మినుమును మింగుతున్న వెర్రితెగులు

రబీలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని అధికారులు చెప్పారు. మినుము సాగు చేపట్టాం. పైగా రెండో పంటకు కొన్ని ప్రాంతాలకు సాగునీరు సౌకర్యం లేదు. దీంతో మోటార్లు, ఇతర మార్గాల్లో నీటిని అందిస్తున్నాం. ఈ పంటకు ఎల్లో మొజాయిక్‌ వైరస్‌ వల్ల వెర్రితెగులు సోకుతోంది. ప్రధానంగా రసం పీల్చే పురుగు ఫలితంగా ఆకు పసుపు రంగులోకి మారి పంట పాడవుతోంది. దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వుంది. ఏం చేయాలి?
– ఏవీ వెంకటకృష్ణ, రైతు
శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో 35 వేల హెక్టార్లలో మినుము సాగుచేస్తున్నారు. వైరస్‌ తట్టుకునే రకాలు కాకుండా సాధారణ రకాలను వినియోగించడం, మరికొన్ని చోట్ల సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో మినుము రైతులు కుదేలవుతున్నారు. వాస్తవానికి ఎకరాకు ఐదు నుంచి ఏడు బస్తాలు దిగుబడి రావాలి. కానీ రెండు బస్తాలకు మించి ఎక్కడా వచ్చే అవకాశం లేదు. ఎకరాకు ఖర్చు రూ. 3500 కాగా దిగుబడి వచ్చిన పంట నుంచి రూ. 3500 మాత్రమే లభిస్తోంది.
ఈ దఫా ప్రభుత్వం రాయితీపై వైరస్‌ తట్టుకునే మినుము విత్తనాలను పంపిణీ చేసింది. వాటిని కాకుండా గతేడాది విత్తనాలకోసం సిద్ధం చేసుకున్నవి, ఇతర ప్రాం తాల నుంచి తెచ్చుకున్నవి రైతులు వినియోగిస్తున్నారు.
ఆ విత్తనాలకు ఈ వైరస్ ను తట్టుకునే శక్తి లేదు. ఎల్లో మొజాయిక్‌ వైరస్ ను తట్టుకునే పీయూ 31 రకం, ఎల్‌బీహెచ్‌ 752 రకం విత్తనాలనే రైతులు వినియోగించాలి. గాబు తీతను రైతులు పాటించడంలేదు. గాబు తొలగింపు కోసం ఐరిస్‌, ఇమిజెటాపెర్‌ మందులు అందుబాటులోకి వచ్చాయి. రైతులు వీటిని వినియోగించాలి. వైరస్ ను నిరోధించే రకం విత్తనాలను సాగుచేసుకోవాలి. గతంలో సిద్ధం చేసుకున్న విత్తనాలకు వైరస్ ను అడ్డుకునే శక్తి వుందో లేదో నిర్ధారించుకున్న తరువాతే సాగు ప్రారంభించాలి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *