రాతి నేలపై రతనాల పంటలు

  • ఏడు గిరిజన గూడాల్లో నవచైతన్యం
ప్రకృతిని సవాలు చేస్తూ రాతినేలపై అద్భుతమైన పంటలు పండిస్తున్నారు ఈ గిరిజన రైతులు. చైనా, వియత్నం, కంబోడియా దేశాల్లో మాత్రమే కొండలు, గుట్టలను తొలిచి పంటలను పండిస్తున్నారు. వారిని తలదన్నే రీతిలో రాతినేలపై సేంద్రియ సేద్యం చేస్తూ శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తున్న ఆసిఫాబాద్‌ గిరిజన రైతుల స్ఫూర్తిగాథ.
కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం మాణిక్యాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో గల గుండాల అటవీ ప్రాంతం అది. పది కిలోమీటర్లు కాలినడక అడవుల గుండా వాగులు.. వంకలు.. గుట్టలు ఎక్కిదిగితే కానీ అక్కడికి చేరుకోలేం. ఆ ప్రాంతంలోని అర్జిగూడ, లచ్చిపటేల్‌గూడ, దొడ్డిగూడ, దాబాగూడ, చిక్కలగూడ, రాజుగూడ, గుడివాడ గ్రామాల పరిధిలో నేలంతా పరుపురాయి పరుచుకుని వుంటుంది.
15 ఏళ్ల క్రితం ఇక్కడ సాగు భూమి కాదుకదా కనీసం గడ్డి కూడా మొలిచే పరిస్థితి లేదు. ఇదే గ్రామానికి చెందిన ఓ విద్యాధికుడు సోయం బొజ్జిరావు గిరిజనుల దుర్భర జీవితాల్ని గమనించి చలించిపోయాడు. విదేశాల్లో కొండలపై జరుగుతున్న వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు.
రాతి నేలపై పంటలు ఎందుకు పండించకూడదన్న ఆలోచన రావడంతో దీనిపై ప్రయోగాత్మకంగా ముందు కొంత విస్తీర్ణంలో ఆచరణలో పెట్టి విజయం సాధించారు. దాంతో ఊరంతా ఈ తరహా సేద్యం చేయడానికి ముందుకొచ్చి బొజ్జిరావుతో చేతులు కలిపారు. దూరప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై మట్టిని తరలించుకొచ్చి రాతి నేలపై దాదాపు అడుగున్నర మందంతో నింపారు.
మొత్తం విస్తీర్ణాన్ని మడులుగా విభజించి నీటిని తట్టుకునే వరి వంగడాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టారు. మొదటి ఏడాది ఆశించిన దానికంటే అధిక దిగుబడులు రావడంతో మరుసటి ఏడాది నుంచి రెట్టించిన ఉత్సాహంతో మరింత మట్టిని తీసుకువచ్చి అందుబాటులో ఉన్న పశువుల పేడను ఉపయోగించి తమ పొలాలను సారవంతమైన నేలలుగా తీర్చిదిద్దారు.
ఇలా యేటా ఖరీఫ్‌, రబీ సీజన్‌ల ఆరంభానికి ముందు తమ దుక్కులను తయారుచేసుకుని సంప్రదాయ పంటలన్నీ సాగు చేస్తూ ఆకలిని జయించారు ఆ ప్రాంత గిరిజనులు. వర్షాకాలంలో అందుబాటులో ఉండే నీటిని నిలువ చేసుకుని ఖరీఫ్‌, రబీలో వరి, మొక్కజొన్న, శనగ, జొన్న, కంది వంటి పంటలే కాకుండా నిరంతర ఆదాయాన్ని సమకూర్చే కూరగాయల జాతికి చెందిన పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ గ్రామంలో మొత్తం 180 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. సగటున ఎకరాకు 12 నుంచి 20 బస్తాల వరకు పూర్తి సేంద్రియ ఎరువులను ఉపయోగించి సాగు చేయడం విశేషం.
ఆ ప్రాంత గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన బొజ్జిరావు అకాలమరణం పాలయ్యారు. అయినా ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు గిరిజన రైతులు. వందకు పైగా ఎకరాల్లో వరి, మక్క, పెసర ఖరీఫ్‌ పంటలతో పాటు కంది, పెసర, శనగ, జొన్న పంటల్ని రబీ పంటలుగా పండిస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన మైసమ్మ చెరువు నీటిని పూరి స్థాయిలో వినియోగించుకొంటున్నారు.
బొజ్జిరావు కృషిని గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ 250 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆయన పేరుతో ఒక కుంటను నిర్మించింది. రెండు చెక్‌ డ్యాంలను నిర్మించింది. ఇక్కడి రైతుల పట్టుదలను గుర్తించి దాన్‌ ఫౌండేషన్‌ సంస్థ వారు గ్రామాన్ని దత్తత తీసుకొని స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టారు. అయిదు రైతు క్లబ్‌లను ఏర్పాటుచేసి వ్యవసాయ రంగంలో మరింతగా ప్రోత్సహిస్తున్నారు.
అన్నానికి ఢోకా లేదు
మునుపు మా ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే ఒక పూట తిండి పెట్టే శక్తి మాకు ఉండేది కాదు. బొజ్జిరావు మాకు అన్నం పెట్టిండు. రాళ్ల భూముల్లో ఎలా పంటలు పండించాలో చూపించాడు. మా ఎడ్లబండ్లతో వేరే చోటు నుంచి మంచి మట్టి తెచ్చి పొలంలో పోసుకుని చెరువు నీటి పదును పెట్టి వరి పంట కూడా బాగా పండిస్తున్నాం. ఇంట్లో అందరికీ పని దొరుకుతుంది.
-మర్సుకోల తిరుపతి, గ్రామస్తుడు
బొజ్జిరావు స్పూర్తితో..
మా గ్రామ యువకుడు బొజ్జిరావు చూపిన మార్గంలో రాళ్ల భూముల్లో అడుగు మందం మట్టి పోసి మంచి పంటలు పండించుకుంటున్నాం. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరి ధాన్యం పండిస్తున్నాం. పత్తి పంట కూడా వేస్తున్నాం. చెరువు నీటిని వాడుకొని మక్క పంట వేస్తున్నాం. ఈ భూముల్లో రబీలో కంది, పెసర, జొన్న పంటలు పండిస్తున్నాం.
– కోవ హన్మంతు, గ్రామ పటేల్‌, గుండాల
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఆసిఫాబాద్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *