వేసవిలో చల్లదనాల తివాచీ

ఆకర్షణతో పాటు ఆహ్లాదాన్ని పంచే ఇండోర్‌ క్రోటన్స్‌ మొక్కలు ఇల్లు, కార్యాలయాల అందాలను పదింతలు చేస్తున్నాయి. ప్రశాంతతను కలిగించడంతో పాటు గాలిని శుద్ధి చేసే గుణాలుండటంతో ఇలాంటి మొక్కలకు ఆదరణ పెరుగుతున్నది.
వేసవిలో ఇల్లు చల్లగా వుండేందుకు తోడ్పడే ఈ మొక్కలకు నర్సరీల్లో భలే గిరాకే వుంది. ఇండోర్‌ క్రోటన్స్‌ మొక్కలను సంవత్సరాల తరబడి మట్టి, గాజు, పింగాణీ కుండీల్లో పెంచుకోవచ్చని, కొద్దిపాటి నీరు పోస్తే వాటంతట అవే పెరుగుతాయంటున్నారు నర్సరీ నిర్వాహకులు.
క్లోరో ఫైటమ్‌: క్లోరో ఫైటమ్‌ మొక్కలను ఇంటి ముందు చిన్న మట్టి కుండీలను వేలాడదీసి, వాటిలో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కలను బాత్రూమ్‌లో కూడా పెంచుకుంటారు. క్లోర్‌ఫైటమ్‌ మొక్కలు ఆక్సిజన్‌ విడుదల చేస్తాయి. ఇవి తీగల రూపంలో పొడవుగా పెరుగుతాయి. రోజుకు ఒకసారి నీళ్లు పోసి, నెలలో ఒకసారి ఆకులను కత్తిరించుకుంటే సరిపోతుంది.
సాంగ్‌ ఆఫ్‌ ఇండియా: ఈ మొక్కలు నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఇళ్లలో ఈ మొక్కలు పెంచుకుంటే కనులకు ఇంపుగా వుంటుంది. ఇంట్లో పచ్చదనాల తివాచీ పరిచినట్లు వుండే ఈ మొక్కను పర్యావరణ ప్రేమికులు అమితంగా ఆదరిస్తున్నారు.
ఫిలోడెండ్రన్‌: ఈ మొక్కలు రెండు అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఇంటితో పాటు కార్యాలయాల్లో ఈ మొక్కలను పెంచుకుంటే ఇంటి స్వరూపమే మారిపోతుంది. నెలలో ఒకసారి వీటి ఆకులను ట్రిమ్‌ చేసుకుని, రోజుకు కాసిని నీళ్లు పోస్తే ఈ మొక్క నిత్యనూతనంగా వుంటుంది.
వీటితో పాటు డ్రెసినా, పెట్నోక్రోటన్‌, వాటర్‌ హోల్‌కోనియాస్‌, బాంబూగ్రాస్‌ లాంటి పలు రకాల ఇండోర్‌ క్రోటన్స్‌ మొక్కలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సత్యనారాయణ నర్సరీ గార్డెన్స్‌ ప్రతినిధి అలఖ్య. తమ వద్ద 500 రకాల ఇండోర్‌ మొక్కలు అందుబాటులో వున్నాయన్నారామె.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *