యాసంగిలో వరి సిరి

  • వరికి అగ్గితెగులు ముప్పు
తెలంగాణలో ఏటా యాసంగిలో 6.14 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగవుతుంది. ఇప్పటి కే కొందరు రైతులు నాట్లు పూర్తి చేశారు. మరి కొన్నిచోట్ల నారుమళ్లు సిద్ధమవుతున్నాయి. చలి తీవ్రంగా వున్న ప్రస్తుత తరుణంలో నారుమళ్లకు అగ్గితెగులు సోకే ప్రమాదం వుందంటున్నారు నిపుణులు. వరి సాగుకు ఏ వండగాలు ఉత్తమం? నారును ఎలా పెంచాలి? వరిలో అధిక దిగుబడులు సాధించేందుకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలనే అంశాలపై సమగ్ర కథనం.
యాసంగిలో రైతాంగం ఎక్కువగా సాగుచేసే వరి రకాలలో తెలంగాణ సోన (ఆర్‌.ఎన్‌.ఆర్‌. 15048), కునారం సన్నాలు (కె.ఎన్‌.ఎమ్‌ 118), బతుకమ్మ (జె.జి.యల్‌ 18047), శీతల్‌ (డబ్ల్యు.జి.ఎల్‌. 283), కాటన్‌ దొర సన్నాలు (ఎం.టి.యు 1010), ఐ.ఆర్‌. 64, తెల్లహంస, జగిత్యాల సాంబ (జె.జి.ఎల్‌. 3844) వంటి రకాలు అతి ముఖ్యమైనవి.
రాష్ట్రవ్యాప్తంగా వరినార్లు సిద్ధమవుతున్నాయి. కొన్ని చోట్ల నాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ తరుణంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఆర్‌. జగదీశ్వర్‌ చేస్తున్న సూచనలివి.
డిసెంబర్‌ రెండవ పక్షంలో చలి తీవ్రత పెరిగినందువల్ల, రాత్రివేళలో మంచుపడి పంటకు అగ్గి తెగులు సోకే అవకాశం ఉంది.
దీనికితోడు ఇంకా నారుమడి దశలో ఉన్న మొక్కలు సరిగ్గా ఎదగక నాట్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని రైతులు నారుమడిలో, ప్రధాన పొలంలో ఈ చర్యలు తప్పకుండా పాటించాలి. చలివలన నారు ఎదుగుదల లోపించడం, నార్లు ఎర్రబడడం సర్వసాధారణం, కాబట్టి నార్లను కాపాడటానికి సన్నటి పాలిథిన్‌ పట్టాను కర్రలతో లేదా ఊచలతో అమర్చాలి. రాత్రివేళలో కప్పి ఉంచి మరునాడు ఉదయాన్నే తీసివేసినట్లయితే వేడి వలన నారు త్వరగా పెరిగి, 3-4 వారాలలో ఆకులు తొడుగుతుంది.
రాత్రివేళలో నారుమడిలో సమృద్ధిగా నీరు ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసివేసి ఉదయం 10-11 గంటల మధ్య నీటిని పెట్టినట్లయితే నారు ఎదుగుదల బాగుంటుంది. నారుమడిలో జింక్‌ లోప లక్షణాలు కనిపించిన వెంటనే జింక్‌ సల్ఫేట్‌ 2.0 గ్రాములు, లీటరు నీటికి కలిపి అవసరం మేరకు 1-2 సార్లు ఐదు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు పైపాటుగా వేసే యూరియాతో (2.5 కిలోలు) పాటు కార్బండాజిమ్‌ 25 శాతం + మాంకోజెబ్‌ 50 శాతం కలిగిన మిశ్రమ శిలీంధ్ర నాశకాన్ని 6.25 గ్రాములు పట్టించి నారుమడిలో వేయాలి.
అగ్గి తెగులు నివారణకు గాను ట్రైసైక్లజోల్‌ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రబీ పంట కాలంలో కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 15 రోజులకు 2 గుంటల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు వేసుకోవాలి. చలికి నారు ఎదగక ఆలస్యమైతే నాటువేసే వారం రోజుల ముందు మరొకసారి నారుమడిలో కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు వేసుకోవాలి.
కాండం తొలిచే పురుగుతో జాగ్రత్త
దాదాపు అన్ని రకాలలోనూ రబీలో ఆశించే కాండం తొలిచే పురుగు వల్ల ప్రతి రైతు ఎకరాకు 3-5 బస్తాల దిగుబడి నష్టపోయే అవకాశం ఉంది. ఖరీఫ్‌ పంట కాలంలో కూడా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల కాండం తొలిచే పురుగు ఆశించి తెల్ల కంకుల వల్ల రైతాంగం చాలా నష్టపోయారు. కాబట్టి రబీలో నారుమడి దశ నుంచే అప్రమత్తంగా ఉండాలి. ముదురు ఎండుగడ్డి లేదా పసుపు రంగులో ఉండే రెక్కల పురుగులు లేత నారుకొనల మీద గోధుమరంగు ముద్దల వలె గుడ్లు పెడతాయి. ప్రధాన పొలంలో పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోవడం, అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్లకంకులు రావటం గమనిస్తూ ఉంటాం.
ఎకరాకు సరిపడే నారుమడిలో ఒక లింగాకర్షక బుట్ట (2-3 గుంటలకు ఒక బుట్ట) అమర్చి కాండం తొలిచే పురుగు ఉధృతి గమనించాలి. అలాగే ప్రధాన పొలంలో ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలు అమర్చి వారానికి బుట్టకు 25 మగ రెక్కల పురుగులు పడిన వెంటనే పిలక దశలో సస్యరక్షణ చేపట్టాలి. ఈ దశలో ఎసిఫేట్‌ 75 ఎస్‌పి 1.5 గ్రాములు (300 గ్రాములు/ఎకరాకు) లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 ఎస్‌పి 2 గ్రా. (400 గ్రా./ఎకరాకు) లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.4 శాతం గుళికలు 4 కిలోలు/ఎకరాకు లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 4జి గుళికలు ఎకరాకు 8 కిలోలు వాడుకోవాలి.
అంకురం నుండి చిరుపొట్ట దశలో తప్పనిసరిగా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 50 ఎస్‌.పి 2 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.3 మిల్లీలీటర్లు /లీటరు నీటికి చొప్పున ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణం తయారుచేసుకుని పిచికారీ చేయాలి. అగ్గి తెగులు నివారణకు గాను ట్రైసైక్లజోల్‌ 0.6 గ్రా. లేదా ఇసోప్రోథయోలెస్‌ 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధితో వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకుని రెండుసార్లు పిచికారీ చేయాలి.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, హైదరాబాద్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *