మట్టిలేని సేద్యం.. వెరైటీ పంటల క్షేత్రం

భాగ్యనగర దంపతులు ప్రయోగం.. స్టార్‌ హోటళ్లు, విదేశాలకు ఎగుమతి
నోరూరించే స్ట్రాబెర్రీలు, చిట్టి టమాటాలు, స్టార్‌ హోటళ్లలో సలాడ్స్‌ తయారీకి ఉపయోగించే ఖరీదైన కూరగాయలు, ఆకుకూరలతో పాటు, పూలు, పండ్లను సాగు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన యువ దంపతులు సచిన్‌, శ్వేత. హైడ్రోఫోనిక్‌ తరహా సేద్యానికి కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని జోడించి సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న వారి ప్రస్థానం ఇది.
ఎరువులు, రసాయనాలు ఉపయోగించని తాజా కూరగాయలు ఈ కాలంలో చాలా అరుదు. ఆరోగ్యాన్ని అందించాల్సిన కూరగాయలు, ఆకుకూరలు ఇప్పుడు అనారోగాన్ని పంచుతున్నాయి. భూసారం నానాటికీ తగ్గిపోవడంతో ఎరువులు కుమ్మరించి పండించిన పంటలు రుచీపచీ లేకుండా వుంటున్నాయి. ఎరువులు ఉపయోగించని, తాజా కూరలు, పండ్లను ఎంత ధర చెల్లించయినా కొనేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారు. పరిస్థితిని గమనించిన కొందరు ఎరువులు వేయని కూరగాయలంటూ నాణ్యత లేని వాటిని అంటగడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని సంకల్పించారు యువ దంపతులు సచిన్‌, శ్వేత దర్బార్‌వర్‌. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సచిన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేవారు. శ్వేత కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. సొంతవూరిని వదిలి ఎక్కడో ఉద్యోగాలు చేయడం ఏమిటని ఇద్దరూ ఆలోచించారు. హైదరాబాద్‌ తిరిగి వచ్చి నగరానికి సమీపంలో షామీర్‌పేట చేరువలోని పొన్నల్‌ గ్రామంలో 14 ఎకరాలు భూమి సేకరించారు. హైడ్రోఫోనిక్‌ వ్యవసాయం ప్రారంభించారు.
హైటెక్‌ సేద్యం
మట్టి అవసరం లేకుండా కేవలం కొద్దిపాటి నీరు, ఇతర పోషకాల సహాయంతో సేద్యం చేయడమే హైడ్రోఫోనిక్‌ వ్యవసాయం. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లలో ఈ తరహా వ్యవసాయం గురించి అధ్యయనం చేశారు ఈ దంపతులు. సాగుకు అవసరమైన పరికరాలను అక్కడి నుంచే దిగుమతి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కేవలం హైడ్రోఫోనిక్‌ విధానంలో సాగు చేస్తే సరిపోదు.. కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి, మరింత ఆధునికంగా సాగు చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయని గ్రహించారు. ఎంతో ఖర్చు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైడ్రోఫోనిక్‌ వ్యవసాయాన్ని అనుసంధానం చేశారు. అవరోధాలను అధిగమించి మూడేళ్లుగా బంగారు పంటలు పండిస్తున్నారు ఈ దంపతులు. మన దేశంలోని బడా హోటళ్లలో సలాడ్‌లు, ఇతర వంటకాల్లో ఉపయోగించే ఆకులు, కూరలను, చెర్రీలు, చిట్టి టమాటాలు, మిరపకాయల వంటి పంటలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వాటన్నింటినీ మనమే ఎందుకు పండించకూడదని ఆలోచించారు సచిన్‌, శ్వేత. 15 రకాల ఆకుకూరలు, విదేశీ పూలు, నాణ్యమైన చెర్రీలు, నోరూరించే చిట్టి టమాటా, క్యాప్సికం, కీర దోసకాయలను సాగు చేయడం ప్రారంభించారు. రెండెకరాల్లో నాలుగు పాలీహౌస్‌ తరహా షెడ్లను నిర్మించారు.
శీతల ప్రాంతాల్లో పండే ఈ తరహా పంటల సాగుకు నిరంతరం నియంత్రిత ఉష్ణోగ్రతలు వుండాలి. అందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించారు. బయటి నుంచి గాలి చొరబడకుండా, నిరంతరం చల్లదనంగా వుండేందుకు వీలుగా ఆధునిక ఫ్యాన్లు అమర్చారు. ‘మట్టి అవసరమే లేకుండా, నామమాత్రంగా నీటిని ఉపయోగించడంతో పాటు మొక్కలకు అవసరమైన పోషకాలను అందించడం మా ప్రత్యేకత. నియంత్రిత వాతావరణం వుంటుంది కాబట్టి చీడపీడల బెడద వుండదు. ఎరువులు, క్రిమిసంహారకాలు వేయాల్సిన అవసరమే లేదు. మేం పండించిన పండ్లను నేరుగా తినవచ్చన్నారు’ సచిన్‌. ఈ తరహాలో పండ్లు, పూలు, కూరగాయల సాగుకు ఎకరాకు మూడు కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇందుకు అవసరమైన పరికరాల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఖర్చులు అధికంగా వుంటాయి. ఈ క్షేత్రంలో పండిస్తున్న వెరైటీ పంటలను హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగుళూరు, చెన్నైలలోని నేచర్స్‌ బాస్కెట్‌, బిగ్‌బజార్‌, హైపర్‌ సిటీ వంటి పెద్ద డిపార్ట్‌మెంట్‌ స్టోర్లు, స్టార్‌హోటళ్లలో విక్రయి స్తున్నారు. ఈ ఉత్పత్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో నేరుగా ఆర్డర్‌ చేసి తెప్పించుకునే సౌకర్యం వుంది. దుబాయ్‌, సింగపూర్‌ తదితర విదేశాలకు కూడా తమ ఉత్ప త్తులను విక్రయిస్తున్నారు ఈ దంపతులు.
మొక్కల ఆరోగ్యంపై కంప్యూటర్‌ కన్ను!
కంప్యూటర్‌ పరిజ్ఞానంతో హైడ్రోఫోనిక్‌ వ్యవసాయాన్ని అనుసంధానం చేయడం మా ప్రత్యేకత. మొక్కలకు ఎప్పుడు నీరందించాలి? ఎలాంటి పోషకాలు ఎప్పుడు ఇవ్వాలి? మొక్క ఆరోగ్యంగానే వున్నదా అనే వివరాలను కంప్యూటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుని నాణ్యమైన పంటలు పండిస్తున్నాం. ఏప్రిల్‌, మే నెలల్లో మినహా ఏడాదిలో 10 నెలల పాటు ఈ పద్ధతిలో పంటలు పండించవచ్చు. హైదరాబాద్‌ ఇలాంటి పంటల సాగుకు చాలా అనుకూలం. ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేయడం కూడా చాలా సులభం. ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన కూరగాయలు, పండ్లు దిగుమతి చేసుకుంటున్నాం. ప్రభుత్వాలు ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే మరింతమంది ఈ పద్ధతిలో సేద్యం చేస్తారు. తద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసుకోవడంతో పాటు మనమే నాణ్యమైన తాజా ఉత్పత్తులను ప్రపంచానికి అందించే వీలుంటుంది.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *