మిర్చి రైతును ముంచిన వైరస్‌

ఈ ఏడాది మిర్చి రైతును వైరస్‌ దెబ్బ తీసింది. తామరపురుగు ద్వారా వ్యాపించిన వైరస్‌ మిర్చి దిగుబడిని దెబ్బతీసింది. మిర్చి సాగుకు ప్రసిద్ధి చెందిన వరంగల్‌ జిల్లాలో దీనివల్ల 30ు దిగుబడి తగ్గిందంటున్నారు రైతులు
మిర్చి దిగుబడులను డిసెంబర్‌, జనవరి మాసాల్లో వచ్చిన తీవ్ర చలిగాలులు ఒక రకంగా దెబ్బతీస్తే, ఆ చలిగాలుల ప్రభావంతో విజృంభించిన వైరస్‌ రైతుకు తీవ్ర నష్టం చేకూర్చింది. ఖరీఫ్‌ ప్రారంభంలో సకాలంలో వర్షాలు రావడంతో రైతులు ఉత్సాహంగా మిర్చి సాగు చేశారు. ఏపుగా పెరిగే దశలో మిర్చి పంటవైరస్‌ బారిన పడింది. వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట, వర్థన్నపేట, ములుగు, ఏటూరునాగారం, పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లోని మిర్చి రైతులు వైరస్‌ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు.
తామర పురుగుతో వ్యాప్తి
ఏటా మిర్చి పంటకు సాధారణంగా వైరస్‌ రూపంలో అనేక రకాల తెగుళ్ళు సోకుతాయి. ఈసారి ప్రత్యేకంగా జెమినీ, కుకుంబర్‌ లాంటి వైర్‌సల ప్రభావం ఎక్కువైందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తామర పురుగు కుట్టడం వల్ల ఆకులు ముడుచుకుపోయాయి. ఆ తామర పురుగుల ద్వారా ఆ మొక్కలో వున్న వైరస్‌ ఇతర చెట్లకు వ్యాప్తి చెందింది. దీంతో మిర్చి పంట మొత్తంపై వైరస్‌ ప్రభావం పడుతున్నది. దీన్ని సకాలంలో గుర్తించకపోవడం, గుర్తించినప్పటికీ సరియైున మందులను వాడకపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందింది. కొందరు రైతులు వ్యవసాయ నిపుణులను సంప్రదించకుండా బయో మందులను విపరీతంగా పిచికారీ చేశారు. వాటివల్ల వైరస్‌ తగ్గకపోగా మరింత వ్యాప్తి చెందింది. డిసెంబర్‌, జనవరి మాసాల్లో చలితీవ్రత వల్ల కూడా దిగుబడులు తగ్గాయి. ఈ రెండు కారణాల వల్ల ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో ఎకరాకు 20 క్వింటాలు రావలసిన చోట 15 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందన్నారు రైతులు. అన్ని రకాల వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఎల్‌పీఏ- 625 లాంటి మరికొన్ని రకాలను వృద్ధి చేయడంతో పాటు, ఆ వంగ డాలను రైతులకు అందుబాటులో వుంచాలని వారు కోరుతున్నారు. అలాంటి వంగడాల గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే రైతుల్లో అవగాహన పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
 
ప్రతికూల వాతావరణతో వైరస్‌
విపరీతమైన చలి పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మిర్చికి వైరస్‌ సోకింది. ఆ వైరస్‌ తామర పురుగుల ద్వారా మిర్చి పంటకు వ్యాప్తి చెందింది.. దీనికి తోడు విపరీతమైన బయో మందులు వాడడం వల్ల వైరస్‌ నాశనం కాక పోగా వృద్ది చెందింది. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల రైతులు కొంతయినా పంటను కాపాడుకోగలిగారన్నారు ఏరువాక కేంద్రం కో ఆర్టినేటర్‌ ఉమారెడ్డి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *