సేంద్రియ మునగ

  • సత్ఫలితాలు ఇస్తున్న వేస్ట్‌ డీకంపోజర్‌
 
ఆవుపేడ, గోమూత్రంలో ఉండే బ్యాక్ట్టీరియాను తీసి, నానో టెక్నాలజీ ద్వారా వృద్ధి చేసిన వేస్ట్‌ డీకంపోజర్‌ అద్భుతాలు చేస్తున్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సమీపంలో ఏకలవ్య ఫౌండేషన్‌ సేంద్రియ పద్ధతుల్లో ప్రయోగాత్మకంగా పంటలు పండిస్తున్నది.
వేస్ట్‌ డీకంపోజర్‌తో మునగ సాగు విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సమీపంలోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో 2015లో 3023 మొక్కలను నాటారు. వాటిలో అంతర్‌ పంటగా, ఆకుకూరలను సాగుచేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా వేస్టు డీకంపోజర్‌, లొట్టపీస్‌ ఆకు కషాయం, పుల్లని మజ్జిగను మునగ తోటకు స్ర్పే చేస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు.
ఆవుపేడ, గోమూత్రంలో ఉండే బాక్టీరియాలను నానో టెక్నాలజీ ద్వారా వృద్ధి చేసిన 250 మిల్లీలీటర్ల వేస్ట్‌ డీకంపోజర్‌ను రూ. 20కు కొనుగోలు చేస్తారు. దీనిని 200 లీటర్ల నీటిలో రెండు కేజీల బెల్లంతో పాటుగా కలపాలి. ఆరు రోజుల తరువాత దాన్ని తీయాలి. ఆ మిశ్రమాన్ని మరో ఆరు రోజుల పాటు పంటలపై పిచికారీ చేస్తే మునగ, ఇతర పంటలపై పురుగులు నాశనం అవుతాయి. మొక్కకు పోషకాలైన నైట్రోజన్‌, పాస్ఫరస్‌, పొటాషియం అంది ఏపుగా పెరుగుతాయి. కేజీ లొట్టపీస్‌ ఆకులు బాగా నూర్పిడి చేసిన తరువాత 10 లీటర్ల నీటిలో వేడిచేయాలి. ఆ తర్వాత చల్లార్చి వడపోయాలి. దానికి మరో 250 గ్రాముల సర్ఫ్‌ను కలిపి ఒక ఎకరానికి స్ర్పే చేయడానికి అవకాశం ఉంది. దీంతో పంటపై లద్దె పరుగు, పచ్చపురుగు, ఆకుచుట్ట పురుగు చనిపోతుంది. కేజీ పుల్లని పెరుగును, ఆరు లీటర్ల నీటిలో ఆరు రోజుల పాటు మురగబెట్టాలి. ఆ తరువాత వడబోసి స్ర్పేచేస్తే పూత రాలడం ఆగిపోతుంది. గతంలో బొప్పాయి సాగులో ఇలాంటి ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించారు. ఇప్పుడు మునగ సాగులో కూడా ఉపయోగించి అధిక దిగుబడులు పొందుతున్నామని ఏకలవ్య ఫౌండేషన్‌ నిర్వాహకులు చెప్పారు.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కల్వకుర్తి అర్బన్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *