వేప కషాయంతో కాయ ఈగకు చెక్‌

వివిధ పంటల సంరక్షణకు రైతులు ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ రైతాంగానికి ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ దిగువ సూచనలు చేస్తున్నారు.
కంది పంటను శనగపచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఆశిస్తోంది. వీటి నివారణకు నొవాల్యురాన్‌ ఒక మి.లీ. లేదా ఇనూమెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రా. లేదా కోరాజన్‌ 0.3 మి.లీ. లేదా ఫ్లూబెంటామైడ్‌ 0.2 మి.లీ. లేదా స్పైనోసాడ్‌ 0.3 మి.లీ. లేదా ఇండాక్సికార్బ్‌ 0.75 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పురుగు మందులు మార్చి మార్చి పిచికారీ చేసి నివారించుకోవచ్చు.
పంటలో మారుకా మచ్చల పురుగు గూళ్లు గనుక ఎక్కువగా గమనించినట్లయితే పై మందులకు 1.0 మి.లీ. నువాన్‌ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. రెండు సంవత్సరాల నుండి పిందె, కాయ దశలో కాయ ఈగ ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. కాయ ఈగ ఆశించినపుడు నష్టం బయటకు కనిపించదు. కాబట్టి పిందె దశలో ఐదు శాతం వేపగింజల కషాయం పిచికారీ చేసినట్లయితే తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. పిందె దశలో థయాక్లోప్రిడ్‌ 0.7 మి.లీ. లేక డైమిథోయేట్‌ 2.0 మి.లీ. లేక ప్రొఫెనోఫాస్‌ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరిలో కలుపు నివారణకు బ్యూటాక్లోర్‌ 50 శాతం ఇ.సి. 1 నుండి 1.5 మిల్లీలీటర్లు లేదా అక్సాడయార్టిల్‌ 35 గ్రాములు లేదా ప్రిటిలాక్లోర్‌ 50 శాతం ఇ.సి. 500 మి.లీ. లేదా పైరజో సల్ఫ్యూరాన్‌ 80 గ్రా. ఏదో ఒక దానిని ఎకరానికి 20 కిలోల పొడి ఇసుకతో కలిపి నాటిన మూడు నుండి ఐదు రోజులలో పలుచగా నీరు ఉంచి పొలంలో సమానంగా వెదజల్లాలి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *