ప్రకృతి వ్యవసాయ అశోకుడు

రిటైర్మెంట్‌ తరువాత జీవితం లేదనుకుంటారు చాలామంది. విద్యాధికారిగా పదవీ విరమణ చేసిన ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంగా చేపట్టారు. ఏడేళ్లుగా ఉత్తమ దిగుబడులు సాధిస్తున్నారు. ప్రకృతి సేద్యంలో తన అనుభవాలను ఆరు రాష్ట్రాల రైతులకు పంచుతున్నారు. రెండు లక్షల మంది ప్రకృతి సైనికుల్ని తయారుచేసిన జగిత్యాలకు చెందిన కొక్కు అశోక్‌కుమార్‌ ప్రస్థానం ఇది.
మల్యాల మండలంలోని ఒగులాపూర్‌ శివారులో అశోక్‌కుమార్‌కు ఏడెకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో 15 ఏళ్లుగా అల్లం, పసుపు, కూరగాయలు, పూలు, మామిడి సాగు చేస్తున్నారాయన. గతంలో పంటలకు చీడపీడలు, తెగుళ్లు సోకి తీవ్రనష్టం చవిచూశారు. ఇలా ఎందుకు జరుగుతున్నదని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులను అడిగినా ఫలితం లేకపోయింది. ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) సంస్థకు వెళ్లారు. సహజమైన ఎరువులు, పురుగుల మందులు వాడితే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు చెప్పారు. ఏడేళ్లుగా ఆ మార్గాన్ని అనుసరిస్తూ తక్కువ ఖర్చుతో అనూహ్య ఫలితాలు అందుకుంటున్నారు అశోక్‌ కుమార్‌. జీవామృతం, వర్మీ వాష్‌, వర్మీ కంపోస్ట్‌ తయారీ చేసి పంటలకు అందిస్తారాయన. ఆవుపేడ, ఆవు మూత్రం, పాడైన పండ్లు, పిండి గిర్నీల్లో వృథాగా ఉండే పరం పొట్టు వంటి వాటితో పాటు కోళ్లు, మేకలు, అడవి జంతువుల వ్యర్థాలతో జీవామృతం తయారుచేసి వినియోగిస్తుంటారు.
పంటలపై వేప గింజల కషాయం, వర్మీ వాష్‌, వర్టిసెల్లా, బవేరియా, ఫంగిసైడ్‌లను ప్రత్యేకంగా తయారుచేసి స్ర్పే చేయడం వల్ల ఎలాంటి చీడపీడలు పంటల దరికి చేరకుండా చేసి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. మామిడి తోట మధ్యలోని ఖాళీ స్థలంలో అల్లం, పసుపు పంటలు, కూరగాయలు, పూల మొక్కలను సాగు చేసి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఆయన ఏడెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఒకే బోరుబావి వుంది. చుట్టుపక్కల రైతులు 200 అడుగుల లోతు బోర్లు వేశారు. ఈ రైతుకు మాత్రం 50 అడుగుల్లోనే పుష్కలంగా నీరు వస్తున్నది. బోరు బావి రీఛార్జ్‌ కావడానికి పక్కన కొండలు, గుట్టల నుంచి వచ్చే వర్షపు నీటికి అడ్డుకట్టలు వేసి ఒకచోట నిలిపి రీఛార్జ్‌ చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల రైతుల బావుల్లో కూడా నీరు పుష్కలంగా వస్తున్నది. ఇలాగే ప్రతి రైతు తమ భూములను, పంటలను, నేలను రక్షించుకోవడానికి చైతన్యవంతులు కావాలంటారు అశోక్‌కుమార్‌.
తన అనుభవాలను సాటి రైతులతో పంచుకోవడం ప్రారంభించారు అశోక్‌కుమార్‌. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు తమిళనాడు, ఢిల్లీ, కర్టాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది అనుయాయులు వున్నారు. 20 వేల మంది ఆయనలా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. కేవలం రైతులే కాదు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు, పలు కంపెనీల ప్రతినిధులు వచ్చి ఆయన నుంచి సాగు పద్ధతులు తెలుసుకోవడం విశేషం. రైతులను చైతన్యవంతులను చేయడానికి పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.
ప్రకృతి సేద్యమే రక్ష
ప్రకృతి సేద్యంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు. రైతులంతా ఈ మార్గాన్ని అనుసరిస్తే సాగుభూమి నిర్వీర్యం కాకుండా వుంటుంది. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతాయి. మనతో పాటు భావితరాలు క్షేమంగా వుండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైకమార్గం.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *