యాపిల్‌ బేర్‌తో లాభాలసిరి

  • మామిడికి ప్రత్యామ్నాయంగా పెరుగుతున్న ఆదరణ
గ్రీన్‌ యాపిల్‌, గంగరేగి సంకరంగా రూపొందించిన కొత్త వంగడం యాపిల్‌ బేర్‌ పండు రైతులకు లాభాలు పండిస్తోంది. మెట్ట రైతుకు మామిడికి ప్రత్యామ్నాయ పంటగా ఇది మంచి ఆదరణ పొందుతోంది. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే వీలున్న యాపిల్‌బేర్‌ సాగు వేగంగా విస్తరిస్తున్నది.
కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలంలో యాపిల్‌ బేర్‌ సాగు క్రమంగా విస్తరిస్తున్నది. మామిడిరైతుకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా వుండటం, ఉద్యాన శాఖ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడంతో ఈ పంట సాగు వేగంగా విస్తరి స్తున్నది. ఈ పంటను అన్నిరకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. తెగుళ్ళను తట్టుకునే గుణం వుండటం, యాపిల్‌బేర్‌ కాయలు ఎక్కువ కాలం నిల్వ వుండే అవకాశం కూడా వుండటంతో రైతులు దీని సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
కొత్త రకం ఫలం కావడంతో వినియోగదారుల నుంచి కూడా దీనికి మంచి గిరాకీ ఉంది. ఎకరాకు 400 నుంచి 600 మొక్కల వరకు నాటుతున్నారు. ఈ మొక్కలు నాటిన ఆరు మాసాల్లో దిగుబడి ప్రారంభమవుతుంది. మార్చి, ఏప్రిల్‌, మే మాసాలు మినహా శీతాకాలం, వర్షాకాలాల్లో ఏడాదికి రెండు దిగుబడులను ఇస్తోంది. ఎకరాకు రూ.40 వేల పెట్టుబడి పెడితే 16 నుండి 24 టన్నుల దిగుబడి వస్తోంది.
యాపిల్‌బేర్‌ కాయలు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజి ధర రూ.50లు పలుకుతుండగా రైతులకు రూ.20లు చొప్పున గిట్టుబాటు అవుతోంది. దీన్నిబట్టి చూస్తే ఏళ్ళు గడిచేకొద్దీ దిగుబడి పెరగడంతో పాటు రైతులకు నికరలాభం పెరుగుతోంది. కేజీకి రూ.20లు ధర పలికితే ఎకరాకు ఏటా మూడు నుండి నాలుగు లక్షల రూపాయల వరకూ ఆదా యం లభిస్తోందని రైతులు చెప్తున్నారు. నాటిన మొక్కలు 20 ఏళ్ళ వరకు దిగుబడిని ఇస్తాయంటున్నారు. ఉద్యానవన శాఖ కూడా ఈ పంట సాగుకు హెక్టార్‌కు రూ.14వేల వరకు రాయితీ ఇవ్వడంతో పాటు డ్రిప్‌ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.
‘‘యాపిల్‌బేర్‌ వంగడాన్ని జంగారెడ్డిగూడెం నుంచి తెచ్చి ఆరుమాసాల కిందట సాగు చేపట్టా. ఇప్పటికి నెలరోజుల నుంచి కాపు వస్తోంది. చిన్నచెట్లకే 10 నుండి 30 కేజీల వరకు దిగుబడి వస్తోంది. ఎకరాకు 600 మొక్కలు సాగుచేశా. అందులో బంతి, వంగ వంటి ఆరుతడి పంటలు కూడా వేశాను. తోట ఐదేళ్లు పెరిగేసరికి ఎకరాకు 50 టన్నులు దిగుబడి వచ్చేలాగా ఉంద’’న్నారు కనసానపల్లి రైతు ఆలూరి సాంబశివరావు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *