రైతును పీల్చేస్తున్న గులాబీ పురుగు

  • పత్తి మనుగడకే ముప్పంటున్న శాస్త్రవేత్తలు
ఈ ఏడాది పత్తి రైతు ఆశలను గులాబీ పురుగు భగ్నం చేసింది. లక్షలు ఖర్చు చేసి పండించిన పంటకు రైతులు పొలంలోనే నిప్పుపెడుతున్నారు. పత్తి పంటలో, చివరకు తీసిన పత్తిలో అయినా గులాబీ పురుగు అవశేషాలుంటే వచ్చే ఏడాది వేసే పంటను కూడా ఈ పురుగు దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు.
పత్తి రైతులను ఈ ఏడాది గులాబీ పురుగు తీవ్ర సంక్షోభంలో పడేసింది. ఏపుగా కాసిన పంట కాయల్లో గులాబీ పురుగు గుడ్లను చేసి పంటను నాశనం చేసింది. వడ్డీలకు అప్పులు తెచ్చి, పత్తి సాగు చేసిన రైతన్న అదే పంటను ఇప్పుడు పొలంలోనే కాల్చివేస్తున్నాడు. పంట చేతికందాల్సిన సమయంలో చెట్టుకు 50 నుంచి 100 కాయలున్నా ప్రతికాయలో గులాబీ పురుగు చొరబడి లోపల పత్తిని మొత్తం తినేస్తున్నది. పెట్టుబడి రాకున్నా కనీసం కూలీ డబ్బులన్నా మిగులుతాయనుకుంటే గులాబీ పురుగు కారణంగా ఆ ఆశలూ అడుగంటాయి. పత్తికి గులాబీ రంగు, రసం పీల్చే తెగులు సోకింది. పత్తి ఏపుగా పెరిగి పూత దశకు చేరుకున్న సమయంలో గులాబీ పురుగు, తెగులు సోకడంతో రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నారు. గులాబీ పురుగు, రసం పీల్చే తెగుళ్లతో పంట దెబ్బతినగా చేతికందిన కొద్దిపాటి పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఎకరం పత్తి పంటకు 30 నుంచి 40వేల పెట్టుబడులు పెట్టారు రైతులు. ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా గులాబీ పురుగు, తెగుళ్లు కారణంగా కేవలం 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట సరిగా లేకపోవడంతో గిట్టుబాటు ధర కూడా రాలేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ‘బీటీ పత్తిలో 120 రోజుల తర్వాత గులాబీ రంగు పురుగు వస్తుంది. ఇది క్యాన్సర్‌ లాంటిది. మొగ్గదశలో రెక్కల పురుగు గుడ్డు పెడుతుంది. ఆ పురుగు అండాశయంలో చొరబడి కాయలో ఉన్న మొత్తం గుజ్జును తింటుంది. దాంతో అపరిపక్వ దశలో కాయ పగిలి గుడ్డి పత్తి వస్తుంది. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంద’న్నారు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ బోడ విజయ్‌. ‘బీటీ పత్తిని నాటే ముందు నాన్‌ బీటీని చుట్టూ నాలుగు వ రుసలు నాటాలి. కాని ఆ పని ఏ ఒక్క రైతు చెయ్యలేదు. దీంతో బీటి పైనే గులాబీ రంగు తల్లిపురుగు వచ్చి చేరి బీటీని తట్టుకునే శక్తి వచ్చింది. జనవరిలో వచ్చే గులాబీ రంగు పురుగు నవంబర్‌లోనే వచ్చింది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింద’న్నారు ఏరువాక కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉమారెడ్డి.
‘ఖరీఫ్‌లో ఎకరానికి రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. ఇప్పటివర కూ రెండు క్వింటాళ్ల పత్తిని మాత్రమే తీశా. పత్తి చేనులో ఎక్కడా చూసినా గులాబీ రంగు పురుగుతోపాటు లద్దె పురుగు ఎక్కువగా వుంది. ఎనిమిదేళ్ల నుంచి సాగుచేస్తున్నా. ఇంత దారుణం ఎన్నడూ లేద’న్నారు ఊరుగొండ గ్రామ రైతు జనుపాల రమేష్‌.
గులాబీ పురుగుకు చెక్‌ ఇలా
జనవరిలో పత్తి పంటను తొలగించి, మరో పంట వేసుకోవాలి.
తొలగించిన పత్తి చెత్తను కాల్చివేయాలి.
వేసవిలో లోతు దుక్కులు వేసుకోవాలి. దీంతో భూమిలో నిద్రావస్థలో ఉన్న గులాబీ రంగు పురుగు లార్వా వేడికి చ నిపోతుంది.
పత్తి మిల్లుల్లో నాసిరకం పత్తి పడేయకుండా కాల్చేయాలి. పత్తి మిల్లు ఆవరణలో లింగాకర్షణ బుట్టలు పెట్టి రెక్కల పురుగును అదుపు చేయాలి.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ రూరల్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *