సహజ ఎరువుల మోహనుడు!

  • ఆదర్శంగా నిలుస్తున్న కొత్తగడి రైతు
సేంద్రియ సేద్యం మాత్రమే నేలతల్లితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందని బలంగా నమ్మడంతో పాటు దాన్ని ఆచరణలో పెట్టి, సత్ఫలితాలు సాధిస్తున్నారు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని కొత్తగడికి చెందిన మోహన్‌రెడ్డి.
డిగ్రీ చదివిన మోహన్‌ రెడ్డి వ్యవసాయ మీద ఉన్న ప్రేమతో ఉద్యోగాన్ని వదులుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో సాగు పద్ధతుల్ని అధ్యయనం చేశారు. సేంద్రియ సేద్యం మాత్రమే రైతుకు మేలు చేస్తుందని భావించారు. సేంద్రియ పద్ధతిలో టమాట, క్యారెట్‌, బీర, కాకర, బొప్పాయి, వంకాయ, కాలీప్లవర్‌, క్యాబేజి తదితర పంటల సాగు చేపట్టారు. గత ఏడాది ఎకరంలో 40 టన్నుల టమాటా దిగుబడి సాధించానన్నారు మోహన్‌రెడ్డి. వేస్ట్‌ డీ కంపోస్ట్‌ బాక్టీరియా, జీవామృతాలతో సేద్యం చేస్తున్నారాయన. సేంద్రియ సాగుతో రైతుకు పెట్టుబడి ఖర్చులో 70 శాతం తగ్గుతుంది.
అంతేకాకుండా సేంద్రియంగా పండించే కూరగాయలు తినే వారిపై ఎలాంటి చెడు ప్రభావం వుండదు. పెట్టుబడి తగ్గడం వల్ల రైతుకు లాభం ఎక్కువగా వస్తుందంటారాయన. విలక్షణమైన ఆయన సాగు విధానాలు చూసేందుకు సాటి రైతులతో పాటు శాస్త్రవేత్తలు కూడా ఆయన క్షేత్రాన్ని సందర్శించడం విశేషం.
వేస్ట్‌ డీ కంపోస్ట్‌ బ్యాక్టీరియా అనేది ప్రస్తుతం కూరగాయల పంటలు సాగు చేసేవారికి వరంగా మారింది. దీన్ని రైతులు పొలంలోనే తయారు చేసుకోవచ్చు. ఒక మిల్లీలీటర్‌ మదర్‌ కల్చర్‌ నూనెను 200 లీటర్ల నీటిలో వేసి అందులో రెండు కిలోల బెల ్లం, పప్పుధాన్యాల పిండి వేయాలి. ఏడు రోజుల పాటు దీనిని నానబెట్టాలి. నానబెట్టే క్రమంలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
ఈ మిశ్రమాన్ని పొలాలపై పిచికారీ చేస్తే పంటలను ఆశించే చీడపీడలు పంటల దరిచేరవు. ముఖ్యంగా ఇది దోమపోటుకు బాగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని చెట్టు మొదట వేస్తే చెట్టు బలంగా పెరుగుతుంది.
సేంద్రియ సాగులో జీవామృతం అనేది చాలా కీలకం. జీవామృతం వాడటం వల్ల పంట ఏపుగా పెరుగుతుంది. పంటపై పిచికారీ చేస్తే చీడ పీడలు ఆశించవు అదే విధంగా మొక్క కాండం వద్ద జీవామృతం పోస్తే మొక్క ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిని రైతు ఇంటి వద్ద, పొలం వద్ద సులువుగా తయారు చేసుకోవచ్చు. 200 లీటర్ల నీటిలో 10 లీటర్ల గో మూత్రం, 10 కిలోల గోవు తాజా పేడ, 2 కిలోల బెల్లం వేసి కలపాలి. అదే విధంగా ఇందులో పప్పుధాన్యాల పిండి(ఏదైనా పప్పుధాన్యం), కొంత ఒరంగట్టు మట్టిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు నాలుగుసార్లు కలిపి 48 గంటలు నానబెట్టాలి. ఈవిధంగా తయారుచేసిన జీవామృతం మిశ్రమాన్ని నేరుగా చెట్లకు పిచికారీ చేయాలి. అదే విధంగా చెట్టు కాండం వద్ద్ద పోయవచ్చు.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *