మననేలపై ఆస్ట్రేలియా ద్రాక్ష

  •  ములుగు గిరిజన బిడ్డ విజయప్రస్థానం..
  • తెలంగాణను అగ్రగామిగా నిలుపుతానంటున్న నాయక్‌
ఆస్ట్రేలియా రకం ద్రాక్ష సాగుపై పరిశోధనలు చేసి విజయం సాధించారు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం అన్నంపల్లికి చెందిన పోరిక హరికాంత్‌ నాయక్‌. వ్యవసాయంపై కోయంబత్తూర్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ చేస్తున్న ఆ యువకుడు తమిళనాడు, కర్ణాటకల్లో ద్రాక్షపై పరిశోధనలు చేసి ప్రశంసలు అందుకున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే వ్యవసాయంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతానంటున్న ఆ గిరిజన బిడ్డ విజయగాథ ఇది.
ప్రత్యేక వాతావరణ పరిస్థితిలో మాత్రమే పండే ద్రాక్ష పంటపై పరిశోధనలు చేసి విజయం సాధించాడో తెలంగాణ గిరిజన బిడ్డ. ఆస్ర్టేలియా రకం ద్రాక్షను మనదేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మలిచి, అధిక దిగుబడులు సాధించి అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం అన్నంపల్లికి చెందిన పోరిక హరికాంత్‌. హైదరాబాద్‌ ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ చేసిన హరి కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చేస్తూ సీనియర్‌ ఫెలోషి్‌పకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం బెంగుళూరులోని ఐసీఏఆర్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు.
ద్రాక్షపై దీక్ష..
రెడ్‌గ్లోబ్‌ రకం ద్రాక్ష ఆస్ట్రేలియాలో విరివిగా పండుతుంది. లావుగా, మంచి రంగులో, తీయగా వుంటే ఈ ద్రాక్షను భారత్‌లో సాగు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ భావించింది. దీని సాగుకు కోయంబత్తూరు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రకం పంటను అభివృద్ధి చేసే పనిని అక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అక్కడే ఎమ్మెస్సీ చేస్తున్న హరికాంత్‌ నాయక్‌ ఆ బాధ్యతలు స్వీక రించాడు. విశ్వవిద్యా లయంలో కొంత భూమిని తీసుకుని ఆ విత్తనాలు నాటి సాగు ప్రారం భించాడు. ఎర్రమట్టి నేల, నీరు, తేమతో కూడిన అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పిస్తూ ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతిలో ఆస్ట్రేలియా రకం ద్రాక్షను విజయవంతంగా సాగు చేశాడు నాయక్‌.
మన ద్రాక్షతో పోల్చితే రెడ్‌గ్లోబ్‌ ఆకారంలో పెద్దది. నీరు శాతం తక్కువగా ఉంటుంది. బరువు కూడా ఎక్కువ తూగుతుంది. ఎక్కువ కాలం పాడు కాకుండా వుంటుంది. ఈ రకం ఆస్ర్టేలియాలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పండిస్తుంటే మనదేశంలో మాత్రం రెండుసార్లు కోతకు వస్తుంది. ఇన్ని సుగుణాలున్న ఆస్ట్రేలియా రకం ద్రాక్షకు విదేశాల్లో మంచి డిమాండ్‌ వుంది. ఈ ద్రాక్షకు కిలో రూ.350 వరకు ధర పలుకుతోంది. రైతులకు క్షేత్ర స్థాయిలో కిలోకు 150 వరకు ఆదాయం వస్తుంది. డిమాండ్‌ను బట్టి ఎకరం సాగు చేస్తే రూ.15 లక్షల వరకు ఆర్జించవచ్చని హరికాంత్‌ నాయక్‌ తెలిపాడు.
రెడ్‌గ్లోబ్‌ రకం ద్రాక్షను భారత వాతావరణ పరిస్థితిలో పండించి అధిక దిగుబడి సాధించిన నాయక్‌ను ఇజ్రాయిల్‌ ప్రభుత్వం తమ దేశానికి ఆహ్వానించింది. ఎడారి ప్రాంతమైన ఇజ్రాయిల్‌లో గ్రీన్‌హౌస్‌, బిందుసేద్యం, పూర్తి యాంత్రీకరణ పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న తీరును ఆయన అధ్యయనం చేశారు. వ్యవసాయరంగంలో నాయక్‌ చేసిన కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం హరికాంత్‌ను బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపికచేయగా, ఫాదర్‌ ఆఫ్‌ గ్రీన్‌ రెవెల్యూషన్‌ ఎంఎ్‌స. స్వామినాధన్‌ చేతులమీదుగా నాయక్‌ ఆ పురస్కారాన్ని అందుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితోపాటు పలువురు సీనియర్‌ శాస్త్రవేత్తలు హరికాంత్‌ సాగుచేసిన ద్రాక్ష తోటను సందర్శించి, విరగగాసిన ద్రాక్ష గుత్తులను చూసి అబ్బురపడ్డారు.
రైతే రాజు
ఇజ్రాయిల్‌ తరహా సాగు పద్ధతులు అనుసరిస్తే తెలంగాణ రైతులు రాజులు అవుతారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే అరుదైన ద్రాక్ష, యాపిల్‌తో పాటు అంతర్జాతీయంగా డిమాండ్‌ వున్న కూరగాయలను తెలంగాణలో సాగు చేస్తాను. సేద్యంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నం చేస్తాను.
– హరికాంత్‌ నాయక్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *