సోలార్‌ పవర్‌ స్ర్పేయర్‌

 

తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన సోలార్‌ పవర్‌ స్ర్పేయర్‌, బోరుబావి మోటార్‌ను రిమోట్‌ సాయంతో ఆన్‌ చేసి ఆఫ్‌ చేసే పరికరాన్ని తయారు చేశారు వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ముప్పారపు రాజు.
తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం వున్న వ్యవసాయ పరికరాలు తయారుచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ముప్పారపు రాజు. డిగ్రీ వరకు చదివిన రాజు ఇప్పటికే పలు వ్యవసాయ పరికరాలను తయారుచేసి ప్రశంసలు పొందారు.
తాజాగా సోలార్‌ పవర్‌ స్ర్పేయర్‌, ఆటోమెటిక్‌ స్టార్టర్‌, కలుపు తీసే కొడవలిని తయారు చేశారు. పంటలకు తెగుళ్లు సోకినప్పుడు వాటిని నివారించేందుకు మందులు పిచికారీ చేస్తారు రైతులు. అందుకోసం పెట్రోల్‌తో నడిచే స్ర్పేయర్లు మార్కెట్‌లో అందుబాటులో వున్నాయి. వాటికంటే సౌకర్యవంతంగా, శబ్దం లేకుండా, తక్కువ ఖర్చుతో సోలార్‌ పవర్‌ స్ర్పేయర్‌ను తయారు చేశారు రాజు.
ఈ పరికరంతో తక్కువ శ్రమతో వేగంగా మందులు స్ర్పే చేయవచ్చు. ఐదు లీటర్ల ట్యాంక్‌, డీసీ మోటార్‌, సోలార్‌ ప్యానల్‌ వంటి పరికరాలతో ఈ స్ర్పేయర్‌ను తయారు చేశారు. సోలార్‌ పవర్‌ ప్యానల్‌ను ఫ్లైవుడ్‌ చెక్కకు బిగించి రైతు తలకి ఎండ తగలకుండా అమర్చారు. ప్లాస్టిక్‌ ట్యాంక్‌ ఉపయోగించి, ఎక్కవ దూరం మందును చల్లే విధంగా ఆ పరికరాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు.
3 గంటలు ఎండలో ఉంచితే ఈ పరికరాన్ని 8 గంటలు వాడవచ్చు. 10 అడుగుల వరకు దూరం వరకు స్ర్పే చేయగలుగుతుంది. ఈ పరికరానికి పెద్దగా మరమ్మతులు అవసరం లేదు. దీన్ని తయారు చేయడానికి రూ.6 వేలు ఖర్చయినట్టు రాజు తెలిపారు. మార్కెట్‌లో దీన్ని రూ.8 వేలకు విక్రయిస్తున్నారు. పెట్రోల్‌తో నడిచే పవర్‌ స్ర్పేయర్‌ రూ.10 నుంచి రూ. 20వేల వరకు ధర పలుకుతున్నది.
రైతులు విద్యుత్‌ ప్రమాదాలు బారిన పడకుండా ఉండేందుకు రిమోట్‌తో పనిచేసే బోరుబావి మోటార్‌ను తయారు చేశారు రాజు. దూరం నుంచే మోటార్‌ను ఆన్‌, ఆఫ్‌ చేయవచ్చు. రేడియో తరంగాలతో పనిచేస్తే ట్రాన్స్‌మీటర్‌, రిసీవర్‌ను తీసుకుని దానిని స్టార్టర్‌కి అనుసంధానం చేసి ట్రాన్స్‌మీటర్‌ని నొక్కినప్పుడు మోటార్‌ ఆన్‌ అవుతుంది. ఆఫ్‌ నొక్కగానే ఆగిపోయేలా దీన్ని రూపొందించారు. స్థానికంగా దొరికిన పరికరాలతో దీన్ని తయారు చేయడం విశేషం. రిమోట్‌ 300 మీటర్ల దూరం వరకు పనిచేస్తుంది.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ రూరల్‌
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *