వరికి సిరి.. అజొల్లా

వరి మాగాణుల్లో నారు నాటిన 10-15 రోజుల తర్వాత 200 కిలోల అజొల్లాను పొలంలో చల్లితే అజొల్లా పెరిగి, వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తుంది.
 
దీనివల్ల రైతులు వేయ
వలసిన నత్రజని ఎరువులను 25 శాతం వరకు తగ్గించుకోవచ్చంటున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అజొల్లా అనేది నీటిలో పెరిగే ఫెర్న్‌ మొక్క. అజొల్లాలో అనలీనా అనే నీలి ఆకుపచ్చ నాచు బాక్టీరియా ఉండి, వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తుంది. ఆ విధంగా వరి పొలంలో నత్రజనిని అందిస్తుంది. వరి మాగాణుల్లో అజొల్లా వాడకం వల్ల వాతావరణ కలుషిత కారకమైన మిథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువులు వెలువడడం తగ్గుతుంది.
ఈ మధ్య కాలంలో అజొల్లాను పశువుల దాణాగా, కోళ్ల మేతగా కూడా వాడుతున్నారు. తడి అజొల్లాను కోళ్ల మేతగా వాడినప్పుడు ప్రతి కోడి మీద రోజుకి 20 పైసలు వంతున ఖర్చు తగ్గుతుంది. అజొల్లాను పశువుల దాణాగా వాడితే పాల దిగుబడి 15-20 శాతం పెరుగుతుందని, పాలలోని కొవ్వు 10 శాతం పెరిగినట్లు గుర్తించారు. అలాగే పాలల్లో ఎస్‌ఎస్ ఎఫ్‌ 3 శాతం పెరుగుతుంది. కోళ్ల మేతలో వాడినప్పుడు వచ్చే గుడ్లలో ఆల్బుమిన్‌, గ్లాబ్యులిన్‌, బీటాకెరోటిన్‌ మోతాదు ఎక్కువగా ఉంటుంది.
పశువుల దాణాగా, కోళ్ల మేతగా వాడుతున్న అజొల్లాలో 25-30 శాతం ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, లవణాలు, విటమిన్లు, బీటా కెరోటిన్‌ వంటి పశువులకు అత్యంత అవసరమైన మూలకాలు ఉంటాయి. మేతలో అజొల్లాను వాడినప్పుడు కోళ్లు బరువు పెరగడం, గుడ్లు పెరగడం పరిశోధనల్లో తేలింది. కోళ్లకు అజొల్లాను మేతగా వాడినప్పుడు వచ్చే గుడ్లలో బీటా కెరోటిన్‌, ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అజొల్లా వాడకం వల్ల కోళ్లు వ్యాధులను తట్టుకునే గుణం పెరుగుతుందని చెబుతున్నారు.
పురుగులు, తెగుళ్ల ఉధృతి అజొల్లాలో తక్కువ. బెడ్‌లో అజొల్లా ఎక్కువగా ఉన్నట్లైతే పురుగులు, తెగుళ్లు వచ్చే అవకాశం తక్కువ. పురుగుల నివారణకు 5ఎంఎల్‌ వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల నివారణకు సూడోమోనాస్‌ ప్లోరసెన్స్‌, ట్రైకోడెర్మ విరిడిలను 100 గ్రాములు చొప్పున వాడాలి. అజొల్లా నీడ ఉన్న ప్రాంతంలో వేయాలి. ప్రతి రోజు కలియతిప్పుతూ 2-5 సెంటీమీటర్ల నీళ్లు నిల్వ ఉండేలా చూడాలి. ప్రతి 10-15 రోజుల తర్వాత 2/3 భాగాలు తీసి వాడుకోవాలి.
వరిలో నీరు తీసినప్పుడు అజొల్లా మట్టిలో కలిసిపోయి సేంద్రియ పదార్ధంగా ఉపయోగపడుతుంది. అజొల్లా కలుపు మందులను తట్టుకోలేదు. కావున వరి పొలాల్లో వేసేటప్పుడు కలుపు మందులు వాడిన 3-4 రోజుల తర్వాత అజొల్లా వేసుకోవాలి. అజొల్లా దిగుబడి వర్షాకాలం, శీతాకాలం ఎక్కువ. వేసవిలో తక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *