ఖర్జూర సాగు.. లాభాలు బాగు

ఖర్జూర అనగానే గుర్తొచ్చేది అరబ్‌ దేశాలు.. అధిక ఉష్ణోగ్రతల్లో పండే ఖర్జూరానికి గిరాకీ
నానాటికీ పెరుగుతోంది. నాణ్యమైన ఖర్జూరాలు కావాలంటే దిగుమతి చేసుకోవాల్సిందే.
ఈ పరిస్థితిని గమనించిన నల్లగొండ సమీపంలోని నర్సింగ్‌భట్ల గ్రామానికి చెందిన
బండారు ఆగమయ్య ఖర్జూర సాగు చేపట్టారు. గణనీయంగా లాభాలు గడిస్తూ
ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎడారి పంటగా పేరుబడిన ఖర్జూరను నల్లగొండలో పండించాలనే ఆలోచనే సాహసంతో కూడుకున్నది. కానీ ఆగమయ్య ఆ దిశగా ఆలోచించారు. తనకున్న రెండెకరాల భూమిలో 2012లో ఖర్జూరపంట వేసేందుకు సిద్ధమయ్యారు. ఖర్జూర మొక్కలను కొనుగోలు చేసేందుకు గుజరాత్‌కు వెళ్లి ఒక్కో మొక్కను రూ.3వేల చొప్పున కొనుగోలు చేశారు. రెండెకరాల భూమిలో 120 మొక్కలను నాటారు. దుబాయి నుంచి దిగుమతి చేసుకున్న టిష్యూ కల్చర్‌ ఖర్జూర మొక్కలను ఇందుకు వినియోగించారు. నిజానికి చౌడు నేలల్లో ఎలాంటి పంటలు పండవు. అలాంటి నేలల్లో ఖర్జూరం పండించాలి కాబట్టి సాధారణ రకాలు కాకుండా టిష్యూ కల్చర్‌ మొక్కలను నాటారు. రెండు అడుగుల మేరకు గుంతలు తీసి రెండు ఎకరాల్లో మొక్కలు నాటారు. పూర్తిగా చౌడు భూమి కావటంతో ఆ గుంతల్లో ఎర్రమట్టిని పోసి మొక్కలు పెంచారు. ఒక్కో పాదు మధ్య 20 అడుగుల దూరం ఉండేలా ఎకరాకు 60 మొక్కల చొప్పున రెండెకరాల్లో 120 మొక్కలను నాటారు. వీటికి బోరు ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. అయితే వీటి కాత అంతా పరపరాగ సంపర్కం ద్వారా జరుగుతుంది. అందుకోసం ఎకరాకు 3 మగ ఖర్జూర చెట్లను నాటారు. ఈ మగ చెట్ల నుంచి వచ్చే కాయలను పొడి చేసి ఆ పొడిని ఆడ ఖర్జూర చెట్లకు వచ్చే గెలలపై చల్లుతారు. మొక్కలు కొనేందుకు ఖర్చు తప్ప ఖర్జూరం సాగుకు మిగిలిన ఖర్చులు తక్కువే. ఎకరానికి ఏడాదికి 10 వేల వరకు ఖర్చయిందన్నారు ఆ రైతు. కిలో ఖర్జూరను రూ. 120లకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోనే ఈ పంటను అమ్మేందుకు సరిపోతోంది. అదేవిధంగా యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌ నుంచి కూడా కొంతమంది వ్యాపారులు వచ్చి ఖర్జూరను కొనుగోలు చేసి వెళ్తున్నారన్నారు ఆ రైతు. ఏటా జూలైలో పంట దిగుబడి వస్తుంది. ప్రతి చెట్టుకు మొదట్లో 20 కిలోల చొప్పున దిగుబడి రాగా ప్రస్తుతం సుమారు 80 కిలోల వరకు దిగుబడి వస్తోంది. తొలి ఏడాది 24 క్వింటాళ్లకు రూ. రెండు లక్షల ఆదాయం వచ్చినట్లు రైతు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధర క్వింటాకు సుమారు రూ.12వేలు పలుకుతున్నది. దీంతో రూ.10 లక్షల ఆదాయం లభిస్తుంది. ఈ రైతు స్ఫూర్తితో జిల్లాలో ఖర్జూరం సాగు ఊపందుకుంటుందంటున్నారు వ్యవసాయ నిపుణులు.
లాభాలకు ఢోకా లేదు
పత్తి, మిరప పంటలను సాగు చేసి నష్టపోవటం కంటే ఖర్జూర చెట్లను పెంచుకుంటే మేలు. లాభాలకు ఢోకా వుండదు. పండిన ఖర్జూరాన్ని ఎండు ఖర్జూరగా మార్చటానికి ప్రాసెసింగ్‌ యూనిట్లు లేకపోవటంతో కోసిన నాలుగైదు రోజుల్లోనే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంతో పాటు పాలు ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *