల్లో కూడా ఈ పూలు తక్కువ ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం కట్ట పూల ధర రూ. 10 నుంచి 20లు మాత్రమే వుంది. పెళ్లిళ్ల సీజన్‌లో మాత్రం కట్ట పూల ధర రూ. 70 నుంచి 100 వరకు పలుకుతుంది. పాలిహౌ్‌సలో జర్బరా పూలు వారానికి రెండు కోతలు తప్పని సరిగా కోయాలి. కోసినప్పుడల్లా 250 నుంచి 300 వందల కట్టల పూలు చేతికి వస్తాయి. పాలిహౌస్‌ నుంచి తీసిన పూలను కట్టలు చేసి ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్‌ల్లో పూలను జతపర్చి పూల మార్కెట్‌కు తరలించి అమ్మకాలు జరుపుతారు.
నాడు దిగుమతి.. నేడు ఎగుమతి
ఈ పూలను గతంలో బెంగుళూర్‌ నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం. అలాంటిది ఇప్పడు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ, ముంబాయి, పూనె, చెన్నెయ్‌, బెంగుళూర్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. చేవెళ్ల ప్రాంతంలో పాలీహౌస్ లలో సాగు చేసిన జర్బరా పూలు దేశం నలుమూలలకు ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఇటీవల స్థానిక రైతుల్ని ప్రశంసించడం విశేషం.
 
పాలీహౌస్‌ సేద్యంతో లాభాలు: గణపతి చంద్రశేఖర్‌రెడ్డి
కూరగాయల సాగు కంటే పాలిహౌస్‌ సేద్యంలో లాభాలు అధికం. సీజన్‌లో మంచి ఆదాయం వచ్చినా అన్‌ సీజన్‌లో ఖర్చులు మాత్రమే వస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు పూలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపితే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *