సిరులిచ్చే వరి వంగడం

  • 20 శాతం అధిక దిగుబడి
  • సీసీఎంబీ శాస్త్రవేత్త సృష్టి
  • త్వరలో అందుబాటులోకి..
మనుషుల్లో మాదిరిగానే మొక్కల్లో కూడా జన్యువులు ఉంటాయి. వాటిని గుర్తించి మార్పులు చేయడం ద్వారా ఎక్కువ దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలనేది శాస్త్రవేత్తల ఆలోచన. మన దేశంలో మొక్కల జన్యువులపై పరిశోధనలు జరుపుతున్న సంస్థ సీసీఎంబీ ఒకటే!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంగడాలతో పోలిస్తే.. 20 శాతం అదనంగా దిగుబడినిచ్చే కొత్తరకం వరిని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ (సీసీఎంబీ) శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు. ఇది ఈ ఏడాది ఖరీఫ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ వంగడం తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. వీటి కోసం మన దేశంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సీసీఎంబీ కూడా మేలు రకం వంగడాల్లోని పది వేల రకాల జన్యువులను సేకరించి వాటి ద్వారా అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కొత్తరకం వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. ‘ప్రతి వరి రకంలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది.
ఉదాహరణకు కొన్ని వరి రకాలు త్వరగా పండుతాయి. కొన్నింటికి రకరకాల చీడపీడలను తట్టుకొనే శక్తి ఉంటుంది. వీటన్నింటికీ కారణం వాటిలో ఉండే జన్యువులు. ఆయా వరి రకాల్లో ఉన్న మంచి లక్షణాలకు కారణమైన జన్యువులను వేరు చేసి వాటి ద్వారా కొత్త రకాన్ని అభివృద్ధి చేశాం. దీనిపై ప్రస్తుతం క్షేత్ర స్థాయి పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి దాదాపుగా పూర్తయినట్లే. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత దీనిని ఈ ఏడాది మధ్యలో రైతులకు అందిస్తాం’ అని ఈ వరి రకాన్ని అభివృద్ధి చేసిన డాక్టర్‌ హితేంద్ర పటేల్‌ ఆంధ్రజ్యోతికి వివరించారు. ఏదైనా కొత్తరకం వరిని విడుదల చేసే ముందు మూడేళ్ల పాటు పరీక్షలు జరుపుతారు.
ఈ పరీక్షల్లో పర్యావరణం, ఇతర పంటలు, ప్రాణులకు ఎటువంటి హాని ఉండదని తేలిన తర్వాత దానిని మార్కెట్‌లోకి విడుదల చేయటానికి అనుమతిస్తారు. సీసీఎంబీ ఇప్పటికే వివిధ రకాల చీడపీడలను తట్టుకొనే వరిని అభివృద్ధి చేసింది. ‘పంటల విషయంలో జన్యుస్థాయిలో పరిశోధనలు చాలా కష్టం. ఎందుకంటే.. కొన్ని వేల ఏళ్ల పరిణామక్రమం తర్వాత ఈ పంటలు ప్రస్తుత స్థితికి వచ్చాయి. అంటే వాటిలో ఉండే జన్యువుల కూడా అనేక రకాల మార్పులకు లోనయ్యాయి. మేము అలాంటి మార్పులు రావటానికి కారణమైన జన్యువులను ముందుగా గుర్తిస్తాం.
ఉదాహరణకు.. ఒక రకం వరి మిగిలిన వాటి కన్నా ముందే సిద్ధమవుతోందనుకుందాం. దీనికి కారణమైన జన్యువులను మేము గుర్తిస్తాం. ఈ జన్యువులను విడదీసి వేరే రకాల్లో ప్రవేశపెడతాం. ఆ తర్వాత ఈ జన్యువులు ప్రవేశపెట్టడం వల్ల వచ్చిన మార్పులను గమనిస్తాం. ఉదాహరణకు ఎక్కువ దిగుబడినిచ్చేందుకు కారణమైన ఒక జన్యువును ప్రవేశపెడితే దాని వల్ల మొక్కకు చీడలను తట్టుకొనే శక్తి తగ్గిపోవచ్చు.. ఇలాంటి రకరకాల చర్య – ప్రతిచర్యలను గమనించిన తర్వాత కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తా’ అని వివరించారు. గత ఏడాది సీసీఎంబీ సాంబమసూరిలో ఒక కొత్త రకాన్ని రైతుల కోసం విడుదల చేసింది. ‘దక్షిణ భారత దేశంలో సాంబమసూరిని ఎక్కువగా తింటారు. అందుకే మేము ఆ రకాన్ని ఎన్నుకున్నాం. కొత్తరకం వరికి కూడా ఇదే మూలం’ అని హితేంద్ర వివరించారు.
 Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *