వరినాటే యంత్రం..

  • 30 శాతం ఆదా..
  • ఎకరంలో నాట్లకు 3 వేల అద్దె
డీజిల్‌ సహాయంతో బురదలో నడిచే ఈ వరినాటు యంత్రం (ప్యాడీ ట్రాన్స్‌ప్లాంటర్‌) ఐదెకరాలకు పైగా భూమి వున్న రైతులకు ప్రయోజనకరం. కూలీల కొరతను అధిగమించడం, ఉత్పత్తి ఖర్చు తగ్గడంతో పాటు ఈ యంత్రం వల్ల 20 శాతం దిగుబడి అధికంగా వస్తున్నది. రోజుకు ఈ యంత్రం ఆరెకరాల పొలంలో వరి నాటుతుంది. ఇరవై సెంటీమీటర్ల దూరంతో వరినాటును క్రమం తప్పకుండా బురదలో వేస్తుంది.
కూలీల కంటే ఖర్చు తక్కువ
మాములుగా కూలీలతో పొలంలో వరినాటు వేయడానికి ఎకరానికి రూ.4500 నుంచి రూ.5000 వేలు ఖర్చు అవుతుంది. యంత్రం సహాయంతో నాటు వేయడం ద్వారా ఎకరానికి రూ.3 వేలు అద్దె చెల్లిస్తే సరిపోతుంది. కూలీలతో పోల్చి చూస్తే రూ.1500లు రైతుకు మిగలడమే కాకుండా కూలీల సమస్యను అధిగమించవచ్చు. దుక్కి దున్ని పొలాన్ని దమ్ము చేసుకున్న తర్వాత వరి నాటే రోజున నలుగురు కూలీల సహాయంతో ఈ యంత్రంతో రోజుకు ఆరెకరాల నారు నాటుకోవచ్చు.
నారును సిద్ధం చేసుకోవడం ఇలా…
యంత్రానికి అవసరమైన నారును ముందుగానే ప్రత్యేకంగా ఎర్రమట్టి, గొర్రెలు-పశువుల ఎరువుతో పాటు మరికొన్ని సేంద్రియ ఎరువులను వినియోగించి ట్రేలలో నారును పెంచాలి. మట్టిని సన్నగా చేసి ట్రేలో ఎంత మోతాదులో మట్టి వేయాల్సి ఉంటుందో అంతే మోతాదులో ట్రేల్లోని గదులను పూర్తిగా ఎరువుల మిశ్రమంతో నింపాలి. ఎర్రమట్టి, గొర్రెలు, పశువుల ఎరువు, ఇతర సేంద్రియ ఎరువులను సన్నని పొడిగా మార్చేందుకు ప్రత్యేకంగా గిర్ని (మర) ఉంటుంది. ఇది వరి నాటే యంత్రం వెంటే వస్తుంది.
యంత్ర యజమాని ఇచ్చిన సలహాలు, సూచనల ప్రకారం ఎరువుల మిశ్రమాన్ని తయారుచేసుకుని వరి విత్తనాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగానే ఎన్ని ఎకరాల్లో వరి నాటు వేస్తారో ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. దాని మేరకు అవసరమైన ట్రేలను సమకూరుస్తారు. ఎరువుల మిశ్రమంతో నింపిన తర్వాత ట్రేలను మరో యంత్రం వద్ద ఉంచుతారు. ఆ యంత్రంలో వరి విత్తనాలు పోస్తారు. ఒక్కో ట్రేలో ఎన్ని విత్తనాలు అవసరమో ఆ మేరకు విత్తనాలను ఆటోమెటిక్‌గా తీసుకుంటుంది.
సబ్సిడీ ఇస్తే రైతులు రెడీ
తొలిసారిగా యాసంగి సీజన్‌లో వరినాటు యంత్రంతో ప్రయోగం చేశాను. ఇది విజయవంతమైతే వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కల్లా రెండు యంత్రాలను కొనుగోలు చేస్తాను. విదేశాలల్లో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. యంత్రం ఖరీదు ఎక్కువగా వుంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే పలువురు రైతులు దీనిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు.
– వి.యాదగిరిరెడ్డి, పెద్దారెడ్డిపేట గ్రామ రైతు, పుల్‌కల్‌ మండలం
వరి నాట్లు వేసేందుకు సరికొత్త యంత్రం అందుబాటులోకి వచ్చింది. కూలీల కంటే తక్కువ ఖర్చుతో నాట్లు వేసే ఈ యంత్రం ఖరీదు 28 లక్షలు రూపాయలు. రోజుకు ఆరెకరాల పొలంలో వరి నాటే ఈ యంత్రం రైతులకు వరం అంటున్నారు నిపుణులు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *