వేపపిండి కలిపిన యూరియా మేలు

  • యాసంగిలో వరి నాట్లకు, నాట్లు పూర్తయిన పొలాల్లో కలుపు తీసేందుకు, అంతర కృషికి, సస్యరక్షణకు రైతులు సమాయత్తమవుతున్నారు.
  • ఈ తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆచార్య జయశంకర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల సూచనలివి.
స్వల్పకాలిక వరి రకాలకు నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, నాటడానికి ముందు దమ్ములోను, బాగా దుబ్బుచేసే దశలోను, అంకురం తొడిగే దశలోను, బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి 36-48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. మధ్య, దీర్ఘకాలిక రకాలకు నాలుగు దఫాలుగా 15-20 రోజులకు ఒకసారి నత్రజనిని వేయాలి. నత్రజనిని చివరి దఫా అంకురం దశలో వేయాలి, ఆ తర్వాత వేయకూడదు. యాసంగిలో తెలంగాణలలో ఎకరానికి 48 నుంచి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్‌ వాడాలి. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న వేప పూసిన యూరియాని వాడుకోవాలి. లేకపోతే 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి కలిపి 24 గంటల తర్వాత వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. ఆ తరువాత కాంప్లెక్స్‌ రూపంలో వేయకూడదు. పొటాష్‌ ఎరువును రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. చల్కా (తేలిక) భూముల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి. జింకు ధాతు లోపం వల్ల పై నుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివర్లలో, మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా, పెళుసుగా మారుతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని సవరణకు ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేకపోతే ప్రతి రబీ సీజన్‌లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేటు వేయాలి లేదా 10 కిలోల జింక్‌ సల్ఫేట్‌ను 200-250 కిలోల పశువుల పేడతో కలిపి వేయాలి.
నత్రజనితో సుడిదోమకు చెక్‌
సన్న రకం వరికి సుడిదోమ ప్రధాన సమస్య మారింది. గత ఖరీ్‌ఫలో ఈ దోమ కారణంగా ఎంతో నష్టపోయాం. ఈ దోమను అరికట్టి వరిలో అధిక దిగుబడులు సాధించడం ఎలా?
– త్రిపురారం రైతులు
యాసంగిలో వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ రైతులు సన్న రకాల సాగు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షా 30వేల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. యాభై శాతం విస్తీర్ణంలో సన్న రకాల సాగు అయిందని అంచనా. సన్న రకాలకు సుడి దోమ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం నీరు అధికంగా పారించడం, వరి హైబ్రిడ్‌ విత్తనోత్పత్తి చేపట్టడం, పురుగు ఉధృతి తట్టుకునే రకాలు సాగు చేయకపోవడం, నత్రజని ఎరువులు అధికంగా వాడటం, తక్కువ ఉష్ణోగ్రతలు (25-30 డిగ్రీలు) ఉక్కపోత వాతావరణం, గాలిలో అధిక తేమ ఉండటం ప్రధాన కారణాలు. సన్నాలు సాగు చేసిన రైతులు వరిలో రెండు మీటర్ల వరకు ఒకసారి 20 సెంటీమీటర్ల కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి. నత్రజని ఎరువులు మూడు నాలుగు దఫాలుగా వేసుకుంటే సుడి దోమను అరికట్టవచ్చు.
– డాక్టర్‌ శంకర్‌, కెవికె శాస్త్రవేత్త
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, త్రిపురారం
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *