పెరటి సాగుతో లక్షల ఆదాయం

వాణిజ్య పంటలు నష్టం వచ్చిన ఏడాది రైతును ఆర్థికంగా కుంగ దీస్తున్నాయి. అయినా రైతులు వాణిజ్యపంటల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ పెద్ద రైతుల్ని తలదన్నేలా ఆదాయం పొందుతున్నారు ఆదిలాబాద్‌ జిల్లా సాయిలింగి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు.
ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం సాయిలింగి గ్రామం కూరగాయల సాగుకు పెట్టింది పేరు. ఈ గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులంతా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తారు. ఇదే గ్రామానికి చెందిన తోట గణపతి – లక్ష్మి దంపతులు పెరటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నారు. భార్యాభర్తలిద్దరూ కష్టపడి పనిచేసి పాలకూర, మెంతికూర, కొత్తిమీర, చిక్కుడు, తోటకూర, గోంగూర, పుల్లగూర లను సాగు చేస్తున్నారు. గణపతి పొలం పనులు చూసుకుంటే ఆయన భార్య లక్ష్మి పండించిన పంటను ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుంది. నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయలు నేరుగా విక్రయించడం వల్ల నిత్యం రెండు నుంచి మూడు వేల రూపాయలు ఆర్జిస్తున్నారు ఈ దంపతులు. ఆకు కూరలకు చీడపీడలు తక్కువ. ఫలితంగా సాగు ఖర్చులు తక్కువ. ఇద్దరూ కష్టపడి రోజంతా పనిచేస్తారు. దళారుల బెడద లేకుండా పండించిన పంటను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీంతో మిగిలిన వారి కంటే అధిక లాభాలు ఆర్జిస్తున్నామని చెబుతున్నారు ఆ దంపతులు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, తలమడుగు, ఆదిలాబాద్‌ జిల్లా
ఆకుకూరల సాగుతో భరోసా
ఆకు కూరల సాగులో నష్టం వస్తుందన్న భయం ఉండదు. తక్కువ నీటి వసతి ఉన్న రైతులు కూడా ఆకు కూరలను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆకు కూరలు పండించే రైతులకు ప్రోత్సాహం అందించాలి. వాణిజ్య పంటలు సాగు చేసి నష్టపోతున్న రైతులకు ఆకుకూరల సాగు మంచి ప్రత్యామ్నాయం.
– తోట గణపతి, లక్ష్మి
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *